Home జాతీయ వార్తలు రోజురోజుకూ కోరలు చాస్తున్న కరోనా

రోజురోజుకూ కోరలు చాస్తున్న కరోనా

 

Coronavirus positive cases cross 18 lakh

 

18 లక్షలు దాటిన పాజిటివ్‌లు
38 వేలకు పైగా మరణాలు
ఒక్క రోజే 52,872 కేసులు, 771 మరణాలు
12 లక్షలకు చేరువలో రికవరీలు
ఒకే రోజు 40,579 మంది డిశ్చార్జి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. గత వారం రోజులుగా నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉన్న విషయం తెలిసిందే. తాజా గా గడచిన 24 గంటల్లో కొత్తగా 52,872 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,03,695కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంట ల్లో 771 మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 38,135కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది. కాగా కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లగా, 5,79,357 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజే 40,579 మంది కోలుకుని ఇళ్ల కు వెళ్లారు.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 65.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.11 శాతంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. దేశంలో కరోనా తీవ్రత పెరిగిందని చెప్పడానికి గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులే నిదర్శనం. గడచిన వారం రోజుల్లో దేశంలో 3.5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు రెట్టింపు కావడానికి (డబ్లింగ్ రేటు) 21 రోజుల సమయం పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. మరణాలో ్లఐదోస్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా సంభవించిన మరణాల్లో అత్యధికంగా 260 మరణాలు మహారాష్ట్రలో నమోదు కాగా, తమిళనాడులో 98, కర్నాటకలో 84, ఆంధ్రప్రదేశ్‌లో 67, యుపిలో 53, పశ్చిమబెంగాల్‌లో 49, గుజరాత్‌లో 22 మరణాలు నమోదైనాయి.

కాగా ఒకప్పుడు మహారాష్ట్ర తర్వాత అటు కేసుల విషయంలో, ఇటు మరణాల్లో రెండో స్థానంలో ఉండిన ఢిల్లీలో వైరస్ ఉధృతి బాగా తగ్గుముఖం పట్టింది. తాజాగా అక్కడ కేవలం 15 మంది మాత్రమే వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 15,576 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా తమిళనాడులో 4,132 మంది, ఢిల్లీలో 4,004 మంది, కర్నాటకలో 2,496 మంది, గుజరాత్‌లో 2,486 మంది, యుపిలో 1,730 మంది, పశ్చిమ బెంగాల్‌లో 1,678 మంది, ఎపిలో 1,474 మంది మృతి చెందారు.

కార్తి చిదంబరానికి కరోనా
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, కార్తి చిదంబరానికి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.అయితే కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు హోం కక్వారంటైన్‌లో ఉంటున్నట్లు తెలిపిన ఆయన ఇటీవల తనను కలిసిన వారంతా వైద్యుల సలహాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

యెడియూరప్ప కుమార్తెకూ పాజిటివ్
కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్పకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మణిపాల్ ఆస్పత్రి సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపింది. తాను కొవిడ్ బారిన పడినట్లు యెడియూరప్ప ఆదివారం స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించిన విషయం తెలిసింది. ఆయన నిన్ననే మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా సిఎం కార్యాలయంలో ఆరుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది.

2 కోట్లు దాటిన టెస్టులు
న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూ ఉంటే మరోవైపు వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దెత్తున వ్యాధినిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యం 3 నుంచి 5 లక్షల దాకా పరీక్షలు చేపడుతున్నారు. నిన్న ఒక్క రోజే 3,81,027 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల సంఖ్య 2,02,02,858కు చేరుకున్నట్లు తెలిపింది. జులై 30న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6 లక్షల 42 వేల శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. గడచిన 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. జనవరి నెలలో దేశంలో ఒకే ఒక కొవిడ్ నిర్ధారణ కేంద్రం ఉండగా ప్రస్తుతం 1300కు పైగా ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

హోం ఐసొలేషన్‌లో రవిశంకర్
కరోనా మహమ్మారి దేశంలో ప్రముఖులు, రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను కలిసిన పలువురు హోం ఐసొలేషన్‌లోకి వెళ్తున్నారు. హోంమంత్రి అమిత్ షాకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, అంతకు ముందు ఆయనను కలిసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హోం ఐసొలేషన్‌లోకి వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా ఆదివారం తనకు కరోనా సోకినట్లు తెలియజేయడానికి ముందు తాను శనివారం ఆయనను కలిసినట్లు రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు.

తనకు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, అయినప్పటికీ నిబంధనల ప్రకారం సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటతున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. ఇంటినుంచే విధులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం తన సిబ్బందికి వైరస్ సోకగా రవిశంకర్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. ఇప్పటికే ఆదివారం అమిత్ షాను కలిసిన మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సైతం వైద్యుల సలహా మేరకు ఐసొలేషన్‌లో ఉండనున్నట్లు ప్రకటించారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెల్ సమావేశంలో అమిత్‌షాతో పాటుగా పాల్గొన్న మంత్రి గజేంద్ర షెకావత్ సైతం హోంక్వారంటైన్‌లో ఉండనున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

Coronavirus positive cases cross 18 lakh