Home జాతీయ వార్తలు కరోనా రోగులు 724… మృతులు 17

కరోనా రోగులు 724… మృతులు 17

Coronavirus

 

వైరస్‌తో ముంబై డాక్టరు మృతి
మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువ, విదర్భలో ఐదుగురికి వైరస్
కేరళలో అత్యధిక సంఖ్య

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ అమలులోకి వచ్చి మూడు రోజులు అయింది. వైరస్ సోకిన వారిలో 66 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మహారాష్ట్రలో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 130 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందారు. గుజరాత్‌లో 43 మందికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు మృతి చెందారు. కర్నాటకలో 55 కేసులు రాగా, ఇద్దరు మృతి చెందారు. దేశంలో కేరళలోనే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు రికార్డు అయ్యా యి. ఇక్కడ శుక్రవారం నాటికి 137 మందికి వైరస్ పట్టుకుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరుకుంది. వీరిలో పది మంది విదేశీయులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12 కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. రాజస్థాన్‌లో 41 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 40 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది.

సామూహిక వ్యాప్తి లేదు
విదేశాల నుంచి వచ్చిన వారికి, వారి సంబంధితులకు కరోనా సోకిందని, అయితే ఇప్పటివరకూ కమ్యూనిటి ట్రాన్స్‌మిషన్ ఎక్కడ నమోదు కాలేదని నిర్థారించారు. అత్యధిక జనాభా, జనసాంద్రత అత్యధికంగా ఉండే మన దేశంలో ఒకరి నుంచి వేరొకరికి అంటుకునే కమ్యూనిటి వ్యాప్తి పరిణామం లేకపోవడం మంచి పరిణామంగా మారింది. లాక్‌డౌన్‌కు ముందు లాక్‌డౌన్ తరువాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులలో తగ్గుదల చోటుచేసుకుంది. అయితే పూర్తి స్థాయిలో నియంత్రణ జరగలేదని అధికారిక గణాంకాలతో స్పష్టం అయింది. వైరస్‌తో ముంబైకు చెందిన ఒక డాక్టరు మృతి చెందారు. ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో ఆయన గురువారం రాత్రి మృతి చెందారు. 82 సంవత్సరాల ఈ డాక్టరు మునిమనవడు ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చాడు.

ఆయన స్వీయ క్వారంటైన్‌లో ఉన్నాడని, ఈ క్రమంలో ఈ డాక్టరుకు కరోనా సోకిందని, విపరీతంగా దగ్గు ఇతర కరోనా లక్షణాలు తలెత్తడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు వెల్లడైంది. ఈ డాక్టరు కుటుంబంలోని ఆరుగురుకి వైరస్ సోకినట్లు నిర్థారణ అయిం ది. శుక్రవారం రాజస్థాన్‌లో రెండో కరోనా కేసు నమోదు అయింది. అత్యధిక బిపి, కిడ్నీ సమస్యలు ఉన్న 60 ఏళ్ల ఈ వ్యక్తికి కరోనా సోకడంతో తట్టుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు వెల్లడైంది. రాజస్థాన్‌లోనే గురువారం భిల్వారా జిల్లాకు చెందిన 73ఏండ్ల వ్యక్తి కిడ్నీల వైఫల్యం తో మృతి చెందాడు. కరోనాతోనే ఆయన మృతి చెందినట్లు చెపుతున్నారు. అయితే దీనిని అధికారులు నిర్థారించలేదు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మరో ఐదు కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. ఈ విషయాన్ని సివిల్ సర్జన్ డివి పతూర్కర్ తెలిపారు. వీరిలో నాగ్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు ఉన్నారు. పింప్రి చించ్వాద్‌లో 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్ ముగ్గురు వ్యక్తులకు ఇప్పుడు నెగెటివ్ వచ్చింది.

Coronavirus Positive Cases raised to 724 in India