Friday, March 29, 2024

ఖాకీల్లో కరోనా భయం

- Advertisement -
- Advertisement -

ts-police

 ఫ్రంట్‌లైన్ వారియర్లకు కరోనా టెన్షన్
మూడు కమిషనరేట్లలో కరోనా బారినపడిన పోలీసులు
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
కరోనాతో కానిస్టేబుల్ మృతి
రక్షణ చర్యలు తీసుకుంటున్న పాజిటివ్ బారిన పోలీసులు

హైదరాబాద్: కరోనా వ్యాపించకుండా ముందుండి పోరాడుతున్న పోలీసులు వరుసగా కరోనాబారిన పడుతున్నారు. గతంలో మార్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ రాగా, వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మూడు కమిషనరేట్లలో వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ బారినపడుతున్నారు. బాలాపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్‌కు పాజిటివ్ రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలాగే చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని చెక్‌పోస్టులో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ వాహనాల తనిఖీల్లో భాగంగా పలువురిని విచారించాడు.

దీంతో ఓ వ్యక్తి నుంచి సదరు కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ వ్యాపించింది. అలాగే గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్‌కు పాజిటివ్ వచ్చింది. అతడి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. చిలకలగూడ పిఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌ఐలకు పాజిటివ్ వచ్చింది. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న నలుగురు ట్రాఫిక్ పోలీసులకు కరోనా రావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను డిస్‌ఇన్‌ఫెక్షన్ చేశారు. ఇందులో ఓ ఎస్‌ఐ తండ్రికి పాజిటివ్ రావడంతో, విషయం పై అధికారులకు చెప్పకుండా విధులకు హాజరయ్యాడు.

విషయం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసి హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. ఎస్‌ఐని కలిసిన వారిని కూడా హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. నగరంలో కామాటిపుర, అఫ్జల్ గంజ్, బహదూర్‌పురా, సైదాబాద్, సైఫాబాద్, బోయిన్‌పల్లి పిఎస్‌లో పనిచేస్తున్న వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈస్ట్‌జోన్‌లో పోలీసుల స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న తొమ్మిది మంది పోలీస్ కానిస్టేబుళ్లకు పాజిటివ్ వచ్చింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ్డ కరోనా పాజిటివ్‌తో మృతిచెందాడు. వరుసగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలో ఆందోళన నెలకొంది.

చెక్‌పోస్టులు హాట్‌స్పాట్లు…

కరోనా వ్యాపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి సమయంలో కర్ఫూ అమలు చేయడంతో పోలీసులు మూడు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించారు.

పోలీసులు హైరిస్కులో పనిచేస్తుండడంతో ముగ్గురు సిపిలు పోలీసుల ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పటి కప్పుడు వైద్య పరీక్షలు చేయడంతోపాటు వారికి డ్రైఫ్రూట్స్, విటమిన్ డి, సి ట్యాబ్లెట్లు, ఎనర్జీ డ్రింక్‌లు అందజేశారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు, హెడ్ షీల్డ్‌లు అందజేశారు. అయినా కూడా కొందరు పోలీసులకు కరోనా రావడంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా వెంటనే తమకు తెలిపితే సాయం చేస్తామని వారు తమ సిబ్బందికి సూచించారు.

Coronavirus stricken police in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News