Home ఎడిటోరియల్ సంపాదకీయం: మన రైల్వేలకు ప్రైవేటు పుష్టి

సంపాదకీయం: మన రైల్వేలకు ప్రైవేటు పుష్టి

sampadakeyam

భారతదేశ రవాణా సాధనాల్లో అత్యంత ప్రధానం, ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి రైల్వేల అభివృద్ధికి 201819 కేంద్రబడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మునుపెన్నటికన్నా ఎక్కువగా రూ.1,48,528 కోట్లు కేటాయించటం ప్రశంసలు పొందుతున్నది. 92ఏళ్లుగా ఆచరణలో ఉన్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ విధానం రద్దుచేసి, దాన్ని కేంద్రబడ్జెట్‌లో అంతర్భాగంగా సమర్పించిన రెండవ సంవత్సరం ఇది. కేంద్ర బడ్జెట్‌లో విలీనం తదుపరి రైల్వేల పెట్టుబడి వ్యయం ఆశించినంతగా పెరగలేదు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ చివరి సంవత్సరం (201617)లో కేటాయింపు రూ.1,21,000కోట్లు. కేంద్రబడ్జెట్‌లో భాగమైన తొలి సంవత్సరం (201718)రూ.1.31వేల కోట్లకు అనగా రూ.10వేల కోట్లు పెరిగింది. ప్రసుత్త బడ్జెట్‌లో రూ.17వేల కోట్లు పెంపు ప్రతిపాదించారు. అయితే ఇందులో బడ్జెట్ వనరుల నుంచి కేటాయింపు రూ.55,000 కోట్లు మాత్రమే. మిగతా రూ.93వేల కోట్లు బడ్జెటేతర మార్గాల ద్వారా ముఖ్యంగా రుణాల ద్వారా సమకూర్చుతారు. అంతర్గత వనరుల సమీకరణ తగినంతగా లేనందున, రైల్వేలను త్వరితంగా విస్తరించేందుకు, ఆధునీకరించేందుకు అప్పులు చేయక తప్పటం లేదంటారు. ఈ క్రమాన్ని అరికట్టకపోతే అప్పులు తలకు మించిన భారం అవుతాయి.

వ్యయం తగ్గించుకునే నిమిత్తం సేవల మెరుగుదల పేరుతో రైల్వేల్లో అనేక సేవలను ఇప్పటికే ప్రైవేటీకరించారు. ఇప్పుడున్న రైలుమార్గాలు, రైళ్లు, నిర్వహణను ప్రైవేటీకరిస్తే పుట్టగతులుండవని గ్రహించిన పాలకవర్గం మున్ముందు కొన్ని కొత్త రైల్వే మార్గాలను నిర్మాణం, యాజమాన్యం, రైళ్వ నిర్వహణప్రైవేటువారికి అప్పగించే ప్రతిపాదనను రైల్వేబోర్డు పరిశీలిస్తున్నట్లు చెప్పబడుతున్నది. అప్పుడు ఆ మార్గాలకు రైల్వేలు లైసెన్స్ మంజూరు చేసి ఫీజు వసూలు చేసుకుంటాయి. రైలు మార్గాల నిర్మాణం, రైళ్లు నడపటంలోకి ప్రైవేటురంగాన్ని అనుమతించే ఆలోచనల గూర్చి రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌ను ప్రశ్నించినపుడు ఆయన దాన్ని నిరాకరించలేదు. “రైల్వేల రంగంలో ప్రైవేటు ప్లేయర్లు పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎందుకు ప్రవేశించకూడదు? వారు మన సామర్థాన్ని పెంపుచేస్తారు, భారీగా పెట్టుబడులు తెస్తారు” అని సమాధానమిచ్చారు. జాతీయ రహదారుల అభివృద్ధిని బిఒటి పద్ధతిపై ప్రైవేటు రంగానికి అప్పగించి, టోల్ వసూలును అనుమతించి వారు ప్రభుత్వ రవాణా సాధనాలు సహా వాహనదారులను దోచుకుంటున్నప్పటికీఈ అభివృద్ధి అంతా తమదేనంటూ సొంత ఖాతాలో వేసుకుంటున్న పాలకులు రైల్వేల విస్తరణకు ప్రైవేటు ప్లేయర్లను అనుమతిస్తే ఆశ్చర్య పడాల్సింది లేదు. ‘వ్యాపారం ప్రభుత్వం పనికాదు’ అన్న నయా ఉదార ఆర్థిక సిద్ధాంతం అటే నడిపిస్తుంది.

201314 రైల్వే బడ్జెట్‌లో పెట్టుబడి కేటాయింపు రూ.53,989కోట్లతో పోల్చితే ప్రస్తుత కేంద్రబడ్జెట్‌లో రూ.1,48,528కోట్ల కేటాయింపు హర్షణీయం. అయితే వేగంగా విస్తరిస్తున్న ముంబయి, బెంగుళూరు మహా నగరాల్లో సబర్బన్ రైళ్ల వ్యవస్థ విస్తరణకు (11000+17000) రూ.28వేల కోట్లు కేటాయించారు. రూ.40వేల కోట్లతో ముంబయిలో 150కి.మీ. సబర్బన్ మార్గం నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. కాని హైదరాబాద్ మహానగరంలో ఎంఎంటిఎస్ విస్తరణకు నిధుల ప్రస్తావన లేదు.
రైల్వే ప్రాజెక్టుల గూర్చి చేసే ప్రకటనలకు వాస్తవ పనితీరుకు పొంతనలేకుండా ఉంది.

అనేక ప్రాజెక్టులు నిర్ణీత గడువులు దాటిపోతున్నాయి. సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్ ఇందుకొక ఉదాహరణ. అయితే రైల్వేల నిర్వహణపట్ల ప్రయాణీకుల్లో, సరకు రవాణా చేసే వ్యాపారుల్లో సంతృప్తి పెరగటం వాస్తవం. 201819లో మొత్తం రెవెన్యూ జమలు 7శాతం పెరిగి రూ.2,01,090కోట్లకు చేరతాయని అంచనా. రైల్వేల ఆపరేటింగ్ దామాషా ప్రస్తుతం సంవత్సరంలోని 96శాతం నుంచి 201819లో 92.8శాతానికి తగ్గుతుందన్న అంచనా హర్షించదగింది. ఈ దామాషా తగ్గటమంటే వ్యయంకన్నా ఆదాయం పెరగటం. వచ్చే ఏడాది ఇది రూ.12,990కోట్లు ఉంటుందని అంచనా. రైల్వే లు, రహదారులు,రేవులు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతుల అభివృద్ధి వల్ల ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయి, వేగిరమవుతాయనుటలో సందేహం లేదు.