Thursday, April 25, 2024

ధరణి దందాలో అధికారులు..ఇబ్బందుల్లో రైతులు..

- Advertisement -
- Advertisement -

కోహెడ : ధరణి పోర్టల్ ప్రారంభమైన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో అవినీతికి తావులేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. క్షణాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయై, వెంటనే పట్టా పాస్‌బుక్ జిరాక్స్ ఇస్తుండటంతో రైతులు తెగ సంతోషపడిపోయారు. కానీ అవినీతి అధికారుల చేతివాటంతో రైతుల సంతోషం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులు ధరణిని ఓ దందాగా మార్చి మద్యవర్థుల ఏర్పాటు చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు.. ఓ రైతు 50 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని ఇతరులకు రిజ్రిస్టేషన్ చేసి పాస్‌బుక్ అందజేశారని, తమకు న్యాయం చేయాలంటూ బాధిత రైతు తన కుటుంబ సభ్యులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం బైఠాయించారు.

బాధిత రైతు కుటుంబానికి కోహెడ మండల అఖిల పక్షం, బిఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అఖిల పక్షం, బిఆర్‌ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కోహెడ గ్రామానికి చెందిన గూళ్ల బాలయ్య అనే నిరుపేద రైతు గత 50 ఏళ్లుగా సర్వేనెం 89/ఈ లో 2 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని క్రమబద్దీకరణ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకొని, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ప్రభుత్వం సాదాబైనామా క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్పడంతో ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ధరణీ పోర్టల్ ప్రారంభమైన తర్వాత.. పోర్టల్‌లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా చేసుకొని ఆ పట్టాదారు వారసులకు రెవెన్యూ అధికారులు విరాసత్ చేశారు. ఆ తర్వాత తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి ఒక్కోక్క ఎకరం చొప్పున రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే మోఖా మీదా నేను ఉన్నాని, భూమి సాగుచేసుకొని ఫలితాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నామని, నా భూమిని ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని బాధిత రైతు గూళ్ల బాలయ్య లబోదిబోమని రెవెన్యూ అధికారుల ముందు మొత్తుకున్నాడు.

రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి నా భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని బాధిత రైతు గూళ్ల బాలయ్య అఖిల పక్షం దృష్టికి తీసుకెళ్లగా, వారు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు. బాధిత రైతు బాలయ్యకు న్యాయం చేయాలని అఖిల పక్షం నాయకులు, బిఆర్‌ఎస్ నాయకులు స్థానిక తహశీల్దార్ జావిద్ అహ్మద్‌ను కోరారు. రైతు బాలయ్యకు న్యాయం జరిగేవిధంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ దృష్టికి తీసుకెళ్లుతామని వైస్ ఎంపిపి తడకల రాజిరెడ్డి, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పెరుగు నరేందర్ రెడ్డి, బీంరెడ్డి రాజిరెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, మంద ధర్మయ్య, ముంజ గోపి, సర్పంచులు మ్యాకల చంద్రశేఖర్ రెడ్డి, అన్నవేని కనకయ్య, నాయకులు శెట్టి సుధాకర్, వేల్పుల వెంకటస్వామి, గుగ్గిళ్ల శ్రీనివాస్, బొమ్మగాని శివకుమార్ గౌడ్, మ్యాకల రజనీకాంత్ రెడ్డి, అన్నబోయిన బిక్షపతి, దూలం శ్రీనివాస్ గౌడ్, ర్యాగటి బాబు, మ్యాకల సురేందర్ రెడ్డి, ముంజ రాజేంద్రం తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News