Home ఎడిటోరియల్ ‘రైల్ నీర్’లో అవినీతి

‘రైల్ నీర్’లో అవినీతి

The speed of trains by 2022 is 25 km per hour

స్వలాభాపేక్ష కోసం సజావుగా నడుస్తున్న ప్రజా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు దన్నుగా నిలువడంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలక వర్గాల, రాజకీయ నాయకుల హస్తం ఉంటోంది. మన దేశంలోని రైళ్లలో సరఫరా చేసే శుద్ధి చేసిన మంచినీరు కూడా కలుషిత వ్యవస్థలో భాగమైపోయింది. రైలు ప్రయాణికులకు తక్కువ ధరలో తాగు నీరు అందించాలనే సంకల్పంతో రైల్వే రైల్ నీర్ పేరిట మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేస్తోంది. రైల్వేలో లైసన్సు పొందిన ఆహార, పానీయ సరఫరాదార్లకు తక్కువ లాభంతో అప్పగిస్తుంది. రైల్వే కేటరర్లకు రూ. 10.50 పై. ఆ బాటిళ్లు లభించగా, రూ. 15/ కు ప్రయాణికులకు అమ్మాలి.రైల్ నీర్ ఆలోచన వల్ల ప్రయాణికులకు తక్కువ ధరకే శుద్ధమైన నీరు లభిస్తుండగా, అది భారత రైల్వేకు కూడా మంచి లాభాలు తెచ్చి పెడుతోంది. లీటరు బాటిల్‌పై అమ్మకందారుకు సుమారు అయిదు రూపాయలు లాభం రాగా రైల్వేకు 201718 ఆర్థిక సంవత్సరంలో రూ. 170 కోట్ల ఆదాయం వచ్చింది. రైల్వే ఆదాయంలో 11 నీటి వ్యవస్థవల్ల వచ్చిందే. దేశ వ్యాప్తంగా ఉన్న 8 నీటి శుద్ధి కేంద్రాల ద్వారా ఏడాదికేడాది లాభాలు వృద్ధి చెందుతున్నాయి. 201415లో రూ. 81 కోట్లు ఉండగా తర్వాత సంవత్సరంలో రూ. 120 కోట్లకు పెరిగింది. 7000 రైల్వే స్టేషన్‌లలో 1000కి పైగా రైళ్లలో అందుబాటులో ఉన్న రైల్ నీర్ ప్రయాణికుల వాస్తవ మంచినీటి అవసరాన్ని 25 శాతం మాత్రమే తీర్చుతోంది. రోజుకు 25 లక్షల నీటి బాటిళ్లు రైలు ప్రయాణికులకు అవసరం ఉండగా అందులో రైల్‌నీర్ 6 లక్షల బాటిళ్లను మాత్రమే అందించ గలుగుతోంది. ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి దేశ వ్యాప్తంగా 11 చోట్ల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో మంచినీటి ప్లాంట్లను ఆరంభించాలనే ఆలోచనలో ఉంది. అందులో ఒకటి హైదరాబాద్‌లో కూడా ప్రారంభం కావొచ్చు. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రైలు కార్యాలయాలకు నీళ్ల బాటిళ్ల సరఫరాను ఆపివేసింది. ఒక్క ఢిల్లీలోని ఉత్తర రైల్వే ప్రధాన కార్యాలయానికే రోజుకు వేయికి పైగా బాటిళ్లు వెళ్లేవి. ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసి రైల్ నీర్ సరఫరాను గత నెలలోనే ఆపివేస్తున్నట్లు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తొలిసారిగా రైల్వే శాఖ 65 2003న ఢిల్లీలో రైల్ నీర్ ప్లాంట్‌ను నెలకొల్పింది. అవి క్రమంగా వ్యాప్తి చెందుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 ప్లాంట్లు పని చేస్తున్నాయి. వీటి సంఖ్య ఇంకా పెరుగనున్నది. డిమాండ్ ఉన్నందు వల్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో శుద్ధి కేంద్రాలను నెలకొల్పేందుకు వ్యాపార వేత్తలు ముందు కొస్తున్నారు. మరో విశేషమైన విషయమేమిటంటే 2016లో అమెరికాకు చెందిన ఐబిసి ఇన్ఫోమీడియా అనే సంస్థ రైల్ నీర్‌ను భారతదేశపు అతి నమ్మదగిన ఉత్పత్తిగా గుర్తించింది. ఇండియన్ రైల్వేస్ కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్ నీర్ కేంద్రాలకు ఫ్రెంచి కంపెనీ అయిన సిడాల్ తోడ్పాటు ఉంది. ఎనిమిది స్థాయిల్లో నీరు శుద్ధి చేయబడుతుంది. బాటిల్ బరువును కూడా 21.5 నుండి 19.5 గ్రా.లకు తగ్గించగలిగింది.
ఇంత పరిశుద్ధంగా సాగుతున్న జలబంధంలోనూ కనబడని అవినీతి బాక్టీరియా చేరి దశాబ్ద కాలమైంది. ఒక్కో లీటర్ బాటిల్‌పై కాంట్రాక్టర్‌కు రూ. 4.50 పై లాభం దొరికినా అత్యాశకుపోయి అసలుకే ద్రోహం తలపెట్టారు. రైల్ నీర్ స్థానంలో చవకగా దొరికే నీరును బాటిళ్లలో ప్రయాణికులకు అందించి కోట్లకు పడగెత్తారు.. లైసెన్సు లేని అక్రమ నీటి కేంద్రాల నుండి కేవలం 56 రూపాయలకే లీటర్ నీటి బాటిళ్లకొని రూ. 15/కు కొన్నేళ్లుగా ప్రయాణికులకు సరఫరా చేస్తున్నారు. రైళ్లలో నీళ్ల బాటిళ్ల అమ్మకాలు తగ్గుతున్నట్లు చెబుతూ రైల్ నీర్ ఉత్పత్తి కేంద్రాల నుండి బాటిళ్లను తీసుకోవడం క్రమంగా తగ్గించారు. అక్టోబర్ 2015లో కాంట్రాక్టర్ ఇళ్లపై, ఆఫీసులపై జరిపిన దాడుల వల్ల అసలు గుట్టు బయటపడింది. జనవరి 1, 2013 నుండి 31 డిసెంబర్ 2014 వరకు లైసెన్సు పొందిన కాటరర్లు బయటి కంపెనీలతో అక్రమ ఒప్పందాలు చేసుకున్న పత్రాలు బయట పడ్డాయి. దీనివల్ల రైల్వే శాఖకు రూ. 19.55 కోట్ల నష్టం రాగా అంతకు మించి కాంట్రాక్టర్లు లాభపడ్డారు. దీనికి ప్రధాన సూత్రధారి ఢిల్లీకి చెందిన శ్యాం బిహారీ అగర్వాల్. సాధారణ రైల్వే కాంట్రాక్టర్ జీవితం ప్రారంభించిన ఈయన దశాబ్ద కాలంలో రూ. 500 కోట్లకు అధిపతి అయ్యాడు. రాజకీయ నాయకుల, అధికారుల ప్రాపకంతో భారతీయ రైల్వేలో 70 శాతం పైగా భోజన శాలలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అక్టోబర్ 2015లోనే మిగితా ఏడు ప్రైవేట్ కంపెనీలపై కూడా విచారణ జరిపి ఢిల్లీ, నోయిడా కేంద్రాలలో సిబిఐ కేసు ఫైలు చేసింది. అగర్వాల్ ఇంట్లో దొరికిన లెక్క తేలని రూ. 20 కోట్ల నగదును స్వాధీనపరచుకుంది. రైల్ నీర్ కోటాను తీసుకోకుండా సహకరించిన ఇద్దరు చీఫ్ కమర్షియల్ మేనేజర్ స్థాయి అధికారులను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. వారిని సిబిఐ అరెస్టు చేసింది కూడా. వీరిపై నేరపూరితమైన కుట్ర, చీటింగ్, కరెప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.సుదీర్ఘకాలంగా జరిపిన విచారణ, సోదాల ఆధారంగా ఈ నెల 14వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆర్.కె.అసోసియేట్స్, తదితర రైల్‌నీర్ స్కామ్‌తో సంబంధించిన సంస్థల రూ. 17.55 కోట్ల చరాస్థులను స్వాధీనపరచుకుంది.
భారతీయ రైల్వే కొన్ని ప్రముఖ రైళ్లలో మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తోంది. అయితే ఈ కాంట్రాక్టర్ల పంపిణీ సిబ్బంది నోరు విడిచి అడిగిన వారికి నీటి బాటిళ్లు ఇస్తారని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అంతేకాకుండా నీటి బాటిళ్లను తెల్లవారు జామున ఆయా రైళ్లలో ఉన్నవారికి మరో సారి ఉచితంగానే సరఫరా చేయవలసి ఉంటుంది. అయితే ఉదయం 8 నుండి 10 గంటల మధ్య దిగే సిబ్బంది దిగవలసిన స్టేషన్‌పై ఆదుర్దాగా ఉండడంతో నీళ్ల సీసాపట్ల ధ్యాస పెటరు. ప్రయాణ సమయం మొత్తానికి ఒకే బాటిల్ ఇస్తారేమోననే ఆలోచనతో కొందరు అడగరు. అడిగినా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కలిపి ఒక బాటిల్ ఇస్తారు. మరో గంట, రెండు గంటల్లో దిగిపోయే వారు ఒక బాటిల్‌తో కలిసి సరిపెట్టుకుంటారు. ఇలాగా ఈయని బాటిళ్ల సొమ్మును టికెట్ల లెక్కన రైల్వే కాటరింగ్ కార్పొరేషన్ నుండి వసూలు చేసుకుంటారు. ఈ మధ్య వాజక్కడ్‌లో రైల్వే తనిఖీ అధికారులు రైల్‌నీర్ ఖాళీ బాటిళ్లను తిరిగి వాడుతున్నారన్న విషయాన్ని దొరకబట్టారు. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత పిల్లలు రైళ్లలోకి ఎక్కి సేకరించిన నీళ్ల బాటిళ్లను కొందరు కొనుగోలు చేసి మామూలు నీళ్లతో నింపి కాటరర్లకు, రైల్వే స్టేషన్‌లలో పానీయ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి నకిలీ నీళ్ల తయారీ కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఎన్నున్నాయో తెలియదు. నీరు వాడిన తర్వాత బాటిల్‌ను నలిపివేయాలనే విజ్ఞప్తి బాటిల్‌పై ఉంటుంది. కాని దానిని అనుసరించేవారు తక్కువ. పంచభూతాల్లో ఏదీ స్వచ్ఛంగా దొరకేట్టులేని రోజులివి. అధికారులు ప్రైవేటు వ్యక్తులతో మిలాకత్ అయి ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టడం విషాదకరమైన విషయం.