Home మంచిర్యాల రోడ్ల పునరుద్ధరణ పనుల్లో అవినీతి గుంతలు

రోడ్ల పునరుద్ధరణ పనుల్లో అవినీతి గుంతలు

road

*నాసిరకం పనులతో కోట్లాది రూపాయల కైంకర్యం
*పనుల్లో జాప్యానికి రూ.25 లక్షల జరిమాన
*ఆరు నెలలు ఆలస్యంగా పనులు ప్రారంభం
*ఇష్టారాజ్యంగా పనులతో నాణ్యత లోపాలు
*నెల రోజులలోపే పగుళ్లు తేలి గుంతలమయం
*గ్రామీణ ప్రాంత వాసులకు తప్పని తిప్పలు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పర్చాలనే ఉద్దేశంతో రోడ్డు పనులకు కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఆశించిన  లక్షాలు నెరవేరడంలేదు. ప్రతినిత్యం గుంతలమయమైనా రోడ్ల గుండా మారుమూల ప్రాంత వాసులకు ప్రయాణాలు కష్టతరంగా మారాయి. రోడ్డు పునరుద్దరణ పనులకు కోట్లాది రూపాయలు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ల ధనదాహం వలన రోడ్డు నిర్మాణాల్లో  పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు వేసిన రెండు నెలలకే గుంతలు పడి ప్రజలను వెక్కిరిస్తున్నాయి. కాంట్రాక్టర్ పనులు  ప్రారంభించకపోవడం వలన  అతనికి పలు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో రూ. 25 లక్షలు జరిమాన విధించారు. ఎట్టకేలకు  ఆరు నెలల అనంతరం పనులు ప్రారంభించగా అడుగడుగునా నాణ్యత లోపాలు   కనిపిస్తున్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలోని 16 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు గాను  కోటపల్లి మండలం  పారిపల్లి సమీపంలోని   జాతీయ రహదారి నుంచి ఆల్గామా  వరకు  రోడ్డు పనరుద్దరణ పనులకు  రూ. 6.27 కోట్లు కేటాయించారు.   అయితే 21 కిలోమీటర్ల నిడివి గ ల రోడ్డు పనులను  2015 మే 23న ప్రారంభించగా 2016 మే 22 వరకు  పూర్తి చేయాల్సి ఉంది. కాగా  2017మే30న పనులను పూర్తి చేశారు.   రోడ్డు పనులు  పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తుండగా గుంతలు వెక్కిరిస్తున్నాయి.  రోడ్డు పూర్తిగా గుంతల మయం కావడంతో అత్యవసర సేవలకు దూరమవుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలపై ఆదారపడి ఎన్నో ప్రయాసాలకు గురువుతున్నారు. ఎన్నో సార్లు నాయకులు , అధికారులకు రోడ్డు మరమ్మతులు చేయాలని కోరగా ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి రహదారి పునరుద్దరణ పనులకు  నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ  ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల మరమ్మతుల కింద  రూ. 6.27 కోట్లను మంజూరు చేసి, కరీంనగర్‌కు చెందిన  ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు.  గడువులోపు పనులు పూర్తి చేయకపోవడం వలన సదరు కాంట్రాక్టర్‌కు ఎన్నో సార్లు నోటీసులు జారీ చేసి, పనుల్లో జాప్యం చేసినందుకు రూ. 25లక్షలు జరిమాన  కట్టించారు. ఈమేరకు  దిగివచ్చిన కాంట్రాక్టర్ ఆరు నెలలు  ఆలస్యంగా  పనులను ప్రారంభించారు. అయితే  కాంట్రాక్టర్ చేపట్టిన పనుల వైపు కన్నెత్తి చూడకపోవడం వలన ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతిని అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి.పలు చోట్ల కంకర బయటకుతేలి ఇబ్బంది కరంగా మారింది. పనులు జరుగుతున్న సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కాంట్రాక్టర్‌పై పలు పిర్యాదు వెళ్లగా అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల రోడ్డు పరిస్థితిని  పరిశీలించిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నమాట  వాస్తవమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై పంచాయతీ రాజ్‌శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామిరెడ్డి వివరణ కోరగా పనుల్లో నాణ్యతలోపం ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి కాంట్రాక్టర్‌పై శాఖ పరమైన చర్యలతో పాటు జరిమాన కూడా విధించామన్నారు. రోడ్డు నిర్వాహణ బాధ్యతలు మరో రెండు సంవత్సరాల పాటు కాల పరిమితి మిగిలి ఉందని , వెంటవెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు.