Tuesday, April 23, 2024

కర్ణాటక బిజెపికి అవినీతి మరక

- Advertisement -
- Advertisement -

Corruption stain on Karnataka BJP

హిందుత్వ’ ఎజెండాతో తిరిగి మరోసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కర్ణాటక బిజెపికి ఓ సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి రావడం కోలుకోలేని ఎదురు దెబ్బగా భావించవచ్చు. బిజెపి అధిష్ఠానం అండదండలతో, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం మద్దతుతో పార్టీ ముఖ్యమంత్రులకు గుదిబండగా ఉంటూ, మరోసారి ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఈ మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి సంక్షోభంలో ఇరుక్కోవడం కర్ణాటకలో ఆ పార్టీ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తున్న వారికి సహితం ఇబ్బందికర పరిణామమే కాగలదు. గతంలో గనుల కుంభకోణంలో జైలుకు వెళ్లిన గాలి జనార్ధన రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈశ్వరప్ప కావచ్చు బిజెపి అధిష్ఠానంలోని పెద్దలు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం అండదండలతోనే తమ పార్టీ ప్రభుత్వాలని అస్థిరం అంచుకు నెట్టు తూ వస్తున్నారు.

ఇటువంటి వత్తిడుల కారణంగానే ఇది వరకు బిఎస్ యెడ్యూరప్ప కావచ్చు, ఇప్పుడు సౌమ్యుడు, నిజాయతీపరుడిగా పేరొందిన బసవరాజ్ బొమ్మై కావచ్చు ‘అవినీతిపరుల’ పట్ల కఠినంగా వ్యవహరింపలేకపోతున్నారు. అవినీతి వ్యతిరేకత ఎజెండాతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అదే ఎజెండాను ప్రముఖంగా ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నారు. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలలో ‘10 శాతం కమిషన్’ ప్రభుత్వంగా కాంగ్రెస్‌ను ప్రధాని ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు ఈశ్వరప్ప రాజీనామాతో ‘40 శాతం కమిషన్’ ప్రభుత్వంగా బిజెపిపై ముద్ర పడింది. రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రకటించిన మరుసటి రోజే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా ప్రకటించవలసి రావడం ‘ఆత్మరక్షణ’లో పడిన పార్టీ అధిష్ఠానం తీసుకున్న ‘నష్ట నివారణ’ చర్యల కారణంగానే అని చెప్పవచ్చు. అయితే ఈ చర్య తీసుకోవడంలో ఆలస్యమైందని, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిందని స్పష్టం అవుతున్నది.

కేవలం రాజీనామాతో తమ ప్రభుత్వంపై పడిన అవినీతి మరకను చెరిపేసుకోవడం బిజెపికి అంత సులభం కాబోదు. ఎందుకంటె రాజీనామాకు దారి తీసిన ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్ స్వయంగా బిజెపి సభ్యుడు. హిందూ వాహిని కార్యదర్శి. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న లక్షలాది మంది కార్యకర్తలలో ఒకరు. పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్న వర్గాలలోని బిజెపి ప్రభుత్వం పని చేస్తున్న తీరు పట్ల ఎంతటి నైరాశ్యం నెలకొందో వెల్లడవుతుంది.
ఐటీవల తలెత్తిన హిజాబ్, దేవాలయాల ఉత్సవాల వద్ద ముస్లిం దుకాణాలకు అనుమతి నిరాకరణ, హలాల్ వంటి వివాదాలతో ‘హిందుత్వ’ ఎజెండాతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిం చి, తిరిగి వచ్చే ఎన్నికలలో అధికారమలోకి రావడం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన శరాఘాతంగా పరిణమించింది. తాను కోరుకున్న ప్రభుత్వంలో తననే అవినీతి కాటేయడాన్ని తట్టుకోలేక సంతోష్ ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు ప్రాజెక్టుకు మొత్తం వ్యయంలో 40 శాతం లంచం ఈశ్వరప్ప డిమాండ్ చేశారని సంతోష్ ఆరోపించడం ప్రతిపక్షాలకు ఎన్నికల ముందు బలమైన ఆయుధం అందించినట్లు అవుతుంది.

అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం, ఈశ్వరప్ప తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ జరగవలసిన నష్టం రాజకీయంగా జరిగిపోయింది. సంతోష్ ఆరోపణలలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వంలోని పెద్దలపై బిజెపికి మద్దతుగా నిలబడుతున్న వారితో సహా అనేకమంది కాంట్రాక్టర్లు ఇటువంటి అవినీతి ఆరోపణలు కొంత కాలంగా చేస్తున్నారు. బిఎస్ యెడ్యూరప్ప వంటి బలమైన ప్రజాకర్షణ గల నేత లేకపోవడంతో మంత్రులపై ఇటువంటి ఆరోపణలపై తీవ్రంగా స్పందించే స్థితిలో ముఖ్యమంత్రి లేరు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టర్లు, బిజెపి మద్దతుదారులుగా గుర్తింపు పొందిన వారితో సహా కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

2019లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం లంచంగా అడుగుతున్నారని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం చాలా నెలలుగా ఆరోపిస్తోంది. కర్నాటక జిల్లాల నుండి లక్ష మందికి పైగా సభ్యులను కలిగి ఉన్న ఈ సంఘం ఈ విషయమై జోక్యం చేసుకోవాలని కోరుతూ తాజాగా మార్చి 22న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఓ లేఖను పంపింది. అయితే గత ఏడాది కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌లకు కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఈ వ్యవస్థను మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.

రోడ్డు ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వడానికి మొత్తం వ్యయంలో 40 శాతం లంచం అడిగారని తాజాగా సంతోష్ పాటిల్ చేసిన ఆరోపణ ఇప్పుడు అన్ని ప్రభుత్వ పరిధిలోని శాఖలకు వ్యాపించినట్లు కాంట్రాక్టర్ల సంఘం ఆరోపిస్తున్నది. చాలా దశాబ్దాల క్రితం స్థానిక కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లు 2 శాతం లంచం ఇవ్వాల్సి వచ్చెడిదని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న తెలిపారు. చాలా కాలం అలాగే ఉండిపోయింది. 2018-19 మధ్య కాలంలో కాంగ్రెస్ హయాంలో ఒక మంత్రి శాఖ మొత్తం టెండర్ ఖర్చులో 10 శాతం తీసుకొనేవారు” అని కెంపన్న ఆరోపించారు. అయి తే 2019లో కర్ణాటకలో బిజెపి అధికారంలోకి వచ్చాక కమీషన్ రేటు 40 శాతానికి చేరిందని కెంపన్న ఆరోపించారు. ఈ లంచంలో పది శాతం స్థానిక ఎమ్మెల్యేకే దక్కుతుంది. స్థానిక సంస్థల్లో అధికారులకు 5-7% ఇవ్వాలి. మా పేపర్‌లను ప్రాసెస్ చేయడానికి మేము మరో 5% చెల్లించాలి. ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లకు 10% ఇవ్వాలి. ఈ ప్రభుత్వ హయాంలో చాలా సార్లు లంచం ప్రాజెక్ట్ వ్యయంలో 45% అవుతుందని అంటూ కెంపన్న వివరించారు.

కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలసి తమ సమస్యలు చెప్పుకోవడానికి సమయం కావాలని మూడు లేఖలు రాసింది. ఆయన ఒక్కసారి కూడా స్పందించలేదు.మేము ఆరు నెలల క్రితం కర్ణాటక గవర్నర్‌ను కలిశాము. మా ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని ఆయన చెప్పా రు. కానీ అప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని కెంపన్న పేర్కొన్నారు. యెడ్యూ రప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహితం ఆయనను గద్దె దింపడంకోసం బిజెపిలోని ఒక బలమైన వర్గం మొదటి నుండి తీవ్రం గా ప్రయత్నం చేస్తూ, చివరకు ఆయన వయసు చూపి గద్దె దింపగలగడం గమనార్హం. అందుచేత ఆయన సహితం ‘అవినీతి’పై కఠినంగా వ్యవహరించలేకపోయారు.

పైగా, ‘అవినీతి’ పద్ధతులలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ‘దొడ్డిదారిన’ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మంత్రుల అవినీతిని ప్రశ్నించడం కష్టమైంది. ‘కాంగ్రెస్ ముక్త్త్‌భారత్’ పేరుతో కేంద్రంలో, వరుసగా రాష్ట్రాలలో అధికారం పొందుతున్న బిజెపి ఆచరణలో కాంగ్రెస్‌కు భిన్నమైన పాలన అందించలేకపోతున్నట్లు ఇటువంటి ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ‘కాంగ్రెస్ యుక్త్ భారత్’ గా ఆ పార్టీ కన్నా పాలనలో అధ్వానంగా వ్యవహరిస్తున్నట్లు అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ముఖ్యమంత్రులను ఢిల్లీలో ఒకరిద్దరు నాయకులు మాత్రమే నిర్ణయించడం, ముఖ్యమంత్రులు తమ మంత్రివర్గాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం జరుగుతున్నది. పైగా ఎంపిక చేసి మరీ అసమర్ధులు, అవినీతిపరులకు పట్టంకడుతూ ఉండటం, ప్రజలలో సొంత ఇమేజ్ ఏర్పర్చుకోగలరు అనుకొంటే అటువంటి నాయకులను పక్కన పెట్టడం చేస్తున్నారు. అందుకనే కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై వంటి నేతలు సహితం ప్రేక్షకపాత్ర వహించడం మినహా సొంతంగా చొరవ తీసుకొని పరిపాలనలో వ్యవహరింపలేకపోతున్నారు. నేడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలలో వ్యవహారాలు అంతకన్నా భిన్నంగా లేవు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన దుర్గతి అని చెప్పవచ్చు.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News