Home తాజా వార్తలు 1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం

1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం

cotton crop

అత్యధికంగా 80,447 ఎకరాల్లో దెబ్బతిన్న వరి
35,610 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం
రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక
142 మండలాల్లో 60 వేల మంది రైతులకు తీరని వేదన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర పంటనష్టం వాటిల్లింది. ఈ నెల 26వ తేదీ వరకు 1.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నష్టం అంచనాను నిర్ధారించింది. దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. ప్రధానంగా గింజలు వేస్తున్న వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. మరో వారం, 10 రోజుల్లో కోతకు వచ్చే చేను 80,447 ఎకరాల్లో వర్షాలకు నష్టపోయినట్లు నివేదించింది. కరీంనగర్ జిల్లాలో 25,595 ఎకరాల్లో వరిపంట నీటమునగడం, నేలకొరిగింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీచి గింజ కూడా రాలిపోయినట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. ఇక పత్తి చేను మీదే తడిసి ముద్దయిపోతుంది. ఇప్పటికే పత్తి మొదటితీత కొనసాగుతోంది. ముందుగా వేసిన పత్తిని రైతులు తీస్తున్నారు. అయితే వర్షాలు రోజు కురవడంతో వచ్చిన పత్తి మొక్కమీదే తడిచి నల్లబారిపోయింది.

కాయలు కూడా మచ్చలు వచ్చి పూర్తిగా నల్లపడ్డాయి. దీంతో మార్కెట్‌లో పత్తికి మద్ధతు ధర కూడా లభించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 35,610 ఎకరాల్లో పత్తి పంట వర్షాలకు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మొక్కజొన్న 4022 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. సూర్యాపేటలో 29 వేల ఎకరాల్లో, కరీంనగర్‌లో 25 వేల ఎకరాల్లో, పెద్దపల్లిలో 8354 ఎకరాల్లో, నిజామాబాద్‌లో 8730 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, వనపర్తి, యదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్, మంచిర్యాల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల్ జిల్లాల్లో మొత్తంగా 142 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. నైరుతి ఒక నెల ఆలస్యంగా రావడంతో పాటు నెల ఆలస్యంగా వెనుతిరిగింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా కదలడంతో వారం, పది రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి.

cotton crop damage Due To Rain