Wednesday, March 22, 2023

పత్తి రైతుల కన్నీరు..!

- Advertisement -

cotton

* నేల రాలుతున్న పత్తి పంటలు
* పత్తి ఏరివేతకు కూలీల కొరత
* భారీగా పెరిగిన కూలీల ధరలు
* నిస్సహాయులుగా మారిన పత్తి రైతులు
* మద్దతు ధరలు పెరుగుతాయని ఇండ్లలోనే నిల్వలు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటలు చేతికి వచ్చే సమయంలో రైతుల కంట కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏపుగా ఎదిగిన పత్తి పంటలు రైతుల కళ్ల ముందే నేల రాలుతున్నాయి. పత్తి ఏరివేతకు కూలీలు లభించకపోవడంతో మొక్కపైనే పత్తి ఉండి కిందపడిపోతుంది. కూలీల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు కూలీలు లభించకపోవడం వలన రైతులు ఆందోళన  చెందుతున్నారు. పత్తి పంటలకు ఇప్పటికే పెట్టుబడులు అధికం కాగా పెరిగిన  కూలీల ధరలు  రైతులను కృంగదీస్తున్నాయి. కూలీ ధరలు రెంటింపు కాగా స్థానికంగా కూలీలు లభించకపోవడంతో అమ్ముకోవాల్సిన పత్తిపంటలు ఇప్పటికి మొక్కపైనే ఉంది. మంచిర్యాల , కొమురంభీం జిల్లాల్లో దాదాపు 2 లక్షల హెక్టార్లలో పత్తిపంటలు వేయగా అన్ని జిల్లాల్లో  రైతులకు ఇదే పరిస్థితి నెలకొంది.  పత్తి దిగుబడులు పెరగడం వలన ప్రతి ఒక్క రైతు పంట పొలాలను సైతం పత్తి చేనులుగా మారుస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు మూడు విడతలుగా పత్తిని తెంపి కట్టెను తొలగిస్తారు. కాని ప్రస్తుతం సీజన్‌లో ఫిబ్రవరి మొదటి వారం దాటినప్పటికీ  పత్తి ఏరివేత జరగలేదు. గత సంవత్సరం వరకు పత్తి తెంపుటకు కిలోకు రూ. 5 ఉన్న ధరలు ప్రస్తుతం ఏకంగా రూ. 15కు కూలీలు పెంచారు. ఈ సంవత్సరం కూడా  స్థానికంగానే రూ. 7 ఉండగా ప్రస్తుతం ఉపాధి హామీ పనుల వలన కూలీలు దొరకక రూ. 15 పెంచడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలోని  రైతులు మహారాష్ట్ర, కర్నూల్, విజయవాడ ప్రాంతాల నుంచి కూలీలను మాట్లాడుకొని తీసుకువచ్చి పత్తిని తెంపుతున్నారు. వారికి కిలో ఒక్కంటికి రూ. 13 చొప్పున చెల్లిస్తూ వారికి భోజన వసతితో పాటు రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. పత్తి పంటలకు కౌలు రైతులు  ఎకరానికి ప్రాంతాన్ని బట్టి రూ. 15 నుంచి 20 వేలు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా పూర్వపు పత్తి కర్రలను తొలగించడం,దున్నడం వాటికి  రూ. 15 వేలు ఖర్చు చేస్తున్నారు. యురియా, డిఏపి , జింకు ఎరువుల కోసం రూ. 5 వేలు, పిచికారి మందుల కోసం రూ.3వేలు, ఏరివేతకు 10క్వింటాళ్లకు రూ. 5 వేలు చెల్లిస్తున్నారు. ఇదే కూలీ ధరలు ప్రస్తుతం రూ. 15 వేలకు చేరాయి. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, ముల్కల్లపేట్ శివారులో పత్తి ఏరివేయకపోవడం వలన సగం పత్తి పంటలు ఎండిన మొక్కలతో  కనిపిస్తున్నాయి. అదే విధంగా తాండూర్ మండలం అచ్చులాపూర్‌లో  మహారాష్ట్రకు చెందిన కూలీలను తీసుకువచ్చి వారికి  కిలోకు రూ. 13 చొప్పున చెల్లిస్తున్నారు.  కోటపల్లి మండలంలోని  జనగామలో పత్తి పంటలు వేయగా రైతులకు  పత్తిని తెంపేందుకు కూలీలు దొరకక తీవ్రంగా నష్టపోయారు. అదే విధంగా  ఇప్పటికి కొందరు రైతులు ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని ఏరి వేసిన పత్తి పంటలను  ఇండ్లలోనే నిల్వ ఉంచుకుంటున్నారు.  అయితే ప్రభుత్వం నుంచి ఎప్పుడు ధర పెరుగుతోందనని ఎదురుచూసిన రైతులు పెరిగే అవకాశాలు లేకపోవడంతో రైతులు మధ్య దళారులకు పంటను విక్రయించి పెట్టిన  పెట్టుబడులు వెళ్లక తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏదిఏమైనా ఈఏడాది  పత్తి పంటలను తెంపేందుకు కూలీలు లభించక పత్తి మొక్కపైనే ఉండడంతో  మరింత కృంగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News