Home ఆఫ్ బీట్ బడుగు పేకల నారాయణ్ పేట్

బడుగు పేకల నారాయణ్ పేట్

కడితే నారాయణ్‌పేట్ చీరెనే కట్టాలె అన్నట్లుంటయ్ ఒగప్పుడు మారాజుల్లెక్క ఉంటుండె అక్కడి నేతకారులు. ఇప్పుడు బక్కచిక్కి పేగుల్లెక్కపెట్టచ్చన్నట్టున్నరు. మరమగ్గాలు, నకిలీ చీరెలు వీళ్ల పొట్ట కొడుతున్నయ్. దళారీలు దండుకుంటున్నరు. మగ్గం మూలబడ్డది. వీళ్లేమో వలసదారి పట్టిన్రు. ఈ పాపం ఎవరిదంటే ఎవరు జవాబు చెప్తరు? మల్ల అసలైన నారాయణ్‌పేట్ చీరె ఆడోల్ల ముంగిటికి పోవాలె. పేద నేతకారుల పొట్ట నిండాలె. ఇవి జరుగుతవా లేదా…ఇదీ ముంగటున్న ముచ్చట.

Maggamమహబూబ్ నగర్ జిల్లాలో ఉంది నారాయణపేట. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇరుకు ఇరుకు సందులు. ఓపెన్ డ్రైనేజ్ కాలువలు, మనుషులతో సమానంగా తిరిగే పందులు, ఎక్కడ నుంచుంటే అక్కడ కమ్ముకుంటున్న పెద్ద పెద్ద దోమలు. నారాయణపేటలో రెండు గల్లీల్లో బంగారు దుకాణాలున్నాయి. నారాయణపేట బంగారం నాణ్యత కలిగిందని పేరు. ముఖ్యంగా నారాయణపేట చేనేతకు ప్రసిద్ధి. కాటన్, పట్టు చేతి మగ్గాల మీద నేసే చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. జరీ, పట్టు దారాలు వాడి అందమైన చీరలకు ప్రాణం పోస్తారు. వెజిటబుల్ రంగులు, చీర మొత్తం చెక్స్ వస్తుంది. పెద్ద పెద్ద ఘనమైన అంచులు చీరకు కింద, పైన రెండు వైపులా ఉంటాయి. అందమైన రంగుల్లో మిరిమిట్లు గొలిపే చీరలు మహిళల మనసు దోచుకుంటాయి. చీర ఎన్నాళ్లుంటే అన్నాళ్ళు రంగుల మెరుపు అంతే ఉంటుంది. నారాయణపేట చీరలు కట్టుకుంటే దేవత ఆశీర్వాదం దొరుకుతుందనేది కూడా ఒక నమ్మకం. బోర్డర్ల మీద టెంపుల్ ప్యాటర్న్ వెయ్యడానికి కారణం కూడా అదే.

ఇంటర్‌లాక్‌డ్ వెఫ్ట్ సాంకేతికత వలన నెలకి 25,30 చీరల కంటే ఎక్కువ నేయడం కుదరదు. నారాయణపేట కాటన్‌కి కూడా దాని ప్లస్ పాయింట్లున్నయ్. రంగు రంగుల మిశ్రమాల అంచులతో చీరలు నేస్తారు. పూల ప్రింట్‌ల చీరలు ప్లేన్ జరీ అంచులతో ఉంటాయి. లేదా ముదురు రంగు పూల ప్రింట్లతో ప్లేన్ అంచు ఉంటుంది. ఒకప్పుడు మరాఠా రాజు శివాజీ నారాయణపేట మీదుగా వెళ్లాడని, నారాయణపేట నైపుణ్యవంతమైన సంప్రదాయ కళకు ప్రతీకగా భావించారని అంటారు. 2013 లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ అవార్డు నారాయణపేట చీరకు దొరికింది. పవర్‌లూమ్‌ల చవకబారు చీరలతో అసలైన నారాయణపేట చీరకు అన్యాయం జరుగుతున్న సమయంలో, ఎంతో విలువైన సంప్రదాయ కళను కాపాడుతున్న ఇక్కడి నేతన్నలకు జిఐ స్టేటస్ గుర్తింపు పెద్ద ఉపశమనం ఇచ్చింది. పేద నుంచి ధనిక వర్గం వరకు అందరికీ అందుబాటులో ఉంటాయి నారాయణపేట చీరలు. కాలేజి విద్యార్థినుల నుంచి ప్రొఫెసర్ల వరకు అందరూ కట్టుకోవచ్చు.

మాస్టర్ వీవర్లు సొంతంగా దుకాణాలు పెట్టి చీరలు, పంజాబీ డ్రస్ మెటీరియల్ అమ్ముతున్నారు. ఒక ఇంటినే షాపులాగా చేసుకున్నారు. వచ్చిన కస్టమర్లు దుస్తులు కొనుక్కోవడానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి. నగరాల్లో దుకాణాల్తో పోలిస్తే తక్కువ ధర ఉండచ్చు కాని చెప్పిన ధరకు ఏమాత్రం తగ్గకుండా అమ్మకాలు చేస్తున్నారు. రేకుల షెడ్డులతో కట్టిన ఇళ్లలో నేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. ఇప్పటికీ ఆ ఇళ్లకి పట్టాలు ఇవ్వలేదు. ఎవరి కుటుంబాల్లో అయితే ఉద్యోగాలు చేసేవాళ్లున్నారో వాళ్లు తమ ఇళ్లని ఇంకొంత బాగా చేసుకున్నారు. ఇంకొన్ని అధ్వాన్న స్థితిలోనే ఉన్నాయి. జ్ఞానదేవ గణపతిని చూస్తేనే అర్థం అవుతుంది పేద నేతకారుడని. చాలా సన్నగా, బలహీనంగా ఉన్నాడు. ఒక పెద్ద గది. ఇంకో చిన్న వంటగది. అందులోనే స్నానానికి చిన్న ఏర్పాటు. ముందున్న పెద్దగదిలో పురాతన మగ్గం. ఇంట్లో అతని భార్య, కూతురు, ఇద్దరు చిన్న మనవరాళ్లు ఉన్నారు. మగ్గం మీద సగం నేసిన చీర ఉంది. గోడ మీద శాలువా కప్పించుకుని బెస్ట్ వీవర్ అవార్డు తీసుకుంటున్న ఫొటో ఉంది. అదొక్కటే అతనికి చూపించుకోడానికి మిగిలిన గర్వ కారణంలా అనిపించింది. చేతిలో దారానికి ప్రాణం పోసే కళ ఉంది. ఆ కళ కడుపు నిండా అన్నం పెట్టలేకపోయినా తరాల నుంచి వస్తున్న ఉపాధి మార్గం నేత. పైగా అది తప్ప ఇంకో పని రాదు. వచ్చినా చెయ్యలేరు. కష్టం, సుఖం, ఆటుపోట్లు ఎన్ని వచ్చినా మగ్గాన్నే నమ్ముకున్న నేతన్నలకు ప్రతీకలా ఉన్నాడు అతను. నారాయణపేట పేరు మీద నకిలీ చీరలు బతికే ఉంటాయేమో కాని అసలైన హ్యాండ్‌లూమ్ నారాయణపేట చీర చరమదశలో ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
మరమగ్గం వాడితే అది నారాయణపేట చీర కాదు
Saree

నా పేరు జానదేవ గణపతి. నేను పుట్టినప్పటి నుంచీ నేత పని చూస్తున్నాను. ఊహ తెలిశాక ఇదే పని చేయడం ఆరంభించాను. చీరలు కాకుండా ధోవతులు నేసేవాళ్లం. పాగళ్లుడికి దానికి అతుకుపెట్టి నేసేవాళ్లం. ధోవతులంటే తొమ్మిది గజాలుంటయ్, ఎనిమిది గజాలుంటయ్. ఎనిమిది గజాలంటే నాలుగు వార్లు చొప్పున. నేసేవాళ్లం. ఆ కాలంలో రూపాయి పావలాకు ఒక జోడ. మాకు పావలా గిట్టేది. కొద్దిరోజుల తర్వాత అదే పాగళ్లతో సొసైటి వాళ్లు చీరల మగ్గాలు చాలూ చేసిన్రు. చీరల మగ్గాలు, దుప్పట్లు, ప్రతి ఒక్కదానితో నారాయణ పేట పెద్ద సొసైటి. దావణగిద్ద, చుట్టూ పల్లెలు ఎన్ని ఉన్నాయో ఏ ఒక్క సొసైటీ ఇక్కడ స్థాపన కాలేదు. 1951 లోపల మొదటి సొసైటి నారాయణపేట సొసైటీ. ఇప్పుడు గ్రూపులు, గ్రూపులు అయి పేరు పెట్టుకున్నరు అన్నట్టు. ఇప్పుడు నారాయణపేటలోనే ఎనిమిది సొసైటీలున్నయ్. కాని సొసైటీలతోనయితే ఏం ఉపాధి లేదు మనకి. మేం బతికేది నేత మీదనే. చాలామంది బంద్ చెయ్యడానికి కారణం ఏం ఉన్నదంటే ప్రొడక్షన్‌కు మాల్ బరాబర్ పొయ్యేది. కాని ఇప్పుడు దీనికి బదులుగా మర మగ్గాలు మీద అదే డిజైన్, ఎవరు డిజైన్ ఇస్తరో మాకు తెలవదు కాని ఆ బట్టనే చూసి ఇదే నారాయణపేట అని అమ్ముతున్రు. పొరపాటు ఇందులో ఏం జరుగుతుంది అంటే, మీరు దుకాణంలోకి పోతే మేం నేసిన చీర చూపియ్యరు వాళ్లు. మర మగ్గాల మీద తయారైన చీర చూపెట్టి ఇదే నారాయణపేట చీర అంటారు. వాస్తవంగా నారాయణ పేట చీరల కోసం ఆప్కో వాళ్లొస్తరు. వాళ్లే కొంటరు. వాళ్లు కూడా సొసైటి దగ్గర కొంటరు. ప్రతి బీదోని దగ్గరైతే వాళ్లు కూడా కొనరు. మాకు ఉపాధి దొరకది. మగ్గం కోసం కండెం, రాట్నం తిప్పుతారు. కండెలు చుట్టి ఇస్తరు. ఒకదానికి నాలుగు లడీలు ఉంటయ్. దానితో ఒక చీర అయిపోతుంది. ఇక్కడ నాలుగువేలమంది బతికే సౌలభ్యం ఉంది. అది కాక షోలాపురం, కర్నాటక నుంచి కూడా ఇక్కడికి వచ్చి, అప్పుడు 2004,2005 కంటె ముందు యాభై రూపాయలు కూలే. మా ఊళ్లో అప్పటివరకు కూడా మగ్గాలున్నయ్. మంచిగ జరిగింది. తర్వాత మర మగ్గాల మీద బనావటి చీరలు తయారవడం మొదలయ్యాయో అప్పటి నుంచి మా అసలైన నారాయణపేట చీరలకు దెబ్బ వచ్చింది. నేను కాటన్ నేస్తాను. పట్టు వేరే ఉంటుంది. నారాయణపేట పట్టుకి ప్రభుత్వమే సింబల్ ఇచ్చింది. అంచు ఉంటుంది. పల్లుకి తోపు ఉంటుంది. మునుపు మూడు నాలుగు వందల మగ్గాలు నడిచేటివి. ఇప్పుడంతా దిగిపోయి ంది. ఆర్డర్ అయితే పట్టుకి ఫుల్ ఉంది. గిరాకి ఫుల్ ఉంది. కాటన్ మగ్గాలు తక్కువలో తక్కువ రెండు వందలు, అక్కడొక పది, ఇక్కడొక పది ఉన్నయ్. అన్ని మగ్గాలున్నా ఇప్పుడు కండెలు చుట్టేటోళ్లు, మగ్గం నేసేటోళ్లు కలిపితే ఆరొందల మంది ఉంటరు. నా భార్య చుడుతుంది, నేను నేస్త. ప్రస్తుతం వంద రూపాయలు కూలిస్తున్నరు. నేను సొంతంగా పెట్టుబడి పెట్టే నేసుకుంట. గిరాకి వచ్చినోళ్లకి అమ్ముత. నా ఇంటికి వచ్చినవాళ్లకి అమ్ముత లేదంటే ఆప్కోకి ఇస్త. ఆప్కోలో కాటన్ చీరకు 500 రూపాయలు ఇస్తరు. అది కూడా జల్ది ఇయ్యరు. నాలుగునెలలు, ఆరు నెలలకిస్తరు. ఆంధ్ర కలిసున్నప్పుడు వేలాదిమంది కొన్నరు కాని ఇప్పుడు వందలమంది మాత్రమే కొంటున్నరు. నేను రోజుకి ఒక్క చీర నేస్త. చీర నేసినందుకు కూలి వంద రూపాయలు గిడుతుంది. పెట్టుబడి పెట్టినదానికి ఒక యాభై రూపాయలు గిడుతుంది అంతే. రోజంతా నేను, నాభార్య ఇద్దరం పనిచేస్తే నూట యాభై రూపాయలు ఆదాయం వస్తుంది. మాస్టర్ వీవర్ అయినా ఇంతే కూలి ఇస్తడు. సొంతంగ నేస్తే నాలుగు చీరలు మిగిలితే మాకు లాభం వస్తది. మాస్టర్ వీవర్ మాకు కూలి ఇస్తడంతే. సొంతం చేసుకుంటే మాకు గిరాకు వస్తే, ఒక్కోసారి ఐదు వందల రూపాయల చీర ఆరువందలు ఇచ్చి కూడా తీసుకుపోతరు.
అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన మార్పులేంటి? అప్పట్లో
నారాయణపేట చీరలు ఎక్కువ కట్టారా?
Saree1జీవితకాలం నేస్తనే ఉన్నం. నారాయణపేట చీరలు ఎక్కువ కట్టిన్రా అంటే కట్టిన్రు, అప్పుడు ఎక్కువ బయటకే పోతుండె. పట్టుచీరలు హైదరాబాద్, పూనా, మహారాష్ట్ర, ఢిల్లీ అటు పోతయ్. కాటన్‌వి కూడా ఎక్కువమటుకు హైదరాబాద్ కాని, ఆంధ్ర రాష్ట్రాల్లో కాని ఎక్కువ కడతరు. మాకు ఇంకా ఆర్డర్లు వస్తుండె కాని ఇప్పుడు తగ్గింది. అక్కడ నుంచి కూడా అమ్మేటోళ్లు వస్తరు. వాళ్లకి కూడా ఇస్తం.
మీకు బెస్ట్ వీవర్ అవార్డు ఎందుకు వచ్చింది?
పాటల్లో, రచనల్లో అన్నిటికన్నా బెస్ట్ అని ఎట్లంటరో, నేతలో కూడా నేను బాగా నేస్తా అని ఇచ్చిన్రు. ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ గారు, నీ చీరలు పట్టుకుని రా అని పిలిపించారు. అట్లే, పట్టుచీరలు కూడా పట్టుకు పోయిన. బాగ నేస్తున్న అని అవార్డు ఇచ్చిన్రు. వీవర్స్ దగ్గర నైపుణ్యం లేదు అంటున్నారు. నిజమేనా?ఒకకాలంలో కట్టుకున్నవి ఇప్పుడు కట్టుకోరు కదా. మార్కెట్‌కి తగ్గట్టు మీరు నేస్తున్నారా?అందుకే మాస్టర్ వీవర్ డిజైన్ చెప్పి మీచేత నేయిస్తాడట? వాళ్లు చెప్పి చేయించడం నిజమే. కాని మాకు నేర్పించి ప్రభుత్వమే కొంటే మేమే తయారు చేస్తం కదా. మాస్టర్ వీవర్ లాభాలకు అమ్ముకుంటడు. మాకు కూడా ప్రభుత్వం డిజైన్ కోసం శిక్షణ ఇస్తే మాకు కూడా లాభాలొస్తయ్. ప్రభుత్వం శిక్షణ స్కీం పెడితే కదా సొసైటీలయినా ఏమన్నా చేయడానికి. మనం కూడా నేరుస్తం. పిల్లలు కూడా నేరుస్తరు.
మీ పిల్లల్ని నేతకారుల్ని చేయాలనుకుంటారా?
మా పిల్లలు నేత పని అంటేనే వద్దంటరు. యాభై సంవత్సరాలకి ఇంకా నేను మంచిగున్న. నలభై సంవత్సరాలకి నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, తొక్కుడు పని అంత సులభం కాదు. చేతులు ఆడుతుంటయ్. కాళ్లు ఆడుతుంటయ్. పోగుల్లోంచి వచ్చే నూగు నోట్లోకి, ముక్కులోకి పోతది. నాకు అందరూ ఆడపిల్లలే. నేసేటోళ్లకే ఇచ్చినం. వాళ్లు నేయడం బంద్ పెట్టి కిరాణం దుకాణం పెట్టుకున్రు.
ముందుకి నారాయణ్ పేట కాటన్ ఉంటుందా, ఉండదా?
ఇప్పుడే సగం తగ్గిపోయింది. ముందు ముందు ఉంటుందో లేక రెండు ఏళ్లకి ముగిసిపోతుందో.
మర మగ్గం చీరకి, హ్యాండ్‌లూమ్‌కి తేడా ఏంటి?
హ్యాండ్‌లూమ్ మీద ఎనిమిది గంటల్లో తయారయ్యేది, వాళ్లు మరమగ్గం మీద ఎనిమిది గంటల్లో నాలుగు చీరలు తయారు చేస్తరు. అసలైతే పవర్‌లూమ్ మీద నడపరాదన్నదే ఉద్దేశ్యం. హ్యాండ్‌లూమ్‌తో తయారైన చీరకి చార వస్తుంది. మరమగ్గం అయితే ప్లెయిన్‌గా వస్తుంది. అదే తేడా. చూస్తే గుర్తు పట్టచ్చు.
మరమగ్గంతో పని తొందరగా అవుతుంది. ఆరోగ్య సమస్యలు రావు. లాభం ఎక్కువ వస్తుంది. మరి ఎందుకు మీరు మరమగ్గం తీసుకోలేదు?
మరమగ్గం వాడితే నారాయణపేట చీర కాదు అది. అయినా మర మగ్గం కనీసం రెండు లక్షలుండచ్చు. దానికి మోటర్ కావాలి. ఇంట్లో శబ్దం చాలా చేస్తుంది. అది ఒక్కరే కాకుండా పది మంది కలిసి మరమగ్గాలు పెట్టుకుంటే గిరాకి తెచ్చుకోవచ్చు.
వీవర్లకు నైపుణ్యాలు లేవు
నేను మాస్టర్ వీవర్‌ని. మాకు నారాయణపేట్‌లో షాపు ఉంది. మేం మెటీరియల్ ఇస్తాం. వాళ్లకి పది శాతం లాభం ఇస్తాం. డిజైన్లు మావే. మేం డిజైన్లు నేర్పించాలనుకున్నా ఇక్కడ హ్యాండ్‌లూమ్ వీవర్స్ సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఆసక్తి చూపించట్లేదు. కొంతమంది వీవర్స్‌కి సొంత మగ్గాలున్నాయి. కొంతమందికి మేమే మగ్గాలిస్తాం.

ఒకప్పుడు ఆర్టిఫిషియల్ యార్న్ వాడుతుండె
నాగూరావ్ నాపేరు. మేం చేసేది కృత్రిమమైన యార్న్. ఇదంతా రాష్ట్రం బయటకు పోతుంది. ఇంతకుముందు విజయవాడ వెళ్లేది. ఇక్కడ కేవలం కాటన్ చీరలు తయారవుతాయి. అంతకుముందు నారాయణపేట నేతలో కూడా వాడుతుండేది. కాని ఇప్పుడు అది మారింది. సిల్క్ యార్న్ వాడకూడదు. ఈ మెటీరియల్ వాడకూడదు అని సొసైటీ వాళ్లు అభ్యంతరం చెప్పారు. ప్యూర్ కాటన్ ఉండాలి అన్న నిబంధన ఉండేసరికి ఆర్ట్‌ఫిషియల్ సిల్క్ యార్న్ నారాయణపేట నేతచీరల్లో వాడటం మానేశారు. 1975 నుంచి మేం తయారు చేస్తున్నాం. అప్పట్లో కేవలం చీర అంచుల్లో వాడేవారు. తర్వాత జరీ వచ్చింది. జరీ తర్వాత మొసరైస్ పెడుతున్నారు. ప్యూర్ కాటన్ కూడా చాలా పిరెం అయిపోయింది. డైయింగ్(అద్దకం వేసిన) కాటన్ అవన్నీ. ఇప్పుడు నేసేవాళ్లు కూడా లేరు. వాళ్లకి శిక్షణ ఇవ్వాలి. అట్లా అయితేనే నడుస్తుంది. దగ్గర దగ్గర బంద్ కానీకి వచ్చింది. అన్నీ పనికిరాని బోగస్ సొసైటీలు. ఏదయినా ట్రైనింగ్ క్యాంపు పెట్టించి వీవర్స్‌ని తయారు చెయ్యాలి. కాని చెయ్యరు. ఊరికే ఖాతాలు రాస్తారు. బరాబర్ చేస్తరు. ప్రభుత్వానికి చూపించడానికి అంతే. 1969 లో వందమంది వీవర్స్‌కి ఇళ్లు వచ్చినయ్. అంతకుముందు సొసైటీ నుంచి లూమ్‌లు ఇచ్చి, రా మెటీరియల్ ఇచ్చి కో ఆపరేట్ చేసి వాళ్లకు సహాయం చేసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్లు మాస్టర్ వీవర్స్ నుంచి తీసుకుంటారు. సప్లై చేస్తారు ఆప్కోకు, వాళ్లకు, వీళ్లకు. ప్లాన్‌లు, స్కీమ్‌లు మస్తున్నాయి. కాని అవి వీవర్స్‌కి అందడం లేదు. వీవర్స్ లోన్ మాఫ్ అయితే కూడా అది కూడా మాస్టర్ వీవర్స్‌కే పోతుంది. వీవర్స్‌కి వాస్తవానికి ఏం దొరకదు బ్యాంకు నుంచి కూడా.

చేనేత భత్యం ఇమ్మన్నం

mara-maggam1నాపేరు రామచందర్ సాకరె. నేను వీవర్‌ని. ఒకప్పుడు నారాయణపేట చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిపి 5000 మగ్గాలుంటుండె. మహారాష్ట్ర, కర్నాటక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన్రు చాలామంది నేతకారులు. ఇప్పుడు మగ్గాలు పూర్తిగా తగ్గిపోయినయ్. ఇదే పరిస్థితి అన్ని వైపులా ఉంది. నారాయణపేట్‌ను చేనేత పార్క్ చేస్తామని అన్నరు. పదేళ్లు గడిచిపోయినయ్. ఇంకా రాలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాట ఇచ్చిన్రు. ఇప్పటి వరకు జరగలేదు. దాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నారాయణపేటకు కూడా క్లస్టర్ వేస్తామని చెప్పిన్రు. రెండు సంవత్సరాలు గడిచింది. ముందు రెండు కోట్లతోని ఒక ప్రాజెక్టు తయారు చేసినా దాని గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. అరవై లక్షలు ఇస్తం. క్లస్టర్ వెయ్యండన్నరు. క్లస్టర్‌కు ప్రభుత్వ నిర్మాణం, ప్రభుత్వ భూమి కూడా ఇవ్వడం లేదు. ఎట్లయితది క్లస్టర్ నిర్మాణం? ఈవిధంగా కుంటుపడింది. కొద్దిరోజులైతే చేనేత పరిశ్రమ పూర్తిగా రూపుమాసిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వమే సబ్సిడీపై నూలు దారాలు ఇవ్వాలె. గిట్టుబాటు ధర పైన చీరలు బేరం చేయాలె. ఆప్కో సంస్థ, ఇతర సంస్థలు ముందుకు రావాలె. రాష్ట్ర ప్రభుత్వంలో కార్మికులకు భత్యాలిస్తరు కదా కేవలం చేనేత భత్యమే ఇవ్వమని డిమాండ్ చేసినం. ఇంతవరకు ఏం అమలు కాలేదు. ఈ ప్రాంతంలో రెండు వందల నుంచి మూడు వందల వరకు ఆకలి చావులు జరిగాయి. వాళ్లకి కూడా ఇప్పటి వరకు ఎటువంటి లాభం జరగలేదు. ఆప్కో సంస్థ వాళ్లు ఏ ఆరు నెలలకో వస్తరు. వచ్చి చీరలు తీస్కొని పోతరు. ఆరునెలలకు కాని డబ్బులివ్వరు.

నేతకారుల దగ్గర డబ్బెక్కడి నుంచి వస్తుంది చెప్పండి? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఒక కమీషను వేసినారు. కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ ఆర్థిక యోజన కింద ఒక కమీషన్ వేయించి అమలు చేయాలని కొన్ని సిఫారసులు చేసింది. రోశయ్య గారు మళ్లీ అదే సిఫారసులు చేశారు. సబ్సిడీ పైన నూలు దారం ఇయ్యాలె. పట్టుదారం ఇయ్యాలె. గిట్టుబాటు ధరకు కొనుగోలు చెయ్యాలె. వీళ్లకు పెన్షన్లు ఇయ్యలె. ఉచితంగా ఇళ్లు పంపిణీ చెయ్యాలని రాసిచ్చిన్రు. కాని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చెయ్యలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రైతుల, చేనేత రుణాలు మాఫ్ చేస్తాం అన్నది. కాని ఇప్పటి వరకు చేనేత కార్మికులకి ఒక్క పైసా కూడా మాఫ్ చెయ్యలేదు. కేవలం పవర్‌లూమ్ మీద నేసేవాళ్ల రుణాలు మాత్రమే మాఫీ చేసిన్రు. మధ్యలో దళారులు, ఎవరైతే నూలు దారం తయారు చేస్తరో వాళ్లు దోచకతింటున్నరు. వాళ్ల వలన ఇద్దరికీ నష్టం అయితున్నది. ఒకవైపు రైతులకు నష్టం. రెండోవైపు కార్మికులు నష్టపోతున్నారు. ఒకప్పుడు 30 శాతం సబ్సిడీ మీద నూలుదారం ఇస్తుండె. ఇప్పుడు ఇవ్వడం లేదు. 1976 లో కేంద్ర ప్రభుత్వం ప్రగడ కోటయ్య కమిషన్ ఏర్పాటు చేసిన్రు, అప్పుడు అతను ఎమ్‌పిగా ఉండె. ఆయన గుంటూరుకు చెందినవాడు. అక్కడ మగ్గాలు ఎక్కువ. వాళ్లు నూలు దారాలు తకువ చెయ్యాలె, ధర తక్కువ చెయ్యాలె అన్నరు. అయితే నూలు దారం ధర ఎక్కువ చెయ్యాలని దాని మీద ఒక కమీషన్ వేశారు. దాంట్లో 26 పాయింట్లు పెట్టినం. ఎంత కొనుగోలు చెయ్యాలె, ఎంత చీరలు నేపించాలె, ఏవైతే హ్యాండ్‌లూమ్‌లో తయారయితున్నవో అవి పవర్‌లూమ్‌లో తయారు చెయ్యకూడదు. ఆవిధంగా సిఫారిస్ చేశారు వాళ్లు. అయినా అది కూడా అమలు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో ఇవే చీరలు పవర్‌లూమ్ మీద తయారయితున్నయ్. మేం నాలుగు వందలకమ్మితే వాళ్లు మూడు వందలకమ్ముతున్నరు. ఒకవైపు రైతులతో తక్కువ ధరన పత్తి తీసుకుంటరు. వాళ్లు గిట్టుబాటు కాదని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఒకపక్క మనవాళ్లేమో నూలు ధర అంత పెరిగిందని ఆకలి చావులు చూస్తున్నరు. రోజంతా పనిచేసి ఒక చీర నేస్తే వంద రూపాయలే వస్తయ్. దానితో ఇల్లు నడవడం లేదు. అందుకే చిన్న మగ్గాలవాళ్లు బంద్ చేసుకున్నరు. పెద్ద పెద్ద మగ్గాల వాళ్లు మాస్టర్ వీవర్ దగ్గర పని చేస్తున్నరు. నేతకారుల పరివారం అంతా చెల్లాచెదురై ఇక్కడి నుంచి బాంబే, పూనా, మహారాష్ట్ర, గుజరాత్, బెంగుళూరు వరకు వలస పోతున్నరు. నారాయణపేట చుట్టుపక్కల వెళితే ముంబయ్ వెళ్లే రోజూ బస్‌లు కిక్కిరిసి ఉంటాయి. వాళ్లు దాదాపు ఒక్క బస్‌లో అరవైమంది ఉండేది దాదాపు నూట యాభై మంది ఎక్కుతారు.

మన తెలంగాణ రిపోర్టర్లుః
శ్రీనివాసులు
కర్లిదేవివరప్రసాద్
కొండోల్ల శ్రీనివాస్
సహకారంతో
శ్రీదేవి కవికొండల