Tuesday, April 16, 2024

వృద్ధిలో తిరోగమనం!

- Advertisement -
- Advertisement -

Country growth rate is slowing

 

ఇంకా పూర్తిగా తెరపడని జన జీవన స్తంభన, ఆర్థిక దిగ్బంధన వల్ల దేశ వృద్ధి రేటు భారీగా తగ్గిపోతుందన్నది నిన్నటి మాట. అది వెనుక కాళ్ల మీద నడిచి తిరోగమన బాట పడుతుందన్నది నేటి రూఢి అంచనా. భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరంలో వ్యతిరేక దిశకు మళ్లి నెగటివ్ అంకె నమోదవుతుందని, మైనస్‌కి తిరుగుతుందని లాక్‌డౌన్ మొదలైన కొద్ది రోజుల్లోనే జాతీయ అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కొన్ని హెచ్చరించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మాత్రం మిగతా ప్రపంచానికి భిన్నంగా భారత, చైనాలు వృద్ధి రేట్ల పైచూపును కాపాడుకుంటాయని జోస్యం చెప్పింది. అది కూడా ఇప్పుడు అబద్ధంగా రుజువు కాబోతున్నది. ఈ కఠోర వాస్తవాన్ని రిజర్వు బ్యాంకే స్వయంగా ప్రకటించింది. రెండు మాసాల లాక్‌డౌన్ దేశీయ ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బ తీసిందని, 60 శాతం ఉత్పత్తి జరిగే 6 పారిశ్రామిక రాష్ట్రాలలో మూసివేత ప్రభావం తీవ్రంగా ఉన్నదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ఆరంభమైనప్పటి నుంచి గిరాకీ దారుణంగా పడిపోయిన సంగతినీ అంగీకరించారు.

దానిని ఎత్తి వేసిన తర్వాత కూడా భౌతిక దూరం పాటింపు, వలస కార్మికులు అందుబాటులో ఉండని స్థితి కారణంగా ఉత్పత్తి రంగం కుంటి నడకే నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగానికి ఆయువు పట్టయిన వివిధ పరికరాల తయారీ ఎక్కువగా అసంఘటిత రంగంలోనే జరుగుతుంది. భారీ పరిశ్రమలు సైతం ఈ రంగంలోని చిన్నచిన్న సరఫరా విభాగాల సహకారంతోనే నడుస్తాయి. వాటికి మూలాధారమైన కోట్లాది మంది వలస కార్మికులను సరైన రీతిలో ఆదుకొని ఉంటే లాక్‌డౌన్ ముగిసిపోయే సమయానికి వారు పని స్థలాలకు చేరుకునే ఉండేవారు. అందుకు సంబంధించిన సకాల, సమగ్ర ఏర్పాట్లు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఈ నెగటివ్ వృద్ధి అంచనాకు అది కూడా ఒక ముఖ్య కారణం. గత 40 ఏళ్లలో ఎన్నడూ చవిచూడని వృద్ధి పతనాన్ని ఎదుర్కోబోతున్నట్టు వెలువడుతున్న జోస్యాలను రిజర్వు బ్యాంకు ధ్రువపర్చడంతో వేరే ఆశలకు అవకాశం లేదని తేలిపోయింది.

ఈ దుస్థితి నుంచి దేశాన్ని కాపాడడానికి ఆర్‌బిఐ అనేక వ్యూహాలను రచిస్తున్నది. ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గించి పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు పరపతి సౌకర్యాన్ని విరివిగా కల్పించింది. లాక్‌డౌన్‌కు ముందు నుంచే తయారీ రంగం దెబ్బతిని దేశ ఆర్థిక ప్రగతి కుంచించుకుపోయింది. డిమాండ్ లేక కార్ల పరిశ్రమ చతికిలబడిపోయింది. అందుచేత అప్పటి నుంచే రెపో రేట్లను వరుసగా తగ్గించడం ఆర్‌బిఐ ప్రారంభించింది. తాజాగా శుక్రవారం నాడు ఎనిమిదో సారి అదే పని చేసింది. అయితే ఈ సారి గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా రేట్లు తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాల మీద, అవి తన వద్ద ఉంచుకునే డబ్బు మీద వడ్డీ రేట్లను (రెపో, రివర్స్ రెపో) ఒకేసారి 40 బేసిస్ పాయింట్లు తగ్గించివేసింది. అలాగే హౌసింగ్ మున్నగు రుణాల వాయిదాల చెల్లింపును ఆగస్టు నెలాఖరు వరకు మళ్లీ వాయిదా వేసింది. ఈ చర్యలు వ్యాపార పారిశ్రామిక సంస్థలకు డబ్బు బాగా అందివచ్చి అవి పూర్వం కంటే విరివిగా ఉత్పత్తులు చేపట్టి ఆర్థిక వ్యవస్థ రాకెట్ మాదిరిగా మళ్లీ పైకి దూసుకుపోడానికి ఉపయోగపడతాయన్నది ఆర్‌బిఐ ఆకాంక్ష.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల చరిత్రాత్మక భారీ ఉద్దీపన పథకం కూడా దేశ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు తగినంతగా ద్రవ్య ఊపిరి పోయడాన్ని లక్షంగా చేసుకున్నదే. అయితే ఈ చర్యలేవీ ఆర్థిక రంగాన్ని సమీప భవిష్యత్తులో ఆసుపత్రి పడక మీది నుంచి బయటకు తీసుకు రాజాలవని దేశీయ అంతర్జాతీయ నిపుణులు బిగ్గరగా హెచ్చరిస్తున్నారు. ఈ సంస్కరణలు ఎక్కువగా మధ్య కాలిక, దీర్ఘ కాలిక ప్రయోజనాలు కల్పించగలవేకాని తక్షణం ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం వీటి వల్ల సాధ్యం కాదని గోల్డ్ మ్యాన్ శాచెస్ రేటింగ్ సంస్థ నిపుణులు స్పష్టం చేశారు. వాస్తవానికి ఏ దేశ ఆర్థిక రంగమైనా పుంజుకొని పరుగులు పెట్టాలంటే ఉత్పత్తితో పాటు గిరాకీ కూడా అవసరమే. మన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు గత కొంత కాలంగా సన్నగిల్లిపోయిన చేదు వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

అటువంటి పరిస్థితుల్లో దేశీయంగానే వాటికి డిమాండ్ పెంచవలసి ఉన్నది. దేశంలో వినియోగం పెరిగినప్పుడు మన పరిశ్రమలు మళ్లీ పుంజుకోగలుగుతాయి. లాక్‌డౌన్ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అయిపోయి ఉన్నాయి. వారి కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. దానిని తిరిగి తట్టి లేపాలంటే కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ చేయవలసింది పరిశ్రమలకు భారీగా రుణాల్విడం కాదు. ప్రజలకు పనులు కల్పించగలిగే పథకాలను చేపట్టాలి. ప్రభుత్వ రంగంలో ఖర్చును పెంచాలి. మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయించాలి. అవి చేయకుండా ఈ అప్పుల కుప్ప వ్యూహాలు ఎన్ని పన్నినా ఫలితం శూన్యం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News