Home లైఫ్ స్టైల్ బోసిపోతున్న బొమ్మల కొలువు

బోసిపోతున్న బొమ్మల కొలువు

Bommala-Koluvu

అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు అని పాడుకుంటూ ఇంటింటికీ తిరిగి సందడి చేసే పిల్లలు, పంతుళ్ళు మాయమైపోతున్నారు. 20-30యేళ్ల క్రితం బతకలేక బడిపంతుళ్లు, చెట్లకింద, వీధి అరుగుల మీద పాఠాలు చెప్పుకుంటూ పొట్టపోసుకునే వారు. కలిగిన వారి ఇళ్ళకు, మోతుబరుల ఇండ్లకు వెళ్ళి పండగ ఈనాములడిగి పండగ జరుపుకునేవారు. చిన్నపిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు అక్షరమ్ముక్కలతోపాటు ఇల్లు దిద్దుకునే తెలివితేటలు ఉండాలనే కోరికతో బొమ్మల కొలువులు ఏర్పాటుచేయించేవారు. బొమ్మలతో ఒక ప్రదర్శనగా వీటిని ఏర్పాటుచేసినా నిజానికి ఇవి శాంపిల్ సంసారాలు. ఇల్లు ఎలా కట్టుకోవాలి. ఏ వైపున ఏ గదులు ఉండాలి. గాలి, వెలుతురు బాగా రావడానికి కిటికీలు, తలుపులు ఎలా ఏర్పాటుచేసుకోవాలి వంటి విజ్ఞానమంతా తెలిసేలా మట్టితో ఇల్లులా కట్టించేవారు. సొంతగా చేస్తేతప్ప ఏదీ తెలియదు కనుక పిల్లలతో మట్టిఇల్లు కట్టించేవారు. వీటిలో ఏ గది ఎందుకు ఉపయోగపడుతుందో గుర్తించడానికి వీలుగా బొమ్మలు ఏర్పాటుచేయించేవారు. ఉదాః బెడ్ రూంలో మంచం బొమ్మ వేయించేవారు. పూజామందిరంలో దేవుడి బొమ్మ పెట్టించేవారు. వంటింట్లో పొయ్యి, వంట పాత్రలు పెట్టించేవారు. ఇలా రేపటి జీవితానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ఆడపిల్లలకు కలిగించేవారు.
రోజులు మారిపోయాయి. ఇల్లు కట్టించడమనేది దాదాపుగా అరుదైపోయింది. కాంట్రాక్టర్ కట్టించిన ఇంటినే కొనేసుకుంటున్నాం. ఇల్లుకట్టినవాడే అన్నీ మౌలిక సదుపాయాలు అమరుస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ చేయడానికి కన్సల్టెంట్ ఉన్నాడు. ఏ వస్తువునూ తయారుచేసుకోవాల్సిన పరిస్థితిలేదు. ఏ వస్తువునూ తయారుచేయించుకోవాల్సిన పనిలేదు. అనేక హంగులతో సకల వస్తువులూ అమర్చిపెట్టడానికి పలు సంస్థలు బజార్లో ఉన్నాయి. అందుకని పిల్లలతో ఇలా ఇంటి విషయంలో డ్రిల్లు చేయించాల్సిన అవసరం రావడంలేదు. ఫలితంగా బొమ్మలకొలువు ఒక ఆటగా, ముచ్చటగా మారిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడాలేదు. పిల్లలు పెద్దలు అంతా వాట్సాప్‌లు, వీడియోగేములు, కార్టూన్ గేములు, ట్విట్టర్‌లు, యూట్యూబులు, ఫేస్‌బుక్‌లలో బుక్ అయిపోయాక ఇలాంటి ప్రాక్టికల్ గేములు ఎందుకూ కొరగాకుండా పోయాయి. బొమ్మల కొలువుల వంటి ఆలోచనలు అరమోటుగా, చాదస్తంగా మారిపోయాయి. వెనకటికి బొమ్మల కొలువులో కొయ్యబొమ్మలు, రాతిబొమ్మలు, పేడబొమ్మలు, మట్టిబొమ్మలు, నారబొమ్మలు, దూదిబొమ్మలు ఇలా నానారకాల బొమ్మలు కనిపించేవి. ఆయా బొమ్మలు తయారుచేసే కళాకారులకు చేతినిండా పని ఉండేది. జేబు నిండా డబ్బు కూడా అందేది. అందరితోబాటు ఈ కళాకారులు కూడా సరదాగా దసరా జరుపుకునేవారు. ఇల్లంతా రంగురంగుల పూలతో, పేపర్ రిబ్బన్లతో అలంకరించుకునే వారు. మామిడి తోరణాలు బంతిపూల మధ్య గుమ్మాలపై వేలాడుతూ కనిపించేవి. ఇంటిని అలంకరించడంలో పిల్లలంతా పోటీపడి పెద్దలకు సహకరించేవారు. పిండివంటలు చేయడంలో ఆడపిల్లలు అమ్మకు సహకరించేవారు. చాలాచాలా పిండి వంటలు చేసుకుని ఇరుగుపొరుగువారితో, బంధుమిత్రులతో వాయినంగా పంచుకుని ఆనందపడేవారు. ఇందువల్ల ఇంట్లోచేసిన/ చేయని వంటకాలు తిని ఇంటెడుమంది పండగ చేసుకునేవారు. ఇందువల్ల పక్కవారితోనూ స్నేహసౌహార్దాలు వెల్లివిరిసేవి. ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ఆనందమేమిటో తెలిసేది. మన సంస్కృతీ సంప్రదాయాలు తరతరాలకు కొనసాగేవి.
ఇప్పుడు బొమ్మలు కొనాలంటే అదో భయంకరమైన ఖర్చుగా తయారైంది. ఏ చిన్న బొమ్మ కొందామన్నా దిమ్మతిరిగి బొమ్మకనబడుతుంటే ఇక యే బొమ్మని కొంటారు? ఏ క్రెడిట్ కార్డో వాడి కొన్నా వాటిని దాచిపెట్టుకోడానికి, విరగకుండా, పగులకుండా కాపాడుకోడానికి నానాబాధలు పడాలి. అసలే అద్దెకొంపలు ఇరుకు. పెద్ద ఇంట్లో ఉందామా అంటే అద్దెలు అదరగొడతాయి.
యేడాది పొడవునా అటకెక్కించి పండగనాడు కిందికి దించి బూజులు దులుపుకోవాలి. బొద్దింకలు, ఎలకలు, చెదలు చేరకుండా జాగ్రత్తలు పడాలి. రైన్‌వాటర్ సీపేజ్ ఉందేమో కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇన్ని బాధలుపడుతూ బొమ్మలు కొనకపోతేనేం..? అనే ఆలోచనే ఈ సరదాను చంపేస్తోంది. నోములు, వ్రతాలు నిర్మాహకుల గొప్పను చాటుకోడానికి ఉపయోగ పడే అకేషన్లుగా మారిపోతున్నాయి. చదువుల ఆరాటం ఉన్న ఇళ్ళలో పెద్దలు, పిల్లలు కూడా పుస్తకాలలో కూరుకుపోతున్నారు. చదువుకోడానికి, విద్యావకాశాలు వెతుక్కోడానికీ వీరికి 24 గంటలు చాలడంలేదు. సరదాపడడం కూడా మరిచిపోతున్నారు. మనిషిలా బతకడానికి రెండు నిమిషాలు కేటాయిస్తే అది క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అంటున్నారు. ఎంతకాలం బతికామన్నది కాదు..ఎంత తృప్తిగా బతికామన్నది ముఖ్యం. మనదైన సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆచారవ్యవహారాలను కాపాడి రేపటి తరానికి ఇవ్వవలసిన బాధ్యత మనపైన ఉంది.