Home ఎడిటోరియల్ స్వర్గం-నరకం!

స్వర్గం-నరకం!

Sampadakiyam        స్వర్గం, నరకం అనేవి భౌగోళిక ప్రదేశాలు కావని, అవి ఎక్కడో లేవని మన ఆలోచనలు, చర్యలు, గుణగణాలనుంచే రూపుదిద్దుకుంటాయని పఠాన్‌కోట స్పెషల్ కోర్టు న్యాయమూర్తి తేజ్‌విందర్ సింగ్ చేసిన వ్యాఖ్య ముక్కుపచ్చలారని పసి బిడ్డలపైనా నిరాఘాటంగా అత్యాచారాలు సాగిపో తున్న మన సమాజానికి చేదు గుళికల్లా పనిచేయాలి. గత ఏడాది జనవరిలో జమ్మూలోని కతువా జిల్లా మారుమూల పల్లె గుడిలో ఎనిమిదేళ్ల సంచార జాతి బాలికపై సామూహిక హత్యాచారం జరిగిన కేసులో శిక్షలు పడిన వారి తరపున దాఖలైన విజ్ఞప్తులను తిరస్కరిస్తూ న్యాయమూర్తి ఈ విలువైన వ్యాఖ్య చేశారు. ఒక సమాజం మంచిచెడ్డలు అక్కడివారి ప్రవర్తన మీదనే ఆధారపడతాయని, మనుషుల తీరును బట్టే స్వర్గనరకాలు రూపొందు తాయని న్యాయమూర్తి చెప్పడం అత్యంత సమంజసంగానూ సమున్న తంగానూ ఉన్నది. కేసు దర్యాప్తులో లోపాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన విజ్ఞప్తులపై న్యాయస్థానం తీర్పు చెప్పింది. అది అమానుషమైన నేరమని దేశమంతటినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని కూడా న్యాయమూర్తి అన్నారు. జరిగినది సిగ్గుపడాల్సిన విషయమని వాఖ్యానించారు. దరాప్తులో ఎటువంటి లోపం చోటుచేసుకోలేదని నేర తీవ్రతకు తగిన శిక్షలు పడ్డాయని అభిప్రాయ పడ్డారు.

గత ఏడాది జనవరి 10వ తేదీన బాలికను అపహరించుకుపోయి మత్తుమందిచ్చి ఊరి గుడిలో నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం, హత్య చేశారు. ఆ నెల 17వ తేదీన బాలిక మృతదేహం అడవిలో కనిపించింది. ఈ కేసులో సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి ఏడాదిన్నర తిరిగేసరికి తీర్పు ఇవ్వడం ప్రశంసలకు పాత్రమైంది. బకరావాల్ అనే సంచార జాతి వారు సమీపంలో నివసిస్తుండడం ఆ గ్రామస్థులకు బొత్తిగా నచ్చలేదని, రెండు వర్గాల మధ్య శత్రుత్వం చోటుచేసుకున్నదని వారిని అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నంలో ఆ బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టారని భావిస్తున్నట్టు అభియోగపత్రం వెల్లడించింది. దాని ఆధారంగా కోర్టు ఏడుగురు నిందితుల్లో ముగ్గురికి జీవితాంత జైలును , మరి ముగ్గురికి ఐదేళ్ల శిక్షను విధించింది. జీవితాంత శిక్ష పొందిన వారిలో ఆ ఊరి పెద్ద, గుడి పూజారి సంజీరామ్ కూడా ఉన్నాడు. ఆయన కుమారుడు విశాల్‌ను మాత్రం కోర్టు విడుదల చేసింది.

విచిత్రమేమిటంటే, శిక్షలు పడిన వారిలో ఒకరైన ఒక పోలీసు ఉద్యోగిని అరెస్టు చేసినందుకు నిరసనగా హిందూ ఏక్తా మంచ్ అనే సంస్థ ప్రదర్శన జరిపింది. అందులో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బిజెపి కార్యదర్శి పాల్గొన్నారు. ఐదు వేల మంది పాల్గొన్న ఈ ఊరేగింపులో ఒక మువ్వన్నెల జెండా కూడా కనిపించింది. దేశాన్ని పరిపాలించిన చరిత్ర గల జాతీయ పార్టీలలో ఎటువంటి శక్తులు ప్రాబల్యం సంపాదించుకున్నాయో దీనిని బట్టి అవగతమవుతున్నది. ఈ ఊరేగింపు ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి, నిందితు లను కాపాడడానికి ప్రయత్నం జరిగిందనే అభిప్రాయం కలగడాన్ని తప్పుపట్టలేము. ఏ ఆధారమూ, చట్టపరమైన చెప్పుకోదగిన మద్దతు లేని సంచార జనానికి న్యాయం అందుబాటులోలేని పరిస్థితిని సృష్టించే కుట్ర సాగిందనిపించడం సహజం. ఇటువంటి దారుణాల వెనుక ఆధ్యాత్మిక నీతులు చెప్పే పెద్దలుండడం ఏమి చెబుతున్నది? వారు ఎటువంటి సమాజాన్ని కోరుకుంటున్నారని భావించాలి? ఈ కేసులో జమ్ముకశ్మీర్‌లోని న్యాయవాదులు, జమ్ము బార్‌కౌన్సిల్ వహించిన పాత్ర అత్యంత హేయమైనదని చెప్పక తప్పదు.

నిందితులకు మద్దతుగా లాయర్లు ఊరేగింపు తీశారు. ఒక అసాధారణమైన, ఘాతుకమైన అమానుషచర్యను ఎటువంటి తేడాలు లేకుండా అందరూ ఒక్క కంఠంతో ఖండించినప్పుడే అక్కడ మానవీయ సమాజం నెలకొన్నట్టు రుజువవుతుంది. అందుకు విరుద్ధంగా న్యాయం తరపున నిలబడతామని చెప్పుకునే లాయర్లే ఇటువంటి కేసులో నిందితుల పక్షం వహించారంటే భారతీయ జనతా పార్టీ, హిందు భావజాలం గల సంస్థలు జరిగిన దాని పట్ల ఉదాసీనత ప్రదర్శించారంటే ఏమనాలి? మానవతాచైతన్యంతో స్పందించాల్సిన చోట మత పరమైన పక్షపాతాలు వ్యక్తమైతే మనది ఎటువంటి సమాజం అనుకోవాలి?. తాము నమ్ముకున్న దైవం పట్ల భక్తిప్రపత్తులతో మెలగడం కంటే సాటి వారికి చీమ కుట్టినంత హాని కూడా చేయకుండా ఉండడమే అసలైన మనిషితనమని అర్థం కావడం లేదా? ఒకవేళ దర్యాప్తులో ఏదైనా చిన్న పొరపాటు జరిగి వున్నా అతి తీవ్రమైన ఈ కేసులో మాత్రం నిందితులకు సందేహ లబ్ధిని ప్రసాదించలేమని కూడా న్యాయమూర్తి అన్నారంటే జరిగిందానికి న్యాయస్థానం ఎంతగా చలించిపోయిందో తెలుస్తోంది. నాగరికతలో ముందుండి స్థిర నివాసం, వృత్తి వ్యాపకాలు కలిగిన వర్గాలకు ఆదిమ అలవాటుగా సంచార జీవనం గడుపుతున్న వారికి మధ్య ఇంకా పూడని అఖాతం ఈ ఉదంతంలో స్పష్టపడుతున్నది.

Court said poetic justice needs to be done in Kathua case