Home తాజా వార్తలు వరవరరావు ఆరోగ్యంపై నివేదిక కోరిన ప్రత్యేక కోర్టు

వరవరరావు ఆరోగ్యంపై నివేదిక కోరిన ప్రత్యేక కోర్టు

Varavara Rao

 

హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక కోర్టు శనివారం నాడు నివేదిక కోరింది. ఈక్రమంలో ముంబై జెజె హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక కోర్టు నోటీసులిచ్చింది.

భీమా కోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన వరవరరావు నవీముంబైలోని తలోజా సెంట్రల్ జైల్లో ఉంటున్న విషయం విదితమే. కాగా గురువారం వరవరరావు అస్వస్థతకు గురికావడంతో ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. దీంతో తన భర్త ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని వరవరరావు భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జి డిఇ కొఠాలికర్ విచారించారు.

ఇదిలావుండగా గురువారం సాయంత్రం వరవరరావు జైల్లో కళ్లు తిరిగిపడిపోవడంతో జెజె ఆస్పత్రికి తరలించి ఆయన ఛాతీకి ఎక్స్‌రే తీశారు. అదేవిధంగా ఆయనకు కరోనా పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు చేశారు. పైల్స్, రక్తపోటు, సైనోసైటిస్, మైగ్రేన్, కాలివాపు, వెర్టిగో వంటి వ్యాధులతో బాధపడుతున్న తనకు బెయిల్ మంజూరు చేయాలని వరవరరావు ముంబైలోని స్పెషల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోర్టును ఆశ్రయించగా బెయిల్ పిటిషన్‌ను జూన్ 2కు వాయిదా వేశారు.

తాత్కాలిక బెయిల్ ఇవ్వండి: పావన
వరవరరావుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు చొరవ తీసుకోవాలని ఆయన కుమార్తె పావన శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే ఎన్‌ఐఎ అందుకు వ్యతిరేకిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ముంబయిలోని తలోజా జైలు నుంచి తమ తండ్రిని ఆసుపత్రికి తరలించిన విషయమై జైలు వర్గాలు తమకు సమాచారం అందించలేదని పావన ఆరోపించారు.

తలోజా జైల్లో ఓ ఖైదీ కరోనాతో మరణించినట్టు తెలిసిందని, అలాగే జైలులో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందన్నారు. తన తండ్రికి కరోనా టెస్ట్ చేశారని రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని ఆయన కూతురు పావన తెలిపారు. తన తండ్రికి వెంటనే తాత్కాలిక బెయిల్ ఇచ్చి జైల్ నుంచి విడుదల చేయాలని ఆమె కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలని పావన కోరారు. హైదరాబాద్ పోలీసులు తమకు పాసులు ఇస్తామంటున్నారని, కానీ కోర్టు పర్మిషన్ ఉంటే మాత్రమే తన తండ్రిని కలవగలమని పావన మీడియాకు వివరించారు.

Court seeks report on Varavara Rao health