న్యూఢిల్లీ : దేశంలో ఈ నెల 16వ తేదీనుంచి కొవిడ్ టీకాల పంపిణీకి ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా భారత్ బయోటెక్ కంపెనీ నుంచి కొవాగ్జిన్ టీకాల పంపిణీ ఆరంభం అయింది. దేశంలోని 11 నగరాలకు విమానాల ద్వారా తెల్లవారుజామున సజావుగా వ్యాక్సిన్‌ను పంపించినట్లు భారత్ బయోటెక్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి 55 లక్షల కొవాగ్జిన్ టీకా డోస్‌ల ఆర్డరును ప్రభుత్వం నుంచి ఈ కంపెనీ అందుకుంది. ఈ మేరకు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇక ప్రభుత్వానికి కంపెనీ 16.5 లక్షల డోస్‌ల టీకాలను ఉచితంగా సౌహార్థ్ర చర్యగా అందించనున్నారు.
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌కు వాడకపు అనుమతి దక్కింది. దీనితో కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్ పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. తమ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని, దేశంలోని తొట్టతొలి స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్ రావడంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయడంలో వీరు కూడా భాగస్వామ్యులయ్యారని ప్రశంసించింది. ప్రభుత్వ ప్రైవేటురంగ సంయుక్త కృషితో ఈ దేశవాళి వ్యాక్సిన్ అత్యవసర ప్రాతిపదికన అందుబాటులోకి రానుంది.