Thursday, April 25, 2024

రెండు వేలు దాటిన కోవిడ్ మృతులు

- Advertisement -
- Advertisement -

Covid 19

 

బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ కోవిడ్‌తో మృతుల సంఖ్య బుధవారం నాటికి 2000 దాటింది. వైరస్ గ్రస్థ రోగులలో కొందరి పరిస్థితి అదుపులోకి వస్తున్నా, సరికొత్తగా మరికొందరికీ ఈ వైరస్ సోకుతోంది. దీనితో చైనా ఆరోగ్య వైద్య శాఖ వ్యాధి నివారణలో తలమునకలైంది. మరో 136 మంది కరోనాతో చనిపోయినట్లు నిర్థారణ అయిందని, దీనితో మొత్తం మృతుల సంఖ్య ఇప్పటికే రెండు వేలు దాటిందని అధికారులు ధృవీకరించారు.ఇక వైరస్‌సోకిన వారి సంఖ్య 74,185కు చేరింది. కోవిడ్ 19 వైరస్‌తో 2004 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. కొత్తగా దాదాపు 1800 మందికి వైరస్ అంటుకుంది. హూబీ ప్రాంతంలోనే అత్యధికంగా ఈ వైరస్ కాటుకు బలి అవుతున్నారు. ఇతర ప్రాంతాలలో కూడా తక్కువ సంఖ్యలోనే వైరస్‌తో కొందరు చనిపోతున్నారు. దీనితో దేశమంతటా కరోనా భయాలు పట్టుకున్నాయి. మంగళవారం 236 మంది విషమ పరిస్థితికి లోనయ్యారు. దాదాపు రెండు వేల మందిని పరిస్థితి నయం కావడంతో ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపించారు. ఇప్పటికి దాదాపు 12వేల మంది వైరస్ బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే దశకు చేరుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం గణనీయ పరిణామం అని చైనా దినపత్రికలు తెలిపాయి.
డైమండ్ ప్రిన్సెస్ నౌకలో మరో 79 మందికి కరోనా
జపాన్ తీరంలో నిలిపివేసిన విలాసవంతమైన డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని వారిలో మరో 79 మందికి కరోనా వైరస్ సోకింది. దీనితో ఈ నౌకలోని 621 మంది ప్రయాణికులు ఈ వ్యాధికి గురి అయినట్లు నిర్థారించారు. 14 రోజులుగా ఈ నౌకను క్వారంటైన్ చేసి ఉంచారు. కొందరు రోగులను ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లతో వారి దేశాలకు తీసుకువెళ్లాయి. కొద్ది రోజులగా వైరస్ సోకడం ఆగిపోయినట్లు కన్పించినా తిరిగి ఇప్పుడు మరికొందరికీ వైరస్ సోకినట్లు తెలియడంతో వైద్యాధికారులు నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఐటిబిపి కేంద్రంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత 406 మందిని తిరిగి ఇళ్లకు పంపించారు. వీరికి కరోనా లేదని వెల్లడైంది. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు వారు ఈ తనిఖీల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఇక్కడ చేర్చుకుని క్షుణ్ణంగా పరీక్షలు చేపట్టిన తరువాత వీరిని డిశ్చార్జీ చేశారు. వూహాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారిని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇక్కడ వైద్య పరీక్షలకు ఉంచారు.

Covid 19 death toll surpasses 2000 in China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News