Home తాజా వార్తలు రోగుల వద్దకు వైద్యం

రోగుల వద్దకు వైద్యం

Covid-19 home quarantine be restricted to 17 days

 

స్వల్ప తీవ్రత కలిగిన కరోనా బాధితులకు ఇంటి వద్దనే ట్రీట్‌మెంట్

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వంద మందికిపైగా రోగులకు గృహ వైద్యం అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు
ఇంట్లో సేవలు అందిస్తున్న వారికి కూడా చికిత్స
17 రోజులు గృహ క్వారంటైన్

మన తెలంగాణ/హైదరాబాద్ : అసింప్టమాటిక్(లక్షణాలు లేని), స్పల్ప తీవ్రత కలిగిన కరోనా రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దనే వైద్యం అందిస్తుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సదరు బాధితులకు చికిత్స నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 100మందికి పైగా బాధితులకు వైద్యాధికారులు హోం ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. వీరంతా 17 రోజుల పాటు ఇంటి వద్దనే ఉంటూ వైద్యులు సలహాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విభాగానికి చెందిన రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందితే వేరే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

రోగులతో పాటు వారికి సేవలు అందించే వారికి కూడా తగిన సూచనలు ఇస్తూ వైద్యం అందిస్తున్నామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా శ్రీనివాసరావు ‘మన తెలంగాణకు’ తెలిపారు. అయితే కోవిడ్ సోకకపోయిన అనుమానిత లక్షణాల వారూ క్వారంటైన్ ఉండటం వలన వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని ఆయన చెప్పారు. ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందాల్సి వస్తుందని చాలా మంది లక్షణాలు ఉన్నా అధికారులకు చెప్పడం లేదని, దాని వలన మరింత పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తక్కువ లక్షణాలు ఉంటే వారికి ఖచ్చితంగా ఇంట్లోనే వైద్యం అందిస్తామని ఆయన అన్నారు. రోజురోజుకి కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో కూడా రద్దీ పెరుగుతుంది.

ఈ నిర్ణయంతో ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సులువుగా ఉంటుందని వైద్య ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు ఏం చేయాలి? రోగులకు సేవలు అందించే సహయకులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాల మీద రాష్ట్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను సూచించింది. వాస్తవంగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతం మంది రోగులకు ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ సోకుతుంది. మరి కొంత మందిలో స్పల్ప లేదా తక్కువ జ్వరం, దగ్గు కనిపిస్తుంది. అయితే వీరికి ఇంటి వద్దనే ఉంచి చికిత్స అందించడ ం వలన క్రిటికల్ కండిషన్ రోగులకు మరింత అప్రమత్తంగా వైద్యం అందించే అవకాశాలు ఉంటాయని రాష్ట్ర సర్కార్ మరో సారి స్పష్టం చేసింది.

కోవిడ్ అనుమానితులు చేయాల్సినవి
ఇంట్లో ఎవరికైనా కోవిడ్ 19 ఉందని అనుమానం కలిగినా భయపడవద్దని వైద్యశాఖ తెలిపింది. లక్షణాలు తక్కువగా ఉన్న వారు లేదా అసలు లక్షణాలు లేని వారు ఇంట్లోనే చికిత్స పొందవచ్చని పేర్కొంది. ఈక్రమంలో వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్న వారు 17 రోజుల పాటు బయటకు రాకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ అధికారులు సూచించిన నిబంధనలు తు.చ తప్పక పాటించాలని అధికారులు చెబుతున్నారు.

ఇంట్లో చికిత్స పొందే వారు చేయాల్సినవి…
రోగి ఇంటిలో గాలి, వెలుతురు ఉన్న ప్రత్యేక గదిని ఎంచుకోవాలి. దీంతో పాటు ప్రత్యేకమైన మరుగుదొడ్డిని అందుబాటులో ఉంచుకోవాలి. సేవలందించేకు గాను ఆరోగ్యవంతులైన కుటుంబ సభ్యులను మాత్రమే అర్హులు. వారు రోగికి 24 గంటలు అందుబాటులో ప్రణాళికను పెట్టుకోవాలి. ఒక వేళ అలాంటి వ్యక్తి లేకపోతే 18005994455 నంబరు కాల్ చేసి అధికారులకు తెలియజేయాలి. కోవిడ్ అనుమానిత, నిర్ధారణ అయిన వ్యక్తి చికిత్స పొందుతున్న లేదా క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి నివసించే ఇంట్లో 55 సంవత్సరాల పై బడిన వ్యక్తులు, గర్బిణి స్త్రీ, దీర్ఘకాలిక వ్యాధులైన కేన్సర్, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, డయాబెటిస్, బిపి, గుండెజబ్బు కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే రోగి కోలుకునే వరకు వారిని వేరే చోటుకు పంపాలి.

అనుమానించబడిన, నిర్ధారించబడిన రోగి ఇంటిలో కుటుంబ సభ్యులు ఉండాల్సి వస్తే వారంతా వైద్యులు సలహా మేరకు హైడ్రాక్సిక్లోరోక్విన్ తీసుకోవాలి. 15 ఏళ్ల లోపు, ఎలర్జీ, గుండెజబ్బు, ఇతర రోగాల ఉన్న వారు వైద్యున్ని సూచనతో మాత్రమే వేసుకోవాలి. ఆరోగ్యసేతు యాన్‌ని తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని వేళలా యాప్ పని చేసేలా బ్లూటూత్ అండ్ ఇంటర్నెట్ కలిగి ఉండాలి. ప్రభుత్వం నియమించబడిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యబృందం రోగి ఆరోగ్యాన్ని పరిశీలించుటకు ప్రతి రోజు కాల్ చేస్తారు కావున వారికి సహకరించి ప్రతి రోగికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.

కోవిడ్ రోగి పాటించాల్సినవి…
వీలైనంత వరకు ప్రత్యేక గది నుంచి బయటకు రాకూడదు. తప్పనిసరి పరిస్థితులలో రావాల్సి వస్తే మాస్క్ ధరించాలి. దగ్గినప్పుడు రూమాలు, టిష్యూ పేపర్ అడ్డుపెట్టుకోవలెను. వీటిని ఎప్పటికీ అందుబాటులో ఉంచాలి. దగ్గుతున్నప్పుడు అడ్డం పెట్టుకున్న రుమాలు తడిసినట్లయితే పాలిథీన్ కవర్‌లో పెట్టవలెను. టిష్యూ వాడినట్లయితే మూతగల చెత్తబుట్టలో వేయాలి. మాస్క్‌తో పాటుగా టిష్యూను కూడా పారవేయాలి. గోరు వెచ్చని నీరు ప్రతి రోజూ కనీసం రెండు లీటర్లు త్రాగాలి. వ్యక్తిగత బాత్ రూం ఉంటే టాయిలెట్ లోపలికి వెళ్లే ముందు చేతులను సబ్బు నీటితో కడుక్కోవాలి. ఉపయోగించిన తర్వాత కూడా టాయిలెట్‌ను తాకిన ఉపరితలాలను శుభ్రపర్చి చేతులను సబ్బుతో కడుక్కోవాలి. రోగి తన గదిని తానే శుభ్రం చేసుకుంటే మేలు. గదిని నిత్యం బ్లీచింగ్ పౌడర్ నీటితో శుభ్రపరలి. పోగత్రాగకకపోవడం మంచిది. కుటుంబ సభ్యులకు నిత్యం భౌతిక దూరం పాటించాలి. రోగి వినియోగించిన వస్తువులు ఇతరులు ముట్టుకోవద్దు. బట్టలు అయితే 20 నుంచి 30 నిమిషాలు నానపెట్టి ఉతికి ఆరేయాలి.

వైద్య సహాయం ఎప్పుడు పొందాలి…
దగ్గు, గొంతునొప్పి, ఛాతిలో నొప్పి, పెదాలు, ముఖం నీలం రంగులోకి మారడం, విపరీతమైన జ్వరం, శ్వాసతీసుకొవడం కష్టమనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. రోగికి సేవలందించే వారు కూడా మాస్కు ధరించాలి. రోగి దగ్గరగా ఉన్పప్పుడు సహయకులు కూడా ముక్కు, నోరు తాకకూడదు. సేవలు అందించే ముందు కనీసం 40 నుంచి 60 సెకన్లు చేతులను కడుక్కోవాలి. కేవలం ట్రీపుల్ లేయర్ మాస్కును మాత్రమే ధరించాలి. వైద్యులు ఇచ్చిన మందులు ప్రత్యేకంగా వేసుకోవాలి. ప్రతి రోజు జ్వరంతో పాటు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రత ఎక్కువైతే వెంటనే ఆరోగ్యసిబ్బందిని సంప్రదించాలి. ఇరుగుపొరుగు వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత 1000 ఫారన్ హీట్(37.80 సెంటీగ్రేడ్) కన్నా ఎక్కువ ఉన్నా లేదా నాడి కొట్టుకొను రేటు నిమిషానికి 100 కన్నా ఎక్కువ ఉన్నా వెంటనే 18005994455కి కాల్ చేయాలి.

ఆహార పదార్ధాలు…
బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ చిరుధాన్యలు, బీన్స్, పప్పు ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలతో పాటు పుల్లని పండ్లైన బత్తాయి తీసుకుంటే మరింత మేలు. సి విటమిన్ కలిగిన పండ్లతో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కావున వైరస్ ఇన్‌ఫెక్షన్ తక్కువగా ఉంటుంది. ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం వెల్లుల్లి, పసుపు వంటి వాటిని చేర్చాలి. ఇంటిలో వండిన ఆహారాన్ని తినాలి. క్రోవ్వు పదార్ధాలను తక్కువగా తీసుకోవాలి. పండ్లను తినే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకూడదు. అయితే మైదా, వేపుళ్లు జంక్‌పుడ్స్, శీతల పానీయాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు. చీస్, కొబ్బరి పామాయిల్, బటర్ తినకూడదు.

Covid-19 home quarantine be restricted to 17 days