Friday, April 19, 2024

ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి

- Advertisement -
- Advertisement -
Covid cases are on the rise around the world
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19 కేసులు మరో సారి భారీగా పెరుగుతున్నాయని, దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోందంటూ కేంద్రం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. పండగలు, సెలవుల సీజన్ కావడంతో రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని ఇదివరకే హెచ్చరించిన కేంద్రం తాజాగా మరో సారి దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల వివరాలను వెల్లడిస్తూ అప్రమత్తం చేసింది. తాజాగా శుక్రవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలిపారు. ఇందులో 244 యాక్టివ్ కేసులున్నట్లు,114 మంది పేషెంట్లు ఒమిక్రాన్ వేరియంట్‌నుంచి కోలుకున్నట్లు ఆయన చెప్పారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31, గుజరాత్‌లో 30, కేరళలో 27, రాజస్థాన్‌లో 22 కేసులు నమోదయినట్లు రాజేశ్ భూషణ్ తెలిపారు. హర్యానా, ఒడిశా, జమ్మూ, కశ్మీర్, ఎపి, యుపి, చండీగఢ్, లడఖ్‌లలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 122 కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశమని రాజేశ్ భూషణ్ తెలిపారు. వారం కిందట వంద కేసులు, మంగళవారం నాటికి 200 కేసుల మార్క్‌ను చేరుకోగా, శుక్రవారం నాటికే 350 మార్క్‌ను చేరుకోవడం గమనార్హం. మొత్తం కేసుల్లో 183 కేసులను విశ్లేషించడం జరిగందని, వారిలో 121 మందికి విదేశీ ప్రయాణాలు చేసిన చరిత్ర ఉందని చెప్పారు. కేసుల్లో 27శాతం పేషెంట్లు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, స్థానికంగానే వ్యాప్త్తి చెందిందని తెలియజేశారు. అంతేకాదు, 91 శాతం ఒమిక్రాన్ పేషెంట్లు వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లే కావడం గమనార్హం. ముగ్గురు బూస్టర్ డోసులు కూడా తీసుకున్న వారున్నారు. అలాగే రోగుల్లో 61 శాతం మంది మగవారే కావడం విశేషం.

ఇక ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో లక్షన్నర కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవి వెలుగు చూశాయి. యుకెలో 90 వేలు, డెన్మార్క్‌లో 30 వేలు వెలుగు చేశాయి. ఇప్పటిదాకా ఒమిక్రాన్‌కు సంబంధించి 26 మరణాలు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ప్రభావం తక్కువే అయినప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ, మిజోరాంలలో పాజిటివిటీ రేటు జాతీయ సగటుకన్నా చాలా ఎక్కువగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 20 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5 10 శాతంగా ఉండగా, రెండు జిల్లాల్లో 10 శాతానికి పైగా ఉందని కేంద్రం తెలిపింది. పండగల వేళ ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయాల్లో పెద్ద సంఖ్యలో గుమి కూడడం వంటివి అనుమతించరాదని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని తెలిపింది. అంతేకాకుండా అనవసర ప్రయాణాలను మానుకోవాలని కూడా సూచించింది.

కాగా గురువారం 11 లక్షల మందికి పైగా పరీక్షలు చేయించుకోగా,6,650 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో వైపు 7,051 మంది కొవిడ్‌నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 3.47 కోట్ల మార్కును దాటగా, రికవరీలు 3.42 కోట్లు ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 77,156 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 374 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4.79 లక్షలకు చేరుకుంది. ఇదిలా ఉండగా గురువారం 57 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. దీంతో గురువారం సాయంత్రం వరకు పంపిణీ అయిన టీకా డోసుల సంఖ్య 140 కోట్ల మార్కును దాటింది.

యుపిలో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రాష్ట్రాలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గురువారంనుంచే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుడగా, తాజాగా ఉత్తర ప్రదేశ్ కూడా శనివారం (25వ తేదీ)నుంచి రాత్రి కర్ఫూను అమలు చేయనుంది. రాత్రి 11నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫూ ఆంక్షలు అమలులో ఉంటాయి.అలాగే వివాహాలు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పాల్గొనేవారంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.

హర్యానాలో జనవరి 1నుంచి..

జనవరి 1వ తేదీనుంచి రాత్రి పూట కర్ఫూ విధించనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదృష్టా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని శుక్రవారంనుంచి రాత్రి 11నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫూను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ విలేఖరులకు చెప్పారు. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బహిరంగ ప్రదేశాలు, పెళిళ్ల్లు లాంటి కార్యక్రమాల్లో 200 మందికి మించి చేరడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాల్స్, దుకాణాలు, ప్రభుత్వ సంస్థల్లోకి పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు కూడా సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News