Saturday, April 20, 2024

ఖమ్మంలో ‘అమ్మా’నుషం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మాతృ దినోత్సవం ఖమ్మం జిల్లాలోని మధిరలో ఓ అమ్మకు అవమానం జరిగింది. నిరంతరం తన పిల్లల భవిష్యత్తు కోసం పరితపించే మాతృమూర్తి పట్ల కుమారులు అమానుషంగా వ్యవహరించారు. వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లికి కరోనా సోకిందని తెలిసిన కుమారులు ఏమాత్రం కనికరం లేకుండా తమ కుటుంబాలతో సహా ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. ఈ అమానవీయ సంఘటన ఖమ్మం జిల్లా మధిరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా మధిరలో ఎస్‌సి కాలనీలో నివాసం ఉంటున్న గద్దల రాహేల్ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులు తల్లి వద్దే ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రహేల్ కుమార్తె తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటోంది.

కాగా మధిరలోని ఎస్‌సి కాలనీలో ఉంటున్న తల్లికి కొవిడ్ నిర్ధరణ కావడంతో కుమారులిద్దరూ తమ కుటుంబాలను తీసుకుని తల్లిని వదిలి వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో కరోనా సోకడం, సహాయం చేసే వారులేక సదరు వృద్ధతల్లి పరిస్థితిని తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ స్పందించాడు. వెంటనే సమాచారం అందుకున్న పురపాలక కౌన్సిలర్ గద్దల మాధురి ఎస్‌సి కాలనీలో ఆచేతన స్థితిలో ఉన్న రహేల్ ఇంటికి రెస్క్యూ టీంను పంపించారు. వారు 108 అంబులెన్స్ ద్వారా వృద్ధురాలిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఆసుపత్రిలో ఉందన్న విషయం తెలుసుకున్నప్పటికీ ఆమె కుమారులు అక్కడికి రాకపోవడం విచారకరం. మాతృ దినోత్సవం నాడే ఓ కన్నతల్లికి ఇలాంటి పరిస్థితి రావడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Covid Positive Mother Abandoned by sons in Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News