Home ఎడిటోరియల్ వైద్య, ఆరోగ్య సన్నద్ధత!

వైద్య, ఆరోగ్య సన్నద్ధత!

Covid second wave is with more than lakh cases      రోజుకు లక్షకు మించిన కేసులతో కరోనా రెండవ కెరటం దేశాన్ని గడగడలాడిస్తున్నది. గత ఏడాది ఇదే కాలంలో ముందస్తు కబురు లేకుండా కమ్మేసిన ఆకస్మిక సంపూర్ణ లాక్‌డౌన్ వంటి అంధకార స్థితి తిరిగి విరుచుకుపడుతుందేమోనన్న భయానుమానాలు ప్రజలను పీడిస్తున్నాయి. సెకండ్ వేవ్ కొవిడ్ గతం కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, అంతకంటే తవ్రంగానూ ఉంటుందనే హెచ్చరికలు అమిత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. టీకా కార్యక్రమం కూడా జోరందుకున్నది. ఔషధ రంగంలో విశేష ప్రగతి సాధించిన దేశంగా ఖ్యాతి గడించిన భారత్ టీకాల తయారీ విషయంలోనూ అగ్ర భాగాన నిలిచింది. అనేక దేశాలకు అవసరమైన వ్యాక్సిన్‌ను ఉదారంగా అందించి మంచి పేరు తెచ్చుకుంటున్నది. ఇంత వరకు దేశంలో కోటి 70 లక్షల మందికి వ్యాపించిన కరోనా లక్షా 54 వేల మందిని కబళించింది.

ఇటలీ, అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్సు వంటి దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా బాధితులు, మృతుల సంఖ్య తక్కువే అయినప్పటికీ వైద్య ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత కోణంలో చూసినప్పుడు మనం బాగా వెనుకబడి ఉన్నామని అంగీకరించిక తప్పదు. ముఖ్యంగా పారిశుద్ధం, పోషకాహారం, రోగ నిరోధక శక్తి వంటి ప్రజారోగ్య సూచీలలో అధ్వాన స్థితి నుంచి మనం బయటపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది జూన్ 20వ తేదీన ఒక సందర్భంలో అన్నట్టు కరోనాతో పోరాడుతూనే దేశంలోని 130 కోట్ల మంది జనాభా ఆర్థిక ప్రగతి సాధన మీద దృష్టి పెట్టవలసి ఉంది. ప్రభుత్వ రంగంలో వైద్యం ఇటీవల కాలంలో తీవ్ర నిర్లక్షానికి గురైన విషయాన్ని కాదనలేము. విచిత్రంగా ఇంతటి కఠోర కరోనా విపత్తులో దేశ ప్రజలను ఆదుకున్నది కూడా ప్రభుత్వ వైద్య రంగమేనన్న ఆహ్లాదకర వాస్తవాన్నీ విస్మరించలేము. ఇంత వరకు ఈ రంగంపై చూపిన నిర్లక్షాన్ని ఇప్పటికైనా విడిచిపెట్టి దానిని మరింత పటిష్టం చేసుకోవలసి ఉంది.

అదే విధంగా ప్రజల వ్యక్తిగత ఆర్థిక స్తోమతను పెంచవలసి ఉంది. దేశంలోని పట్టణ ప్రాంత జనాభాలో 35.2 శాతం మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. గ్రామీణ పేదల స్థితిగతులు మరింత దారుణంగా ఉన్నాయి. 150 కోట్ల మంది జనాభాలో 80 కోట్ల మంది పేదలే, వీరిలో అత్యధిక శాతం మంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత తాత్కాలికమైన ఉపాధి పనులతో పొట్ట పోషించుకుంటున్నారు. దేశంలో 21 శాతం మంది బాలల్లో ఎత్తుకు తగిన బరువు లేదని తేలింది. అలాగే 36 శాతం మందిలో వయసుకు తగిన బరువు లేమి కనిపిస్తున్నది. 7.5 శాతం మంది బాలలు అత్యంత తీవ్రమైన పోషకాహార కరువుతో బాధపడుతున్నారు. సమగ్ర బాలల అభివృద్ధి సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్, జననీ సురక్ష యోజన, మాతృత్వ సహ్యోగ్ యోజన, మధ్యాహ్న భోజన పథకం, జాతీయ ఆహార భద్రత మిషన్ వంటి పథకాలన్నింటినీ ఈ దుస్థితి వెక్కిరిస్తున్నది.

దేశంలోని చాలా రాష్ట్రాల్లోని పిల్లలు ఐదేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత పోషకాహార లేమితో బాధపడుతున్నారని తేలింది. మహిళల్లో అత్యధిక శాతం దారిద్య్రానికి బలైపోతున్నారు. ధరలను, జీవన వ్యయభారాన్ని గణనీయంగా తగ్గించడం. అలాగే ప్రభుత్వ వైద్య సదుపాయాలను విశేషంగా మెరుగుపరచడం తక్షణావసరాలు. దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.7 ఆసుపత్రి పరుపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో కేరళ, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉండగా, బీహార్ వంటివి చెప్పనలవి కానంత హీన స్థితిలో ఉన్నాయి. బీహార్‌లో ప్రతి వెయ్యి మందికి 0.11 ఆసుపత్రి బెడ్లు మాత్రమే ఉండడం అత్యంత దయనీయం. అలాగే వైద్యుల అందుబాటు కూడా కడు హీనంగా ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.857 మంది వైదులే ఉన్నారు. కేంద్రం బడ్జెట్‌లో వైద్యం మీద ఖర్చును బాగా పెంచవలసి ఉంది.

మన దేశంలో వైద్యంపై ప్రభుత్వం పెడుతున్న స్థూల దేశీయోత్పత్తిలో (జిడిపి) 1 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య ఖర్చును గణనీయంగా పెంచినట్టు కనిపిస్తున్నప్పటికీ అందులో చాలా భాగం కరోనా నేపథ్యంలో తలపెట్టిన కొన్ని ప్రత్యేక పథకాలకు సంబంధించిన కేటాయింపులే కావడం గమనించవలసిన విషయం. వైద్యావసరాలకు వ్యక్తులు సొంతంగా చేస్తున్న వ్యయం ప్రపంచ సగటు 18.2 శాతమే కాగా, మన ప్రజలు మొత్తం వైద్య ఖర్చులో మూడింట రెండు వంతులు తామే భరిస్తున్నారు. ఈ స్థితిని వీలైనంత తొందరగా మార్చవలసి ఉంది.

Covid second wave is with more than lakh cases in India