Home తాజా వార్తలు కొవిడ్ టెస్టులు 5 లక్షలు దాటాయ్

కొవిడ్ టెస్టులు 5 లక్షలు దాటాయ్

Covid tests crossed 5 lakhs in Telangana

 

కొత్తగా 1286 కేసులు, 12 మంది మృతి
సింగర్ స్మిత దంపతులకు వైరస్
తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో నటుడు పృధ్వీరాజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిపిసిఆర్, యాంటీజెన్ కలిపి 5,01025 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 15వేల నుంచి 20వేలు చేస్తుండగా, రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను 20 నుంచి 25వేలకు పెంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం 13,787 టెస్టులు చేయగా 1286 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 12 మంది చనిపోయినట్లు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 391 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 9, భద్రాద్రి 38,జగిత్యాల 22, జనగాం 8, భూపాలపల్లి 6,గద్వాల 55, కామారెడ్డి 6,కరీంనగర్ 101,ఖమ్మం 41, ఆసిఫాబాద్ 3,మహబూబ్‌నగర్ 39 , మహబూబాబాద్ 27, మంచిర్యాల 21, మెదక్ 7, మేడ్చల్ మల్కాజ్‌గిరి 72, ములుగు 5, నాగర్‌కర్నూల్ 29, నల్గొండ 29,నారాయణపేట్ 4, నిజామాబాద్ 59, పెద్దపల్లి 29,సిరిసిల్లా 0, రంగారెడ్డి 121, సంగారెడ్డి 15, సిద్ధిపేట్ 14, సూర్యాపేట్ 23, వికారాబాద్ 17,వనపర్తి 14, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ లో 63, యాదాద్రిలో మరో 3 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 68,946కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 49,675కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 18,708 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 11,935 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 563కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

కోవిడ్‌తో మాజీ ఎంఎల్‌ఏ మృతి…
కోవిడ్ వైరస్ దాడితో భద్రాచలం మాజీ ఎంఎల్‌ఏ సున్నం రాజయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు టెస్టు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆయన మరణం తీరని లోటని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మూడు సార్లు ఎంఎల్‌ఏగా గెలిచిన ఆయన అతి సాధారణ జీవితం గడిపి అందరికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. అసెంబ్లీలో వారితో ఉన్న అనుబంధం మరిచిపోలేదని మంత్రి అన్నారు.

వారి ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదే విధంగా సినీనటుడు పృధ్వీరాజ్ కూడా కరోనా సస్పెక్ట్‌గా చికిత్సపొందుతున్నట్లు సమాచారం. 10 రోజుల క్రిందట తీవ్రమైన అనారోగ్యం, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు టెస్టులు చేయగా నెగటివ్ వచ్చింది. సిటీ స్కాన్ చేసినా కూడా వైరస్ తేలలేదు. దీంతో 15 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని వైద్యుల సూచనను ఆయన పాటించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే తనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Covid tests crossed 5 lakhs in Telangana