Friday, April 19, 2024

కొవిషీల్డ్ డోస్‌ల విరామం తగ్గింపు

- Advertisement -
- Advertisement -

Covishield dose gap may again be reduced

45 ఏండ్లు పై వారికి వర్తింపు
ప్రాంతాలు జనం వారిగా అధ్యయనం
శాస్త్రీయతే కీలకం: డాక్టర్ అరోరా

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం మరోసారి కుదించనుంది. అయితే 45 సంవత్సరాలు అంతకు పైబడ్డ వయస్సు వారికి ఇది వర్తిస్తుంది. రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచే విషయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా గురువారం ఓ ఇంటర్వూలో తెలిపారు. సంబంధిత అంశంపై రెండు నుంచి నాలుగు వారాలలో నిర్ణయం తీసుకుంటారు. గ్యాప్ తగ్గింపు విషయంలో పూర్తిస్థాయిలో విశ్లేషణలు జరుగుతున్నాయని, ఏదైనా పూర్తిస్థాయి తుది శాస్త్రీయ నిర్థారణ తరువాతనే విషయం ఖరారు అవుతుందని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా రూపమే కొవిషీల్డ్ కాబట్టి, ప్రతి డోస్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు, పనితీరు బేరీజులు అందుబాటులో ఉన్నాయి.

ఇక భారత్‌లో కూడా స్థానికంగా పలు ప్రాంతాలలో జనాభాపై ఒక్కో డోస్ ఏ మేరకు పనిచేస్తున్నదనేది నిర్థారించుకోవడం జరుగుతోందని అరోరా తెలిపారు. వ్యాక్సిన్లు వాటి డోసేజ్‌లకు సంబంధించి విరామం వాటి ప్రభావం గురించి సరైన డాటాను తెప్పించుకున్నామని , వివిధ ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, ప్రాంతాల వారిగా డోస్‌ల మధ్య గ్యాప్ ఖరారు చేసే అంశం కూడా పరిశీలనకు వస్తుందని డాక్టర్ అరోరా వెల్లడించారు. దేశంలోని వయోజనులకు ఇప్పుడు డోస్‌ల మధ్య ఉన్న వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలినాళ్లలో గ్యాప్ 4 నుంచి 6 వారాలు, తరువాత ఇది 4 నుంచి 8 వారాలకు పెరిగి, చివరికి ఇప్పటి 12 నుంచి 16 వారాలకు ఖరారు అయింది. అయితే ఈ విధంగా గ్యాప్‌ను విపరీతంగా పెంచడంపై సర్వత్రా విమర్శలు వెలువడ్డాయి.

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉండటం, కంపెనీల నుంచి కేంద్రం సరైన స్థాయిలో టీకాలు పొందలేని స్థితి వల్లనే ఈ విధంగా గ్యాప్‌ను పెంచారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే అటువంటిదేమీ లేదని అంతర్జాతీయ స్థాయిలో వ్యాక్సిన్లకు సంబంధించి జరిగిన అధ్యయనాల ప్రాతిపదికననే నిర్ణయం తీసుకున్నామని నిపుణులు తెలిపారు. డోస్‌ల మధ్య విరామం ఎక్కువ ఉంటే తొలి డోస్‌తో ఉత్పన్నం అయ్యే యాంటీబాడీస్‌ల స్థాయి క్రమేపీ పెరుగుతుందని తేల్చారు. తొలి డోస్ తరువాతి డోస్‌కు మధ్య మరింత సమయానికి వీలేర్పడటం అనేది యాంటీబాడీస్ పనితీరు విస్తృతి కోణపు విషయం అని, వ్యాక్సిన్ల కొరతకు సంబంధించినది కాదని అధికార వర్గాలు తేల్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News