Thursday, April 18, 2024

వచ్చేసింది టీకా

- Advertisement -
- Advertisement -

మృత్యువేదనకు మృత్యుఘంటిక

వచ్చేసింది టీకా

పూణే నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వచ్చిన 3.64 లక్షల డోసులు

పోలీసు భద్రత మధ్య కోఠి సెంట్రల్ స్టోరేజ్‌కు తరలింపు
సర్వమత ప్రార్ధనలు అనంతరం 31 బాక్సులను నిల్వ చేసిన అధికారులు
నేడు జిల్లా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వైద్యశాఖ
టీకా తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చు: డిహెచ్ శ్రీనివాసరావు
లబ్ధిదారులే అంబాసిడర్లుగా మారాలి: టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకుంది. పూణే నుంచి కార్గో విమానంలో 3.64 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు మధ్యాహ్నం 12.05 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్డుకు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేక వాహనంలో సుమారు 20మంది పోలీసు సిబ్బంది భద్రత మధ్య వ్యాక్సిన్ డోసులు కోఠి సెంట్రల్ స్టోరేజ్‌కు 12.55 గంటలకు వచ్చాయి. ఈ టీకాను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, కరోనా వ్యాక్సినేషన్ ఆఫీసర్ డా జి శ్రీనివాసరావు, డిఎంఇ డా.రమేష్‌రెడ్డి, టిఎస్‌ఎంఐడిసి(తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.సుధీరా రిసీవ్ చేసుకున్నారు. అయితే, ఎయిర్‌పోర్డు నుంచి రాష్ట్రానికి చేరుకున్న టీకా బాక్సులను డిహెచ్ డా జి శ్రీనివాసరావు తన సిబ్బందితో కలసి స్వయంగా వాహనం నుంచి కిందికిదించడం గమనార్హం. రాష్ట్రానికి తొలిసారి వ్యాక్సిన్ రావడంతో సర్వమత ప్రార్ధనల అనంతరం అధికారులు టీకా డోసులను నిల్వ చేశారు. అనంతరం టీకా స్టోరేజ్ సెంటర్ వద్ద సాధారణ సెక్యూరిటీతో పాటు పోలీసు భద్రతనూ పెంచారు.
31 బాక్సుల్లో 1200 వయల్స్…
రాష్ట్రానికి తొలిసారి 31 బాక్సుల్లో 1200 వయల్స్ టీకా వచ్చింది. ఒక్కో వయల్‌లో 5 ఎంఎల్ సామర్ధంతో పది డోసుల టీకా ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే మనకు డెలివరీ అయిన టీకా 01.11.2020 నాడు తయారు కాగా, 29.4.2021 తేదిన ఎక్స్‌ఫైర్ కానుందని టీకా లేబుల్స్ స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి విడత 6.50 లక్షల కొవిషీల్డ్ డొసులు రావాల్సి ఉండగా, మంగళవారం మధ్యాహ్నానికి 3.64 లక్షల డొసులు చేరుకున్నాయి. మిగత డోసులు ఈరోజు(బుధవారం) వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనిక్ భాగస్వామ్యంతో సీరమ్ సంస్థ తయారు చేసిన ఈ కొవిషీల్డ్ డోసులను ప్లస్ 2 నుంచి ప్లస్ 8 అతి శీతల బాక్సుల్లో నిల్వ చేయనున్నారు. ఈమేరకు మంగళవారం చేరుకున్న డోసులను కోఠిలో 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్‌లో నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు.
నేడు జిల్లా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు..
కోఠి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉన్న టీకాలను ఈ రోజు(బుధవారం) జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పది జిల్లాల్లో ఉన్న రీజనల్ సెంటర్లకు పంపి అక్కడ్నుంచి అవసరమైన కరోనా టీకా బూత్‌లకు వ్యాక్సిన్‌ను పంపించనున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఈనెల 16వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి రోజు 139 కేంద్రాల్లో సుమారు 13,900 మందికి టీకా వేసేందుకు అధికారులు లక్షం పెట్టుకున్నారు. ఈమేరకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
టీకా తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చుః హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు
కరోనా టీకా తీసుకోవడం వలన సురక్షితంగా ఉండొచ్చని హెల్త్ డైరెక్టర్ డా.జి శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్పల్పపాటి సమస్యలు వచ్చినా వాటితో ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. టీకా డెలివరీ తర్వాత ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్ధత, భద్రతలో మెరుగ్గా ఉందని ఇప్పటికే సైంటిస్టులు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. కావున వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేకుండా అర్హులంతా తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా తొలి రౌండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు హెల్త్ కేర్ వర్కర్లంతా సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.
లబ్ధిదారులే అంబాసిడర్లుగా మారాలి: టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్‌రెడ్డి
టీకాపై అవగాహన కల్పించేందుకు లబ్ధిదారులే అంబాసిడర్లుగా మారాలని టిఎస్‌ఎంఐడిసి ఎండి కె చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మనకు వచ్చిన కొవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్‌లు చాలా తక్కువని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారని ఆయన అన్నారు. కొవిషీల్డ్ టీకాను తీసుకుంటున్న దేశాల్లో వ్యాక్సిన్ ప్రభావంతో ఒక్కరూ కూడా చనిపోలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కావున వ్యాక్సినేషన్ 1లో తొలిరౌండ్‌లో టీకాను పొందతున్న హెల్త్ కేర్ వర్కర్లే ప్రజలను చైతన్య వంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా దాదాపు ఆరు వారాల పాటు కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రెండు డోసుల వేసుకున్న 2 వారాల తర్వాతనే యంటీబాడీలు డెవలప్ అవుతాయని ఆయన తెలిపారు.

Covishiels Vaccine Arrives to Hyderabad from Pune

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News