Tuesday, April 23, 2024

‘రాజా’ కామెంట్‌కు సజ్జనార్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

CP Sajjanar Counter To BJP MLA Raja Singh

హైదరాబాద్: డబ్బుల కోసం కొందరు పోలీసులు ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన ఆరోపణలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫైర్‌అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నుంచి హైదారాబాద్‌లోని బహుదూర్‌పురకు ఆవులను తరలిస్తున్న లారీని ఎంఎల్‌ఎ రాజా సింగ్ మంగళవారం ఉదయం పట్టుకున్నారు. దాదాపు 45 ఆవులతో శంషాబాద్ మీదుగా వెళ్తున్న లారీని చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద రాజాసింగ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ కొందరు పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని, ఈ సంఘటనపై డిజిపి స్పందించాలని డిమాండ్ చేశాడు.

ఆవులు, ఎద్దులను వధించటం నేరమని, గోవధపై బహుదూర్ పుర మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని, అధికారులు స్పందిచకపోతే మేమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని, గోవులతో పోలీసు అధికారుల కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోవధను అడ్డుకోవాల్సిన పోలీసులు బిజెపి కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు డబ్బులు తీసుకుని గోవధకు సహకరిస్తున్నారని బహిరంగంగా నిరాధార వ్యాఖ్యలు చేయడంపై సైబరాబాద్ సిపి సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో పోలీసులు, డిజిపిపై కామెంట్లు చేయడం ఫ్యాషన్‌గా మారిందని సిపి మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సిపి తప్పుబట్టారు.

ఈక్రమంలో పోలీసులపై బిజెపి నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్ చేసిన బహిరంగ వ్యాఖ్యలపై లీగల్ చర్యలు తీసుకుంటామని, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు వ్యవస్థపై పబ్లిక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రతి కేసును సమర్థంగా ఎదుర్కొంటున్నామని, ఈక్రమంలో పోలీసుల మీద, డిజిపి మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్‌గా మారిందంటూ సిపి మండిపడ్డారు. బిజెపి నేతలు పోలీస్ మొరాలిటీ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కొకతప్పదని హెచ్చరించారు.ఎంఎల్‌ఎ రాజాసింగ్ గౌరవప్రదమైన హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే చట్టపరమైమ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని సిపి సజ్జనార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News