Home ఖమ్మం మేకల సంగయ్య మృతి సిపిఐకి తీరని లోటు

మేకల సంగయ్య మృతి సిపిఐకి తీరని లోటు

sangamaiah1మనతెలంగాణ/ ఖమ్మం : సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య (76) తీవ్ర అనారోగ్యానికి గురై శనివారం బుర్హాన్‌పురంలోని తన స్వగృహంలో మృతి చెందారు. మృతునికి భార్య మేకల వీరమ్మ, కుమారులు మేకల శ్రీనివాసరావు, రవి కుమార్, హరీష్, రమేష్‌లు ఉన్నారు. మేకల సంగయ్య యుక్త వయస్సు నుండే ప్రగతి శీల భావాలు అలవర్చుకుని తొలుత నక్సలైట్‌గా కొంతకాలం పాటు పని చేశారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)లో చేరి పేదల పక్షాన పని చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శిగా 18 సంవత్సరాల పాటు పని చేశారు. ఆ కాలంలోనే ఎఐటియుసి కార్మిక సంఘం అనుబంధంగా పలు సంఘాలను స్థాపించారు. మొదటి నుండి కూడా ఆయనను సంఘాల సంగయ్యగా, ట్రేడ్ యూనియన్ నిర్మాతగా చెప్పుకునే వారు. సుదీర్ఘ కాలం పాటు ఎఐటియుసి జిల్లా అధ్యక్షునిగా, కార్యదర్శిగా ప్రస్తుతం గౌరవాధ్యక్షనిగా పని చేస్తున్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా పని చేస్తూనే రాష్ట్ర సమితి సభ్యునిగా పని చేస్తున్నారు.
సంగయ్య మృతి పట్ల పువ్వాడ, తమ్మినేని, చౌదరి, బాగంల సంతాపం…
సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య మృతి వార్త తెలియగానే ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పార్టీ జెండాను కప్పి నివాళ్లర్పించారు. నివాళ్లర్పించిన వారిలో సిపిఐ సీనియర్ నాయకులు, ఖమ్మం మాజీ ఎంఎల్‌ఎ పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర నాయకులు టి.వి.చౌదరి, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పోటు ప్రసాద్, మహ్మద్ మౌలానా, శింగు నర్సింహారావు, తెలంగాణ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ రావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.బి.బేగ్, సిపిఐ నగర కార్యదర్శి ఎస్‌కె. జానిమియా, కార్యవర్గ సభ్యులు మహ్మద్ సలాం, నాయకులు డా॥ పారుపల్లి గోర్కి, బి.జి.క్లెమెంట్, అడపా రామకోటయ్య, దొండపాటి రమేష్, యానాలి సాంబశివారెడ్డి, వై.వినయ్ కుమార్, నూనె శశిధర్, గాదె లక్ష్మి నారాయణ, పువ్వాడ విజయలక్ష్మి, పువ్వాడ జయశ్రీ, బోజెండ్ల సూర్యారావు, ఎస్‌కె.జానిమి యా, సిహెచ్.సీతామహాలక్ష్మి, ఏపూరి లతాదేవి, తాటి నిర్మల, కార్పొరేటర్లు తోట రామారావు, కుమ్మరి ఇందిర, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు పారా నాగేశ్వరరావు, గాంధీ, శెట్టి రంగారావు, మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్యలతో పాటు వివిధ పార్టీల నాయకులు, మేధావులు, సన్నిహితులు తదితరులు ఉన్నారు.
సిపిఐ జిల్లా సమితి సంతాపం…
సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య మృతి పట్ల సిపిఐ జిల్లా సమితి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాపం సూచకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోని పార్టీ జెండాను అవనతం చేశారు. ఇదిలా ఉండగా సంగయ్య భౌతిక కాయాన్ని సందర్శనార్ధం ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బైపాస్ రోడ్డులోని గిరి ప్రసాద్ భవన్‌లో ఉంచనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, తరలి రావాలని బాగం హేమంతరావు తెలిపారు. ఉదయం తొమ్మిదిన్నరకు పార్టీ కార్యాలయం నుండి అంతిమ యాత్ర బయలుదేరుతుందని అన్నారు. పది గంటలకు హిందూ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సంగయ్య మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి సంతాపం…
సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య మృతి పట్ల సిపిఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణతో పాటు ఆయా రాష్ట్రాల సహాయ కార్యదర్శులు సిద్ధి వెంకటేశ్వర్లు, పల్లా వెంకటరెడ్డి, ముప్పాల నాగేశ్వరరావుతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశిబరావు, తదితరులు ఉన్నారు. ఆయన మృతి భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరని లోటని శ్లాఘించారు. ఆయన మృతి పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఎఐటియుసి సంతాపం…
ఎఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు, సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య మృతి కార్మిక ఉద్యమానికి తీరని లోటని ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎఐటియుసి బలోపేతానికి ఐదు దశాబ్దాలకు పైగా ఎంతో కృషి చేశారని ఆయన మృతి కార్మిక సంఘానికి తీరని లోటని అన్నారు. ఆయన మృతి పట్ల ఎఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.జి.క్లెమెంట్, శింగు నర్సింహారావులు సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయంపై ఎఐటియుసి జెండా కప్పారు.
ఎంపి పొంగులేటి, మాజీ ఎంపి నామ సంతాపం…
సిపిఐ సీనియర్ నాయకులు మేకల సంగయ్య మృతి పట్ల వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఖమ్మం మాజీ ఎంపి నామ నాగేశ్వరరావులు సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాల పాటు నిబద్దతో పేదల పక్షాన పని చేసిన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడని శ్లాఘించారు.