Thursday, April 25, 2024

స్టార్లు లేకున్నా భారత్‌దే పైచేయి

- Advertisement -
- Advertisement -

స్టార్లు లేకున్నా భారత్‌దే పైచేయి
అద్భుత ఆటతో అలరిస్తున్న టీమిండియా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా పోరాట పటిమను ఎంత పొగిడినా తక్కువే. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా పలువురు కీలక ఆటగాళ్లు సిరీస్‌కు దూరమైనా భారత్ అసాధారణ ఆటతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవడం దాదాపు అసాధ్యమేనని చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో పాటు భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. ఇక మార్క్‌వా, వార్న్, మైక్ హసి వంటి క్రికెటర్లు అయితే ఒక అడుగు ముందు వేసి సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కానీ, భారత జట్టు మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా రహానె మాత్రం అసాధారణ సారధ్యంతో జట్టును నడిపిస్తున్న తీరును ప్రశంసించక తప్పదు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రహానె ఇటు కెప్టెన్సీలోనే కాకుండా బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటాడు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు. అంతకుముందు మ్యాచ్‌లో 36 పరుగులకే కుప్పకూలిన టీమిండియా రెండో టెస్టులో విజయం సాధిస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. గెలుపు మాట అటుంచి కనీసం డ్రాతో గట్టెక్కినా అదే పదివేలని చాలా మంది పేర్కొన్నారు.

అయితే, భారత్ మాత్రం సమష్టికృషితో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. రహానె బ్యాటింగ్‌లో సత్తా చాటగా గిల్, పంత్, జడేజా తమవంతు సహకారం అందించారు. ఇక బుమ్రా, సిరాజ్, అశ్విన్, ఉమేశ్, జడేజాలు బంతితో విజృంభించారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయం అందుకుంది. ఇక సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో కూడా టీమిండియా అద్భుత ఆటతో ఆకట్టుకుంది. రెండో రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కానీ, మూడో రోజు ఆటలో మళ్లీ ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. నాలుగో రోజుకు వచ్చేసరికి కంగారూలు మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకున్నారు. ఇలాంటి స్థితిలో భారత్‌కు ఓటమి ఖాయమని అందరూ ఓ అంచనకు వచ్చేశారు. టీమిండియా క్రికెటర్లకు కూడా మ్యాచ్‌పై ఎలాంటి ఆశలేదు. చివరి ఇన్నింగ్స్‌లో 403 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిండం దాదాపు అసాధ్యంగా కనిపించింది. కానీ ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా, యువ సంచలనం రిషబ్ పంత్ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించే బాధ్యతను సమర్థంగా పోషించారు. పంత్ విధ్వంసక బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తించాడు. ఇక పుజారా తన మార్క్ డిఫెన్స్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. వీరిద్దరూ ఔటైనా తెలుగుతేజం హనుమ విహారి, స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అసాధారణ పోరాట పటిమతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని భావించిన ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లారు. కాగా, ఈ మ్యాచ్‌లో గాయాలు వెంటాడుతున్నా పంత్, విహారి, అశ్విన్ కనబరిచిన పోరాట పటిమ భారత క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.

Cricketers Praise on Team India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News