Wednesday, April 24, 2024

సాధనకు లైన్ క్లియర్ 

- Advertisement -
- Advertisement -

Cricketers who started Practicing

 

ప్రాక్టీస్ షురూ చేయనున్న క్రికెటర్లు!

ముంబై: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కాలంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మార్చి 20 నుంచి దేశంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండడంతో క్రికెటర్లతో సహా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. కాగా, లాక్‌డౌన్4లో మాత్రం ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఖాళీ స్టేడియాల్లో క్రీడలు నిర్వహించేందుకు, ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో చాలా కాలంగా సాధనకు దూరంగా ఉన్న క్రికెటర్లకు, ఇతర క్రీడాకారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే విషయమై కసరత్తులు ప్రారంభించింది. త్వరలోనే దేశంలోని ప్రధాన క్రికెటర్లందరికి శిక్షణ ప్రారంభించాలనే యోచనలో ఉంది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చాలా మంది సీనియర్ క్రికెటర్లు సాధన చేసేందుకు తహతహలాడుతున్నారు.

సాధ్యమైనంత త్వరగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని వారు బిసిసిఐని కోరుతున్నారు. రానున్న బీజీ క్రికెట్ షెడ్యూల్ నేపథ్యంలో క్రికెటర్లకు ప్రాక్టీస్ చాలా కీలకంగా తయారైంది. కరోనా దెబ్బకు ఆటగాళ్లతో సహా ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో క్రికెటర్లు ఇండోర్ స్టేడియాల్లో సాధన చేస్తున్నారు. భారత్‌లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. చాలా మంది క్రికెటర్లు మహా నగరాల్లోనే ఉండడం, ఇక్కడ తగినన్ని ఇండోర్ స్టేడియాలు అందుబాటులో లేక పోవడంతో ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాగా, రానున్న శ్రీలంక సిరీస్ నేపథ్యంలో క్రికెటర్లకు సాధన ఎంతో అవసరంగా మారింది.

చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉండడంతో మళ్లీ గాడిలో పడేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో బిసిసిఐ కూడా ఈ విషయం దృష్టి సారించింది. సాధ్యమైనన్నీ ఎక్కువ రోజుల క్రికెటర్లకు సాధన నిర్వహించాలనే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు బిసిసిఐ కసరత్తులు ప్రారంభించింది. దీనికి సంబంధించి త్వరలోనే టీమిండియా కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి తదితరులతో త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనే యోచనలో బిసిసిఐ ఉన్నట్టు సమాచారం. మరోవైపు క్రికెటర్లు కూడా సాధన ఎప్పుడూ ప్రారంభమవుతుందా, ఎప్పుడూ బ్యాట్‌ను ఝులిపించాలా అనే అతృతతో కనిపిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News