Saturday, April 20, 2024

సంపాదకీయం: నేరమయ రాజకీయం

- Advertisement -
- Advertisement -

India lifted 271 million people out of poverty దేశ రాజకీయాలపై నేరస్థులు గట్టి పట్టు సంపాదించుకున్నారన్న చేదు సత్యా న్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో ధన ప్రాబల్యం పెరుగుతూ పోతుండడంతో పోటీలోని నాయకులకు నేరస్థుల అవసరం కూడా అధికమవుతూ వచ్చింది. అది అంతిమంగా నేరస్థులే పోటీకి దిగి పార్లమెంటులోనూ, రాష్ట్రాల చట్టసభల్లోనూ ప్రవేశించడానికి దారులు వేసింది. అది ఇప్పుడు అనివార్య ధోరణిగా స్థిరపడిపోయింది. దీనిని అరికట్టడానికి జరిగిన ప్రయత్నాలేవీ గట్టి ఫలితాన్నివ్వ లేదు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుల్లో పావు వాటా మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసుకున్న అఫిడవిట్‌లలో వెల్లడించారు. అంటే ప్రస్తుతం రాజ్యసభలో గల 229 మంది సభ్యులలో 54 మంది లేదా 24 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి.

77 మంది బిజెపి రాజ్యసభ సభ్యులలో 14 మందిపైన, 40 మంది కాంగ్రెస్ వారిలో 8 మంది మీద కేసులున్నట్టు ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) తాజా నివేదిక వివరించింది. క్రిమినల్ కేసులున్న ఈ 54 మందిలో 12 మంది మీద హత్యాయత్నం, స్త్రీలపై అత్యాచారాలు వంటి తీవ్రమైన ఆరోపణలున్నట్టు స్పష్టం చేసింది. 90 శాతం మంది సభ్యులు కోటీశ్వరులని తేలింది. దేశంలో అక్రమ, అనాయాస ఆర్జనకు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ రాజకీయాల్లో నేరస్థుల ప్రవేశ ద్వారం విశాలమవుతున్నది. చట్టబద్ధ జీవనం, వ్యాపారం అనేది కనుమరుగు కావడం అధికమవుతున్న కొద్దీ ఇందుకు అవకాశాలు ఎక్కువవుతున్నాయి. చట్టసభల్లో క్రిమినల్ కేసులున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండడమే ఇందుకు తార్కాణం. ఆధ్యాత్మిక, నైతిక రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పుకునే కేంద్రంలోని పాలక పక్షం భారతీయ జనతా పార్టీలోనే నేరాభియోగాలున్న పార్లమెంటు సభ్యులు అత్యధికంగా ఉండడం, ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ రావడం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఎలు సగం మందిపై క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి.

రాజ్యసభకు ఈ ఏడాదిలో ఎన్నికైన 62 మంది సభ్యులలో 44 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 11 మంది మీద తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. రాజకీయాల నుంచి, ముఖ్యంగా చట్ట సభల నుంచి నేర చరిత్ర గల వారిని దూరంగా ఉంచడానికి దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చాలా సార్లు ప్రయత్నించింది. క్రిమినల్ కేసులున్న వ్యక్తులను ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబెడుతుంటే అందుకు దారి తీసిన కారణాలను వారు నామినేషన్ వేసిన 48 గంటల్లో తమ వెబ్ సైట్‌లలో ఉంచాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పులో ఆదేశించింది. అభ్యర్థికి గల గెలుపు అవకాశాలతో పాటు ఆ వ్యక్తి మంచితనం కూడా ముఖ్యమని అందులో అభిప్రాయపడింది. రాజకీయాలు నేరస్థమయం కావడం పెరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం రెండేళ్లు శిక్షపడిన ఎంపి, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు తక్షణమే ఆ పదవి కోల్పోతారంటూ 2013 జులైలో సుప్రీంకోర్టు లిలీ థామస్ కేసులో ఇచ్చిన తీర్పు కీలకమైనది. ఈ తీర్పును ప్రభావ రహితం చేయడానికి యుపిఎ 2 ప్రభుత్వం ఆ ఏడాది ఆగస్టులో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ ఒక పత్రికా గోష్టిలో మాట్లాడుతూ ఈ సవరణ బిల్లును తీవ్రంగా తప్పు పట్టారు. దానిని చించి బుట్టలో వేయాలని వ్యాఖ్యానించారు. దానితో ఆ బిల్లును, దానికి సంబంధించి జారీ అయిన ఆర్డినెన్స్‌ను యుపిఎ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. కేసులు నడుస్తున్న చట్ట సభ సభ్యులను ఏ దశలో అనర్హులను చేయాలనే మీమాంసపై సుప్రీంకోర్టు కూడా ముందు వెనుకలాడిన సందర్భముంది. కింది కోర్టులో శిక్షపడగానే అనర్హత వేటు వేయడం కంటే న్యాయ సమీక్ష అవకాశాలన్నింటినీ కడ వరకు ఉపయోగించుకునే వీలు కల్పించి అంతిమ తీర్పులో శిక్ష విరుచుకుపడినప్పుడే దానిని వర్తింపచేయాలన్న నిర్ణయానికి వచ్చింది.

దాఖలైన కేసుల ప్రాతిపదికగానే చట్ట సభల సభ్యత్వాల నుంచి తొలగిస్తే దానిని ఉపయోగించుకొని తప్పుడు కేసులు వేసే ప్రమాదం ఉంటుంది. అలాగే కింది కోర్టులో శిక్ష పడిన వెంటనే అనర్హులను చేస్తే మన న్యాయ వ్యవస్థలో గల అప్పీలు దారిని మూసివేసినట్టవుతుంది. సుప్రీంకోర్టు అన్ని సాంకేతిక, న్యాయ కోణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇటువంటి విషయాలలో అంతిమ నిర్ణయానికి రావడాన్ని ఆక్షేపించలేము. అంతిమంగా ఓటు హక్కు గల ప్రజల అవగాహనా రాహిత్యం, అజ్ఞానం, కటిక పేదరికం అనేవే రాజకీయాలపై నేర చరిత్రుల పట్టును పెంచుతున్నాయి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రజల దారిద్య్రాన్ని, అజ్ఞానాన్ని సమూలంగా తొలగించేందుకు కృషి జరపనంతవరకు మన రాజకీయాలకు నేరస్థుల ఉక్కు కౌగిలి నుంచి విముక్తి లభించదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News