Home తాజా వార్తలు ఆర్థిక వృద్ధి రేటు 5.1 శాతం

ఆర్థిక వృద్ధి రేటు 5.1 శాతం

GDP

 

 

ఇంతకు ముందు 6.3 శాతంగా అంచనా
భారీగా అంచనా తగ్గించిన రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్

న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్ధి రేటును అంచనాను రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ భారీగా తగ్గించింది. ఊహించిన దాని కంటే మందగమనం ఎక్కువగా ఉండడం, దీర్ఘకాలంగా కొనసాగనుందనే అంచనాలతో భారత్‌కు ఇది హెచ్చరిక అనే చెప్పాలి. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920)లో దేశీయ వృద్ధి రేటును 5.1 శాతానికి తగ్గించింది. అంతకుముందు 6.3 శాతం వృద్ధి రేటును సంస్థ అంచనా వేసింది. ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం మంగళవారం ప్రారంభం కానుండడం, అలాగే డిసెంబర్ 5న పాలసీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో క్రిసిల్ ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా అంచనా 4.7 శాతం తర్వాత క్రిసిల్ అంచనా అతి తక్కువ కావడం గమనార్హం. వృద్ధి రేటు డేటా వచ్చిన కొద్ది రోజులకే రేటింగ్ ఏజెన్సీ ఈ అంచనా వేసింది.

గత వారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతం. మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్) ఇది 4.75 శాతంగా ఉంది. ఇది అనేక సంవత్సరాల కనిష్ట స్థాయి. పారిశ్రామిక ఉత్పత్తి, వస్తువుల ఎగుమతులు, బ్యాంక్ రుణ సామర్థం, పన్ను వసూలు, సరుకు రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలకమైన స్వల్పకాలిక సూచికలు వృద్ధి రేటులో మితంగా ఉన్నాయని క్రిసిల్ తన నివేదికలో తెలిపారు. అయితే రెండో భాగంలో వృద్ధి రేటు 5.5 శాతానికి కొద్దిగా మెరుగ్గా ఉండవచ్చు. అంతకుముందు అక్టోబర్‌లో ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బిఐ వృద్ధి రేటు అంచనాను తగ్గిస్తూ సవరించింది. సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 5న మరోసారి రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది.

సమీప భవిష్యత్తులోనూ క్షీణత
మందగమనం తీవ్రతరం కావడంతో సమీప భవిష్యత్తులో భారతదేశ వృద్ధి రేటు దిగువన ఉండవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ మందగమనం ఊహించిన దానికంటే ఎక్కువకాలం ఉంటుంది. నివేదిక ప్రకారం, పెట్టుబడులు నిలకడగా ఉండనున్నాయి. ఇది క్రమంగా పారిశ్రామిక ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీంతోపాటు ఇటీవల వరదలు, తక్కువ వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను ప్రభావితం చేశాయి. వాహనాల నుండి రియల్ ఎస్టేట్ వరకు ఒత్తిడిలో ఉందని, ఇది కంపెనీల లాభాలు, ప్రభుత్వ ఆదాయ వసూళ్లపైనా ప్రభావం చూపింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్‌లో ప్రధాన ఆర్థికవేత్త అరుణ్ సింగ్ మాట్లాడుతూ, మాంద్యం తీవ్రమైంది. దేశంలో పెరుగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, నెమ్మదించిన వృద్ధి రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విధాన రూపకర్తలకు సవాలుగా మారాయి.

Crisil sharply cuts FY20 growth forecast to a low 5.1%