Home స్కోర్ విమర్శల సుడిలో కోహ్లి సేన..

విమర్శల సుడిలో కోహ్లి సేన..

Team-India

క్రీడా విభాగం: స్వదేశంలో సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలిచి అదరగొట్టిన టీమిండియా బౌన్స్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై తేలిపోయింది. సఫారీలతో జరిగిన మొదటి టెస్టులో 208 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం అందుకోవడంలో కోహ్లి సేన ఘోరంగా విఫలమైంది. సౌతాఫ్రికా ప్రధాన బౌలర్ స్టెయిన్ బౌలింగ్‌కు దిగకున్న భారత్ స్వల్ప స్కోరుకే కుప్పకూలి అభిమానులను నిరాశ పరిచింది. కోహ్లి, పుజారా, ధావన్, విజయ్, రోహిత్, సాహి, పాండ్య వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లతో కూడిన టీమిండియా 135 పరుగులకే చాప చుట్టేయడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కిందటి ఏడాది టెస్టుల్లో ప్రకంపలు సృష్టించిన భారత్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై చేతులెత్తేసింది. బౌలర్లు అసాధారణ ప్రతిభతో సౌతాఫ్రికాను 130 పరుగులకే కుప్పకూల్చి టీమిండియా గెలుపు అవకాశాలను చిగురింప చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ అవమానకర రీతిలో ఓటమి పాలు కాక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి తీసుకున్న నిర్ణయాలు బెడిసి కొట్టాయని చెప్పాలి. ఫాస్ట్ పిచ్‌లపై మంచి రికార్డు కలిగిన అజింక్య రహానె, కెఎల్.రాహుల్‌లను పక్కనబెట్టి కోహ్లి పెద్ద తప్పిదమే చేశాడు. రహానె, రాహుల్‌లు బరిలోకి దిగి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో రకంగా ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోహిత్, ధావన్‌లతో పోల్చితే టెస్టుల్లో రహానె, రాహుల్‌లు మంచి బ్యాట్స్‌మెన్ అనడంలో సందేహం లేదు. దీనికి గతంలో వారు ఆడిన ఇన్నింగ్స్‌లే నిదర్శనం. ఇటీవల కాలంలో కోహ్లి రహానె, రాహుల్‌ను కావాలనే పక్కన బెడుతున్న విషయం స్పష్టమవుతోంది. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సైతం ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌ను జట్టుకు దూరంగా ఉంచడం పెద్ద తప్పిదమేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక, తొలి టెస్టులో రహానెను పక్కన బెట్టడంపై మాజీ కెప్టెన్ సౌవర్ గంగూలీ తీవ్ర విమర్శలు గుప్పించాడు. రహానెను నిర్లక్షం చేయడాన్ని తాను ఎన్నో సార్లు ప్రశ్నించానని, అయితే కెప్టెన్ కోహ్లి మాత్రం తమ సలహాలు, సూచనలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బౌన్సీ పిచ్‌లపై తాము ఆడలేమనే విషయాన్ని భారత ఆటగాళ్లు మరోసారి నిరూపించారని ఆరోపించాడు. ఇలాంటి జట్టుతో సిరీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవడం వృథా ప్రయాసేనని పేర్కొన్నాడు.
ఒత్తిడి ఖాయం..
తొలి టెస్టులో ఘోర పరాజయం నేపథ్యంలో మిగిలిన రెండు మ్యాచుల్లో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలుపుతో సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇక, గెలిచే మ్యాచ్‌లో నిర్లక్షంగా ఆడి ఓటమి కొని తెచ్చుకున్న భారత్‌పై ఒత్తిడి పెరిగి పోయింది. ఈ మ్యాచ్ కోహ్లి కెప్టెన్సీకి పరీక్షగా మారింది. ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఒకవైపు ఇకపై జరిగే సిరీస్‌లలో గెలుపు మరో ఎత్తుగా చెప్పుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనున్న దక్షిణాఫ్రికాను భారత్ ఎలా ఎదుర్కొంటుందో సగటు అభిమానికి అంతుబట్టకుండా మారింది. స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక చేతులెత్తేసిన టీమిండియా మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడం కష్టమేనని చెప్పాలి. అందివచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్న కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించుకుంది. స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడుకుని భారత్‌ను చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా ఇక క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలిచి భారత్‌నే వైట్‌వాష్ చేయాలనే వ్యూహంతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమని చెప్పలేం. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో విఫలమైన స్టార్ ఆటగాళ్లు ఆమ్లా, డివిలియర్స్ మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెట్టారు. ఇదే జరిగితే కోహ్లి సేన కష్టాలు మరింత పెరగడం ఖాయం.