Home ఎడిటోరియల్ రసాయనాలతో వినాశనం

రసాయనాలతో వినాశనం

Fertilizer prices are rising TS Government

దేశంలో ఏటా వివిధ రకాల తెగుళ్లు, పీడలు సోకి దాదాపు 45 వేల కోట్ల రూపాయల విలువైన పంటలను రైతులు నష్టపోతున్నారు. పంట తెగుళ్లను అరికట్టి ఎక్కువ దిగుబడులు సాధించాలన్న ఆరాటంతో రైతులు క్రిమిసంహారక మందులను విరివిగా వాడుతున్నారు. తెగుళ్లను అవి తాత్కాలికంగా అరికట్ట గలిగినా తరువాత వచ్చే తీవ్ర పరిణామాలను రైతులు గుర్తించడం లేదు. ఈ విష రసాయనాల ప్రభావం వల్లనే ఏటా 2 లక్షల మంది బలయిపోతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయ కీటక నాశినుల వాడకంలో 45 శాతం వాటా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర , పంజాబ్‌లదే కావడం గమనార్హం. మోతాదును మించి క్రిమి సంహారక మందులను వాడితే నేరంగా చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక పంటకు అయిదారుసార్లు మందులు పిచికారీ చేయాలని విక్రయదారులతోపాటు వ్యవసాయ అధికార యంత్రాంగం కూడా ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుపమ వర్మ కమిటీ సిఫార్సుల ప్రకారం 18 రకాల క్రిమికీటక నాశినులను ప్రభుత్వం నిషేధించింది. మరో48 మందులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రాంతాల వారీగా పంటల ప్రణాళికలు, నాణ్యమయిన విత్తనాల వాడకం, ఎరువులు, పురుగు మందుల సరఫరా, బీమా, పరపతి సౌకర్యం, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సౌకర్యాలు ఇవన్నీ సవ్యంగా సమకూర్చగలగడం ప్రభుత్వ బాధ్యత. భూసార పరీక్షల బట్టి పంటల ఎంపిక, నీటి యాజమాన్యం, ఎరువులు, పురుగు మందుల వాడకంలో మార్పులు, చేర్పులు పాటించి చైనా వ్యవసాయంలో అత్యధిక దిగుబడులను సాధించగలుగుతోంది.

రసాయన ఎరువులతో ముప్పు
రసాయన ఎరువుల్లో పాదరసం, సీసం, సిల్వర్, నికెల్, సెలీనియం, ధాలియం, కాడ్మియం, యురేనియంవంటి శారీ ఖనిజ ధాతువులు ఉంటాయని అవే ముప్పు తెచ్చిపెడుతున్నాయని కేంద్ర ఆరోగ్య పరిశోధనా విభాగం ఆందోళన వెలిబుచ్చింది. రసాయనాల తీవ్రత వల్లనే మూత్రపిండాలు ఊపిరి తిత్తులు, కాలేయం దెబ్బతిని కేన్సర్ వంటి వ్యాధులు దాపురిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల వల్లనే భూసారం దెబ్బతింటోంది. రసాయన ఎరువుల వాడకం రానురాను పెరిగి సేంద్రీయ ఎరువుల వాడకం తరుగుతుండడంతో వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధి రేటు 196070 లో 8.37 శాతం నుంచి 20002010 నాటికి 2.61 శాతానికి తగ్గినట్లు పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక వెల్లడించింది.

సేంద్రీయ వ్యవసాయ విధానం

2025 నాటికి 30 కోట్ల టన్నుల మేరకు మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంది. కాబట్టి భూసార పరీక్షల ఆధారంగా ఏమాత్రం రసాయన ఎరువులను సేద్యంలో వినియోగించాలో రైతులకు అవగాహన కల్పించడానికి కేంద్రం యోచిస్తోంది. ఈ పరిస్థితిని తప్పించడానికి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడం తప్పనిసరి. రసాయనిక విధానం నుంచి సేంద్రియ విధానంలోకి మారాలనుకునే రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం అవసరమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. క్రిమిసంహారక రసాయనాల వాడకాన్ని నియంత్రించడానికి పెస్టిసైడ్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అధారిటీ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, పరిశోదనా సంస్థల ప్రతినిధులతో చర్చించి ఇన్‌సెక్టిసైడ్స్ యాక్టు 1968 కి ప్రస్తుత అవసరాల మేరకు సవరణలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. రసాయన ఎరువులపై సబ్సిడీ విధానాన్ని కూడా సమూలంగా మార్చడం అవసరం.

అన్నిటిలోనూ రసాయన అవశేషాలే!

రసాయనాల వినియోగం మన జీవన విధానంతో భాగం అయింది. వ్యవసాయంలో పంటలకు తెగుళ్లు సోకితే క్రిమిసంహారక మందులు వాడవలసి వస్తోంది. పండ్లు, కూరగాయలు, పాలు, నీళ్లు అన్నిటిలోనూ రసాయన అవశేషాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం దాదాపు 70 వేల రకాల రసాయనాలు ఉపయోగంలో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో రసాయన పరిశ్రమల వాటా 13 శాతం ఉంది. ఏటా 10 నుంచి 13 శాతం వరకు వృద్ధి కనిపిస్తోంది. కానీ ప్రజారోగ్యంపై విపరీత ప్రభావం చూపించే ఈ రసాయనాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను తట్టుకునేలా, నష్ట నివారణ చర్యలను చేపట్టగలిగే వ్యవస్థలు అవసరం. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రమాదకర వ్యర్థాలు, రసాయనాలు, పదార్థాల మీద ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగినప్పుడు ఈ రసాయనాలు, ప్రమాదకర వ్యర్థ పదార్ధాలను సమర్థంగా నిర్వహించే సామర్థం కలిగి ఉన్నామని భారతదేశ ప్రతినిధి బృందం గొప్పగా ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే ఎంతవరకు అమలు అవుతుందో తేలిపోతుంది.

విష రసాయనాలకు రైతుల బలి

గత ఏడాది మహారాష్ట్రలో క్రిమిసంహారక మందులు వికటించి గత అక్టోబర్ నెల రోజుల్లో మొత్తం 472 మంది తీవ్ర అస్వస్థులయ్యారు. వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర సంచలనం కలిగించింది. అంతకు ముందు 19 మంది రైతులు చనిపోయారు. క్రిమిసంహారక మందులను సరిగ్గా వినియోగించకపోవడమే ఈ దుస్థితికి కారణం. బిటి పత్తి రకం, విషపూరిత క్రిమిసంహారక మందుల వల్లనే రైతులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

రసాయన ఎరువుల వాడకం తగ్గాలి

1960 దశాబ్ది నుంచి దేశంలో హరిత విప్లవం అమలవుతోంది. 196061లో 8.3 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తి కాగా, 201415 నాటికి 25.27 కోట్ల టన్నుల ఉత్పత్తి అయింది. 1960 ప్రాంతంలో 10 లక్షల టన్నుల కన్నా తక్కువగా రసాయన ఎరువుల వాడకం ఉండేది. 201415 నాటికి 2.56 కోట్ల టన్నులకు పెరిగింది. అలాగే హెక్టారుకు బంగాళా దుంపల సాగులో 347 కిలోలు, చెరకు సాగులో 239 కిలోలు, పత్తి సాగులో 193 కిలోలు, గోధుమ సాగులో 177 కిలోలు, వరి సాగులో 165 కిలోలు వంతున రసాయన ఎరువుల వాడకం పరిపాటి అయింది. ఈ వినియోగం స్థాయి బాగా తగ్గడం అవసరం. సేంద్రీ య ఎరువుల వినియోగం ఎక్కువ కావాలి. అప్పుడే సేద్య సౌభాగ్యం చేకూరుతుంది. ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తుల సాధనకు తగిన కృషి జరిగితేనే దేశంలో అన్నదాతకు సాఫల్యం, జాతికి ఆహార భద్రత సమకూరుతుంది.

* పి.వెంకటేశం