Home తాజా వార్తలు బడ్జెట్ తరువాతే రుణమాఫీ!

బడ్జెట్ తరువాతే రుణమాఫీ!

Crop loans

 

నిధుల కేటాయింపు.. అర్హుల లెక్కపై కొనసాగుతున్న కసరత్తు
బడ్జెట్ సమావేశాల్లో స్పష్టతనివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
2018 డిసెంబర్ 11 కటాఫ్ తేదీ

హైదరాబాద్ : లక్ష రూపాయాల లోపు ఉన్న పంట రుణాలను పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల తరువాత మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లో నిధులు ఏ మేరకు కేటాయింపులు చేయాలి.. ఎప్పటి నుంచిమాఫీ తేదీని పరిగణనలోకి తీసుకుంటే ఎంత మొత్తంలో, ఎంతమంది రైతులకు మాఫీ వర్తిస్తుందనే దానిపై వ్యవసాయ శాఖతో పాటు ఆర్థిక శాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కసరత్తు చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రుణమాఫీ అమలుపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

మాఫీ ఆశతో ఇప్పటికే పంట రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదని గమనించిన ప్రభుత్వం వీలైనంత త్వరగా మొదటి విడత సొమ్ము కింద కొంత మొత్తంలో బడ్జెట్ ఆమోదం తరువాత విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. వచ్చే నెలలోనే మాఫీకి సంబంధించిన విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. డిసెంబర్ 11 వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ఇప్పటికే సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచి, ఎలా అనే దానిపై మాత్రం మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

వీటన్నింటిపై బడ్జెట్‌లోనే స్పష్టత రానుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సంప్రదించి ఏ ఏడాదిలో ఎక్కువ పంట రుణాలు తీసుకున్నారు.. ఏయే సీజన్‌లలో రూ. లక్ష లోపు ఉన్న రుణాల మొత్తం, రైతుల సంఖ్యను ప్రాథమికంగా తెప్పించుకుంది. వీటికి అనుగుణంగా అమలు మార్గదర్శకాలు, విధి విధానాలను తయారు చేస్తున్నారు. కటాఫ్ తేదీ ప్రకటించినప్పటికీ, ఎప్పడి నుంచి (ఏ సీజన్) రుణాల నుంచి పరిగణనలోకి తీసుకుంటారనే దానిపైనే తర్జన భర్జన కొనసాగుతోంది. మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను క్రోడీకరించనున్నారు.

కుటుంబంలో ఎంతమంది పేరు మీద అప్పు ఉన్నప్పటికీ రూ. 1 లక్ష వరకు మాఫీ అవుతుంది. బ్యాంకులు డేటా షేరింగ్ ద్వారా డూప్లికేట్స్ లేకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక్క రైతుకే వర్తింపజేయడం, బంగారం తాకట్టు పెట్టి తీసుకుంటే మాఫీ ఇవ్వాలా వద్దా అనే విషయాలపై లోతుగా చర్చిస్తున్నారు. మరోవైపు రుణాలకు సంబంధించి బ్యాంకుల లెక్కలకు ,వ్యవసాయ శాఖ లెక్కలకు పొంతన లేకుండా పోతుంది.

రూ. లక్ష లోపు రుణాలు రూ.31,824 కోట్లు ?
2017 సెప్టెంబర్ నాటికి గత రుణమాఫీ పూర్తిగా చెల్లించిన నెలగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి 2018 డిసెంబర్ 11 వరకు లెక్కలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ ప్రకారమే తాము రుణమాఫీకి అర్హులను, సొమ్మును అంచనా వేశామని అంటున్నారు.

ప్రాథమిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. ఇందులో రూ. ఒక లక్ష లోపు రుణాలు రూ.31,824 కోట్లు ఉన్నట్లు ఎస్‌ఎల్‌బిసి వర్గాలు వెల్లడించాయి. 2014లో రుణమాఫీ పథకం అమ లు చేసినప్పుడు రూ. 17 వేల కోట్ల బకాయిలు ఉండగా అప్పుడు నాలుగు విడతలుగా మాఫీ చేశారు. ఇప్పుడు పాత పద్ధతిలోనే నాలుగు విడతలుగా రుణమాఫీ చేయనున్నారు.

Crop loans of less than Rs 1 lakh waived