Home నిజామాబాద్ అన్నదాతకు భరోసా

అన్నదాతకు భరోసా

Crop Loans Support To Farmers In Telangana

మనతెలంగాణ/నిజామాబాద్ రూరల్: అన్నదాతకు భరోసా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్తకొత్త పథకాలతో ఆర్థికంగా వారి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో అమలు చేస్తుంది. ఇప్పటికే  రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందజేస్తుంది. దీంతో పాటు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 4 వేలు పంట పెట్టుబడి సాయం అందించింది. దీంతో జిల్లాలోని 2 లక్షల 39 వేల 712 మంది రైతులకు పెట్టుబడి సాయం అంద గా జూలై 2న రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది. దీంతో అప్పటి నుండి రైతు బీమా నమోదు ప్రక్రియ జిల్లాలో చురుగ్గా సాగుతోంది. గత కొని రోజులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. షెడ్యూల్ వారీగా గ్రామాలకు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పట్టదారు పాసుపుస్తకాల ఆధారంగా రైతుల పూర్తి వివరాలతో పాటు నామిని వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎడిఏలు, ఎఓ, ఎఈఓలు నమోదు ప్రక్రియలో బిజి అయ్యారు. జిల్లాలో 27 మండల పరిధిలో 440 గ్రామాల్లో ఒకలక్ష 76వేల778మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉండగా లక్ష 16వేల745మంది రైతులకు సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయింది. 18వేల 566 మంది రైతులకు వయస్సు అర్హత లేకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల బీమా వర్తించలేకుండా పోయింది. రేపటితో మాత్రమే గడువు ఉండడంతో బీమా నమోదు ప్రక్రియ అధికారయంత్రాంగం మరింత వేగవంతం చేసింది.
జిల్లాలో రైతుబందు నమోదు ప్రక్రియ
నిజామాబాద్ అర్బన్‌లో పట్టాదారులు 589 ఉండగా 427మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ పట్టాదారులు 44009 ఉండగా 24124 మంది, ఆర్మూర్ పట్టాదారులు 30632 మంది 18740, బాల్కొండ 38282మంది ఉండగా 23993 దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బోధన్‌లో పట్టాదారులు 35994 ఉండగా 18004 మంది, బా న్సువాడ పట్టాదారులు 27269 ఉండగా 12891 మంది ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ చేసుకున్నారు.
బీమా పరిహారం ఇలా
రైతు సహజ మరణం పొందినా…. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినా, ప్రమాదవశాత్తు మృతిచెందినా రూ. 5లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చేలా పథకాన్ని రూపొందించారు. రైతుకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే బీమా ప్రక్రియ చెల్లిస్తుంది. మరణించిన 10 రోజుల్లోనే రైతు కుటుంబానికి బీమా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసిద్వారా బీమాకు సంబందించిన బాండ్లను అందజేయనుంది. ప్రతియేటా ఆగస్టు 15న రైతు పేరిట ఎల్‌ఐసి ప్రభుత్వాన్ని బీమా డబ్బులను చెల్లిస్తుంది.