Home తాజా వార్తలు రైలు నుంచి జారిపడి సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతి

రైలు నుంచి జారిపడి సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతి

CRPF Jawan

 

మిర్యాలగూడ : రైలు నుంచి జారిపడి సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతి చెందిన సంఘటన జమ్ముకాశ్మీర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని నందిపాడ్‌కు చెందిన కొప్పోజు దేవేంద్రాచారి (36) జార్ఖండ్ రాష్ట్రంలోని తీహార్‌జిల్లా చందువాలో సీఆర్‌పిఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా రైలులో జమ్ముకాశ్మీర్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున టాయిలెట్‌కు అని వెళ్ళి ప్రమాదవశాత్తు రైలు నుండి జారి క్రిందపడడంతో మృతి చెందినట్లు దేవేంద్రాచారితో పాటు వెళ్తున్న ఇతర జవాన్లు కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు.

13సంవత్సరాల క్రితం దేవేంద్రాచారి సిఆర్‌పిఎఫ్‌లో చేరాడు. అయితే గత 25రోజుల క్రితం అనారోగ్యంతో మిర్యాలగూడకు వచ్చిన దేవేంద్రాచారి జమ్ముకాశ్మీర్ నుండి పిలుపు రావడంతో కొన్ని రోజుల క్రితం విధులకు తిరిగి వెళ్ళాడు. విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న దేవేంద్రచారికి ఇలా ప్రమాదం జరగడంతో తల్లిదండ్రులు వెంకటాచారి, సైదమ్మతో పాటు భార్య నిర్మలాదేవి శోకసంద్రంలో మునిగారు. 9సంవత్సరాల క్రితం వివాహం అయిన చారికి ఒకపాప హర్షిత, బాబు శివలు సంతానం. చిన్న వయస్సులోనే తండ్రి మృతి చెందడంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిందని పలువురు విలపించారు.

అంతకు ముందు రాత్రి దేవేంద్రచారి తన భార్య నిర్మలకు ఫోన్ చేసి తాను విధి నిర్వహణలో భాగంగా జమ్ముకాశ్మీర్‌కు వెలుతున్నాను అని పిల్లలు ఎలా ఉన్నారు అని ఏమి చేస్తున్నారని కుశల ప్రశ్నలు అడిగారని నిర్మల విలపిస్తూ చెప్పడం పలువురిని కంటతడి పెట్టించింది. దేవేంద్రాచారి మృతదేహాన్ని సంఘటన స్ధలం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించగా అక్కడ నుండి పోలీసుల బందోబస్తుతో సాయంత్రం మిర్యాలగూడలోని నందిపాడుకు తీసుకువచ్చారు. మృతి చెందిన వీరజవాన్ చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. దేవేంద్రచారి అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.

CRPF Jawan dies in Train Accident