Home జాతీయ వార్తలు సోనియా కుటుంబ భద్రతపై రాష్ట్రాలకు సిఆర్‌పిఎఫ్ లేఖలు

సోనియా కుటుంబ భద్రతపై రాష్ట్రాలకు సిఆర్‌పిఎఫ్ లేఖలు

CRPF

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన కొత్త ప్రోటోకాల్ గురించి సిఆర్‌పిఎఫ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత న్రాంతాలకు లేఖలు రాసినట్లు సిఆర్‌పిఎఫ్ అధికారులు మంగళవారం తెలిపారు. అంతేకాదు, వారికి భద్రత కల్పించడం కోసం కొత్తగా కనీసం మరో బెటాలిన్‌ను(వెయ్యిమంది జవాన్లను) ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆ అధికారులు తెలిపారు. సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్‌లకు ఇప్పటివరకు ఉన్న ఎస్‌పిజి భద్రతను తొలగించి దాని స్థానంలో సిఆర్‌పిఎఫ్ బలగాలతో జడ్‌ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం ఈ నెల ప్రారంభంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ హై ప్రొఫైల్ వక్తులకు భద్రత కల్పించాల్సి ఉన్న దృష్టా కొత్తగా బులెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకోవాలని కూడా సిఆర్‌పిఎఫ్ భావిస్తున్నట్లు ఆ అధికారులు చెప్పా రు. కాగా గాంధీ కుటుంబానికి ఎస్‌పిజి భద్రతను తొలగించి సిఆర్‌పిఎఫ్ జవాన్లతో జడ్‌ప్లస్ సెక్యూరిటీ కల్పించాలన్న కేంద్రం నిర్ణయంతో అమలులోకి వచ్చిన కొత్త ప్రొటోకాల్ గురించి సిఆర్‌పిఎఫ్ కేంద్ర హోం శాఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసినట్లు వారు తెలిపారు. వీరందరికీ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజాన్‌ను కల్పించడం జరుగుతుందని, వీరు అధికారిక లేదా వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినప్పుడు వారికోసం ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంటెలిజన్స్, పోలీ సు, పాలనా యంత్రాంగాల సహకారం అవసరమవుతుందని కూడా ఆ లేఖలో తెలియజేశారు.

వీరు పర్యటించే ప్రాంతాలకు 24గంటలు ముందుగానే సిఆర్‌పిఎఫ్ దళాలు చేరుకుని స్థానిక పోలీసు, ఇతర అధికారుల సహకారంతో ఆయా ప్రాంతా ల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేస్తాయని ఆ లేఖలో తెలియజేశారు, ఇంతకు ముందు ఎస్‌పిజి ఏం చేసేదో ఆ పనులను ఇప్పుడు సిఆర్‌పిఎఫ్ చేస్తుందని ఆ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఎస్‌పిజి ఉపయోగించిన బులెట్ ప్రూఫ్ వాహనాలను వాడేందుకు అనుమతించినప్పటికీ హోం మంత్రి అమిత్ షాతో సహా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్న పలువురు వివిఐపిలకు భద్రత కల్పించే బాధ్యత ఉన్న కారణంగా కొత్తగా అత్యధునాతన బులెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకోవాలని సిఆర్‌పిఎఫ్ భావిస్తోందని, అందుకు హోం శాఖ అనుమతిని త్వరలోనే కోరుతుందని కూడా వారు చెప్పారు.

కాగా ప్రస్తుతం 3 లక్షల మంది జవాన్లు సిఆర్‌పిఎఫ్‌లో ఉండగా 57 మంది ప్రముఖులకు అది భద్రత కల్పిస్తోంది. కాగా, ఇప్పుడు అదనంగా మరికొంత మంది బాధ్యత కూడా చేరిన దృష్టా కనీసం మరో రెండు బెటాలియన్లు(వెయ్యినుంచి 2 వేల మందిని) చేర్చుకోవాలని కూడా అది భావిస్తోందని ఆ అధికారులు చెప్పారు. ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్ విఐపిల భద్రత కోసం దాదాపు 4 వేల మంది జవాన్లను నియమించింది.

CRPF writes letter to States on Sonia’s family security