Friday, March 29, 2024

ఆంధ్రప్రదేశ్‌లో క్రూర రాజకీయ క్రీడ

- Advertisement -
- Advertisement -

Cruel political game in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో ప్రతి పక్షాలు మాత్రం ఓ దుర్మార్గపు క్రీడలో ఆనందిస్తున్నారు. జనాలు ఛీ అంటున్నా వాళ్ళ ఆనందంలోవాళ్ళు మునిగిపోతున్నారు. రఘురామ కృష్ణమ రాజు కథా సంగ్రహం అనబడే రసవత్తర సినిమా వారం రోజులు జనానికి వినోదాన్ని పంచి చివరకి ఈ నెల 21వ తారీఖున సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఈయడంలో శుభంకార్డు పడింది. తీర్పు ఎలా వున్నా ఈ క్రూర క్రీడలోని కథనం అందరూ తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం పార్లమెంటు నియోజక వర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరుఫున 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణమ రాజు ఎన్నికకాబడ్డారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ పవనాలు వీచి 25 పార్లమెంటు స్థానాలకు గాను 23 స్థానాలు జగన్ పార్టీ గెలిచి, లోక్‌సభలో అతి పెద్ద పార్టీకి రెండవ స్థానంలో నిలిచింది. ఈ నెల 29న ఆపార్టీ అధికారానికొచ్చి రెండేళ్ళు పూర్తి కావస్తున్నది.

సాఫీగా పాలన సాగిపోతున్న కాలంలో రఘురామ కృష్ణమరాజు ఆ పార్టీకే ఒక మేకై అధిష్టానికి పెద్ద తలబొప్పి కట్టించాడు. భారత రాజకీయలు ఇప్పటికే చాలా భ్రష్టుపట్టిపోయాయి. నైతికత, ధర్మం అన్నవి ఏ కోశానా కనపడవు. ఆయారం.. గయారాంలకు కొదవ లేదు. అన్ని జాతీయ పార్టీల్లో స్వార్థచింతన పెరిగిపోయి ‘పార్టీ ఫిరాయింపుల చట్టా న్ని’ నీరుగార్చేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా దొందూ దొందే. పాప ఫలాలు ఇద్దరూ ఆరగిస్తున్నారు. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం వున్న వాడైనా ఒక గుర్తుపై నెగ్గి మరో పార్టీలోకి చేరడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ పార్టీ నుంచి నెగ్గినా పాలక పార్టీలోకి జంప్ కావడం మామూలు అయిపోయింది. కొంతమంది మాత్రం నిజాయితీగా పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరి, ఆ పార్టీ గుర్తుపై నెగ్గుతున్నారు. ఇదొక రకంగా అభినందించ తగినదే. కాకుంటే 2014లో రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారానికొచ్చింది. 40 సం॥లకు పైగా రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు నాయుడు తిరిగి గద్దెనెక్కాక దుష్ట సంప్రదాయానికి తెర తీశాడు.

రాజకీయాల్లో కొత్త క్రీడకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ పోరాట వీరుడు, కెసిఆర్‌ని తెలంగాణ సారథిగా గద్దెనెక్కించారు. అప్పట్లో నామ మాత్ర సంఖ్యలో నెగ్గిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి కెసిఆర్‌ని దెబ్బ తీయాలని తలచి చివరికి భంగపడి వాయు వేగంతో రాత్రికి రాత్రే విజయవాడకు పరుగు తీసింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేని డబ్బులతో కొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గాలనుకొన్న చంద్రబాబు కుట్ర అడ్డంగా దొరికిపోయింది. అదే వోటుకు నోటు పేరున భారత చరిత్రలోనే చీకటి అధ్యాయంగా చోటు చేసుకొంది. అలాంటి దుష్ట తలంపు కలిగిన చంద్రబాబు అదే జూదాన్ని అక్కడా ఆరంభించాడు. వైసిపి పార్టీ నుండి నెగ్గిన 23 మంది శాసన సభ్యుల్ని సిగ్గు ఎగ్గు లేకుండా అడ్డగోలుగా తమ పార్టీలోకి లాగేసుకొని, చివరికి వాళ్ళను చాలా మందిని మంత్రులుగా కూడా చేశాడు. ఆనాడు చాలా మంది మేధావులు చంద్రబాబు చర్యల్ని ఖండించారు. కానీ స్పీకర్ సౌజన్యంతో వారు కాపాడపడుతూ వచ్చారు. అది అప్పట్లో చంద్రబాబుకు చాలా ఆనందాన్ని కలిగించిందే కాని 2019 ఎన్నికల్లో ఆయనకు శోకాన్ని మిగిల్చింది.

ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని విస్మరించి నెగ్గిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారు ఎవరూ తిరిగి 2019 ఎన్నికల్లో నెగ్గలేదు. ఫిరాయింపు చట్టాలు వాళ్ళకు చుట్టాల్లా మేలు చేసినా, ఎన్నికల్లో మాత్రం అంలాటి నాయకులకు పెద్ద షాకే ఇచ్చారు ప్రజలు. ఎవరు ఏ తప్పుచేసినా చివరికి ఓటర్లే వాళ్ళని శిక్షిస్తారు. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా చంద్రబాబు పార్టీ 2019లో కేవలం 23 స్థానాల్లోనే నెగ్గి ఊపిరి నిలుపుకొంది. అన్ని నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసిన ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హెూదాలో వుంటూ అనేక తప్పులు చేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా 151 స్థానాల్లో కనీవినీ ఎరుగని అఖండ విజయాన్ని సాధించిన వైసిపి పాలనను అస్థిరపరిచే కుట్రలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నది. ‘శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు’ అన్న సామెత ఎలాగూ వుంది. ఆ శత్రువు ఎవరో కాదు ఆయనే రఘురామ కృష్ణమ రాజు. ఆయన ఫ్యాన్ గుర్తుపై నెగ్గి, ప్రతిరోజూ వైసిపి పాలననే విమర్శిస్తూ చీఫ్ పబ్లిసిటీ కోసం అర్రులు చాస్తూ కాలం గడుపుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దురదృష్టకర పరిణామం ఒకటి చోటు చేసుకొనింది. కులపరంగా మీడియా రెండుగా చీలిపోయింది. ఇందులో ఎన్.టివిని కొంత వరకు మినహాయించవచ్చు.

వైసిపి నాయకులు తెలుగుదేశంకు కొమ్ముకాచే ఛానళ్లను ‘ఎల్లో మీడియా అని ముద్దుగా పేరు పెట్టి విమర్శిస్తారు. అదే కులంపరంగా, పార్టీపరంగా ‘సాక్షి’ పత్రిక, ఛానల్ కూడా వ్యవహరిస్తున్నది. పత్రికా స్వేచ్ఛను ప్రజాస్వామ్యవాదులంతా బలపరుస్తారు. పత్రికలకు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్య్రాలు వుండాల్సిందే అని ఘంటాపధంగా చెప్పుతుంటారు. నిజమే అలాంటి స్వేచ్ఛ పక్కదారి పట్టి, జర్నలిజం విలువలనే పాతర వేస్తే ఎలా వుంటుంది? ఇది ఆమోదయోగ్యమేనా? పెట్టుబడిదారుల విషపు పుత్రికలే ఈ పత్రికలు అని మహానుభావులు ఏనాడో సెలవిచ్చారు. భారతదేశం లో పత్రికా స్వేచ్ఛ గూర్చి రాసేందుకు ఇది సందర్భం కాదు. వొక్క ఆంధ్రప్రదేశ్ గూర్చే ఇక్కడ ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఇలాంటి దుష్టపరిణామం ఇంత వరకూ ఏ రాష్ట్రంలోనూ రాలేదు వొక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప. కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు చదివితే మనకు వాస్తవాలు లభించవు. అన్ని పత్రికలూ చదవాలి, అన్ని ఛానల్స్ చూడాలి. అయినా వొక్కొసారి వొక దాని వార్తకు మరొక దాని వార్తకు పొంతనే వుండవు. అంతా అయోమయం. అంతా కులమయం. ఎందుకిలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలియదు.

ఈ పరిణామానికి అంతం ఎప్పుడో! అసలు వుండదా? నావరకైతే ఇవిలాగే కొనసాగుతాయనిపిస్తుంది. పత్రికలు వార్తల్ని కాకుండా విష బీజాల్ని చిమ్ముతున్నాయి. ఇందులో ఇరు వర్గాల దోషమూ వుంది. వొకరిని నిందించి ప్రయోజనం లేదు. నిష్పాక్షికతకు నిదర్శనంగా కొనియాడబడ్డ పత్రికలు కూడా ఈ రోజూ ఆ భావన వదిలేసి కులపు రంగు కట్టుకొంటున్నాయి. విష వ్యాప్తికి తోడ్పడుతున్నాయి. అదే నేటి బాధంతా! మొన్న తెలుగుదేశం పార్టీ అధికారానికి కొచ్చినా, నిన్న వైసిపి అధికారానికొచ్చినా కేవలం ‘కమ్మ’, ‘రెడ్ల’ వొట్లతో రాలేదన్నది వాస్తవం. ఇలాంటి నిజాన్ని విస్మరించి ఈ కుల పోరాటాలేమిటో? పోరాటాలు చేసుకోండి! కానీ మీడియా వుద్దేశాల్ని చంపేయకండి. చంద్రబాబు, జగన్ ఎవరిగెలుపూ మీడియా వల్ల వచ్చింది కాదు. ప్రజల అభిమతం, ప్రజల అభిమానంతోనే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మీడియాలో ఈ దుర్మార్గపు కులచెదలు ఇప్పుడే అంటుకొంది. సర్వం నాశనం కాకముందే అందరిలో కనివిప్పు కల్గాలి. కర్ణాటకలో కూడా కులాల పోరువుందే కానీ మీడియాలో కులచెదలు లేదు. ఈ పరిణామాల్ని చూసి తెలుగు వారంతా సిగ్గుపడాలి.

మొత్తం వ్యవహారమంతా బేరీజు వేస్తే ఈ దుష్పరిణామానికి కొంత ఎక్కువ బాధ్యుడు చంద్రబాబే అని చెప్పవచ్చు. మనమంతా తెలంగాణలో వుండడం వల్ల చాలా వరకు సంతోషించాలి. మన మీడియాలో ఇలాంటి దరిద్రపు పోకడలు లేవు. ఏ పత్రికలో కూడా మనకు కుల వాసనాలు రావు. అంత వరకు అదృష్టవంతులం. ఆంధ్రప్రదేశ్‌లో ‘కులం’ ప్రతిపక్షమై, పత్రికల్లో అభివృద్ధికి అడ్డుకట్టవేయాలని చూస్తున్నది. వాస్తవాలకి మసిపోసి, మారేడు కాయ పూసి అవాస్తవాలుగా వక్రీకరించడం సబబు గాదు.
ఇక రఘురాముడి చిత్రానికొద్దాం. రఘురామకృష్ణమ రాజు ఎన్నికైన నెల రోజుల నుండి జగన్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇదే అదనుగా అన్ని పార్టీలు రఘురాముణ్ణి నెత్తికెత్తున్నాయి. రఘురాముడి అసమ్మతికి ఆజ్యంపోస్తూ ఆ నిప్పులో చలికాచుకొనేందుకు మిగిలిన అన్ని పార్టీలు ప్రయత్నించాయి. రఘురామ చేస్తున్నది తప్పని గానీ, అయన వెయ్యి కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వాడని గానీ ఎవ్వరు ఆలోచించలేదు. ఆయన ప్రతిరోజూ రెండు ఛానల్స్‌లో దర్శనం ఇస్తూ, తమ పార్టీ అధ్యక్షుడిపై లేనిపోని విమర్శలు చేస్తూ రెండేళ్ళుగా సాగిస్తున్నాడు. రానురాను ఆయన విమర్శలకు హద్దులే లేకుండాపోయాయి.

ఆయన విజ్ఞత గల వాడైతే అంతర్గత పార్టీ సమావేశాల్లో జగన్ పాలనపై తన అభ్యంతరాల్ని తెలయపరచి వుండాల్సింది. లేఖల ద్వారా అయినా జగన్‌కు ఆయన పాలనాదోషాల్ని తెలియపరిచి వుండాల్సింది. ఆయన పాలన, ఆయన విధానాలు పూర్తిగా నచ్చకపోతే, జగన్ కో దండం ఆయన పార్టీకో డండం అంటూ రాజీనామా పడేసి గౌరవంగా, ఆత్మాభిమానం కల్గిన రాజుగా వెళ్ళివుండాల్సింది. రాజు లెప్పుడూ వీరోచితంగా, ప్రత్యక్షంగానే పోరాడతారు. ఇలా దొడ్డి దారిలో జగన్‌పై యుద్ధం చేయరు. సాంకేతిక కారణాల వల్ల వైసిపి కూడా ఆయన్ని సస్పెండ్ చేయక, నానబెడుతూనే వచ్చారు. అదే రఘురాముడికి సంపూర్ణ స్వేచ్ఛగా మారి హద్దులు, ఎల్లలూ దాటేసింది. కరోనా కాటుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు దిక్కుతోచక సతమతవుతుంటే, చంద్రబాబు అండ్ కో రఘురామ కృష్ణం రాజును అస్త్రంగా వాడుకొన్నాయి. అలా ఎగదోసి, ఎగదోసి, ప్రోత్సహించి చివరికి రఘురామ కృష్ణం రాజును వీధిన పడేలా చేశారు. చరమఅంకంలో వారు రఘురాముడిచే విశ్వరూప దర్శనం వేయించారు.

ఆయన మీసాలు త్రిప్పుతూ, హావభావాలు ప్రకటిస్తూ రెడ్ల కులాన్ని ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డిని భయంకరంగా తిడుతూ రక్తికట్టించేలా చేసి సంబరపడ్డారు. బాధ్యాతయుత ఎంపిగా వుంటూ రఘురామ కృష్ణంరాజు అలా మాట్లాడాల్సి వుండేది కాదు. అది ముమ్మాటికీ తప్పు. కులాల్ని కించపరచే హక్కు ఏ వ్యక్తికీ లేదు. అదే ఆయన కొంప ముంచింది. కోర్టులో బెయిల్ లభించివుండవచ్చు.కానీ జనం నోళ్ళలో రఘురామ కృష్ణం రాజు పేరు మలిన పడింది. క్షత్రియ సంఘం కూడా ఆయన వైఖరిని ఢీ కొట్టింది.

రాష్ట్రంలో సిబిసిఐడి రంగంలోకి దిగింది. రఘురాముడు హద్దుమీరి ప్రవర్తిస్తున్నాడని గ్రహించింది. అడ్డువేయకపోతే పెను ప్రమాదాన్ని పసిగట్టింది. మే 14న సాయంత్రం 4 గం॥కు రఘురాముని హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి మంగళగిరికి తీసుకెళ్ళారు. ఆయనపై 124 ‘ఏ’, 153‘ఏ’, 120 బీ, 505 క్రింద పలుకేసులు నమోడు చేశారు. ఇందులో ప్రధానమైంది. రాజద్రోహం క్రింద పెట్టిన కేసు. 15న మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ విధించారు. అప్పుడే ఆయన హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేయగా అందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక్కడే న్యాయం పరుగులు తీసింది. హైకోర్టు వొక మెడికల్ బోర్డును ఏర్పరుస్తూ మరుసటి రోజు 12 గం॥లోపు వైద్యపరీక్షల నివేదిక సమర్పించాలన్నారు. మెజిస్ట్రేట్ కోర్టు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో రాజుకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశింది. మరుసటి రోజు సాయంత్రం హైకోర్టు నియమించిన వైద్యుల కమిటీ తమ రిపోర్ట్ ను హైకోర్టుకు సమర్పించింది. ఆ రిపోర్ట్ ప్రకారం రఘురామకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని, కాలికి ‘ఎడిమా’ అనే వ్యాధి వుందని తెల్పింది.

దాంతో బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు రఘురామను అదేశించింది. బంతి మరింత వేగవంతమై సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. రఘురామ కృష్ణం రాజు కేసును అత్యవసరంగా పేకప్ చేసి విచారణ చేపట్టింది. సికింద్రాబాద్ లోని అర్మీ ఆస్పత్రిలో తిరిగి వైద్యం చేయించాలని 3 రోజుల గడువిచ్చింది. తీర్పు వచ్చేంత వరకు హాస్పిటల్‌లోనే వుండేలా వెసులుబాటు కూడా కల్పించింది. చివరికి 21న మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ సుప్రీం గడపచేరింది. ఆ నివేదిక అదివరకు గుంటూరు హాస్పిటల్ ఇచ్చిన నివేదికకు పూర్తి విరుద్ధంగా వుంది. రెండూ ప్రముఖ దాక్టర్లిచ్చినవే అయినా ఆ నివేదిక పరస్పర విరుద్ధంగా వుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కస్టడీలో రఘురామను కొట్టారంటూ మిలిట్రీ వైద్యులు నిర్ధారించారు. సంతోషమే! సుప్రీం చాలా పెద్ద మనసుతో వెంటనే బెయిల్ మంజూరు చేసి కథ సుఖాంతం చేసింది. ఇక్కడ మనలాంటి సామాన్యులకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. కేసు సుప్రీంకోర్టులో అంత త్వరగా ఎలా విచారణకు వచ్చింది.

ఆయన ఎంపి కనుకనా! సామాన్య మానవుని విషయంలో కూడా ఇంత త్వరగా న్యాయం లభిస్తుందా? మనందరం గర్వించే మన తెలుగుతేజం ‘రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. ఆయనైన పేదవాడు కూడా సుప్రీం గడపతాకే అవకాశం దిశగా సంస్కరణలు చేపడతాడని ఆశిదాం. అందరికీ వొకే న్యాయం వుండాలి కాదా! అన్న ఎన్నో ప్రశ్నలు అందర్లో తలెత్తుతున్నాయి. ఇలానే జరిగితే కోర్టుల్లో ఎలాంటి కేసులూ పెండింగ్ లో వుండకూడదు. మరి హైకోర్టులో కూడా అంతే వేగంగా ఈ కేసు విచారణ జరిగింది. ఇది కూడా చాలా సంతోషించతగ్గ పరిణామమే! మరి 3 రాజధానుల సమస్య ఎందుకనో ఇంకా రఘురామ కేసులా స్పీడు అందుకోవడం లేదు. కోర్టులు ప్రధాన సమస్యల్ని సత్వరం పరిష్కరించాలి. రఘురామ కృష్ణమరాజు కేసు విచారణ పూర్తి అయి బెయిల్ లభించింది. ఇందులో ఎలాంటి వివాదాస్పదాలు లేవు. కారణం కోర్టు నిర్ణయాలే శిరోధార్యం కనుక. ఎవరూ తప్పు పట్టకూడదు. అందరమూ ఆ తీర్పులకు కట్టుబడి వుండాలి.

కాకుంటే ఇలాంటి కేసుల్లో సామాన్యులకు సహా అనుమానాలు తలెత్తుతుంటాయి. రఘురామ కృష్ణమరాజు విమర్శల సూరును 46 మీడియా కేసెట్స్ రూపంలో సిబిసిఐడి పోలీసులు కోర్టులకు సమర్పించారే! మరి కోర్టులు అవి చూడలేదా? ఆయన ఒక కులంపై చేసిన దుర్మార్గపు విమర్శల్ని కోర్టులు ఎందుకు మందలించ లేదు? కొట్టారా లేదా అన్న ప్రశ్నలకే కోర్టు ఎందుకు పరిమితమైంది? ఆయన అలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే? ఆ మాటల్ని ప్రసారం చేయడం కూడా ఛానల్స్ పెద్ద తప్పే! ఆయన మాటల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య పోరు, హింస జరిగితే అందుకు ఎవరు బాధ్యులు? ఎంపిలకు మాత్రమే అలా మాట్లాడే హక్కులుంటాయా? రాజ్యాంగ పెద్దలు సెలవివ్వాలి. మొదట్నించి రఘురామ ప్రవర్తనా తీరు కూడా వైవిధ్యంగా వుంది. హైకోర్టులో బెయిల్ తిరస్కరణ తర్వాత ఆయన నడకలో, వ్యవహారంలో మార్పులు ఎలా వచ్చాయి? కస్టడీలో పోలీసులు కొట్టినట్లు ఉదయం నుండి చెప్పని కృషంరాజు బెయిల్ రిజెక్ట్ చేస్తూ హైకోర్టు చెప్పగానే ఎందుకు ప్రస్తావించినట్లు! అది ఎవరి స్ట్రాటజీ అనుకోవచ్చు.

ఈ రోజు సుప్రీం తీర్పుతో ఆయన హాయిగా బయట తిరుగుతుంటే, ఇలా మరొకరెవరైనా కులాల్ని తిడిగే! సమాజంలో కులాల మధ్య చిచ్చురాజుకోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినా శక్షింపపడాలి. దుర్మార్గపు ప్రవర్తనకు పార్టీలు, మీడియా కూడా గొడుగు పట్టడం మంచిది కాదు. ఏ పార్టీవారు ఇలాంటి తప్పుడు వాదానికి దిగినా మనుష్యులంతా ముక్త కంఠంతో ఖండించాలి. కులాలు వేరు, రాజకీయాలు వేరు. రెంటినీ క్లబ్ చేసి దుర్మార్గపు నాటకాలకు బీజం వేయకండి. కొత్తగా జీవం పోసుకొన్నఆంధ్రప్రదేశ్‌కు ఇది మంచిది కాదు. రఘురామ కృష్ణం రాజు రిమాండ్లో వుంటూ మంగళగిరి నుండి సికింద్రాబాద్ మిలిట్రీ హాస్పిటల్‌కు పోలీసు వాహనం కాదని తన స్వంత లగ్జరీ వాహనంలో రావడం చాలా పెద్ద తప్పు. అందుకు అనుమతించిన సిఐడి అధికార్లపై చర్య ఎందుకు తీసుకోకూడదు! రెండు హాస్పిటల్స్ మెడికల్ రిపోర్ట్‌లో తేడాలు ఎలావచ్చాయి? అలా ఎలా రాయగలరు. ఇప్పుడు ఎవర్ని నమ్మాలి? ఏ రిపోర్టు మలినమైంది? ఎవరు దోషులు? దాక్టర్లు కూడా న్యాయబద్ధంగా, మనస్సాక్షిగా వాస్తవాలే రాయగల్గాలి.

రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టింది కదా అని తామూ దిగజారకూడదు. మనసాక్షికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించరాదు. ఎన్ని వొత్తిళ్ళు వచ్చినా వాస్తవాల్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఈ కేసులో గుంటూరు మెడికల్ రిపోర్టులో గాని మిలిట్రీ హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ తయారీలో గాని ఎక్కడో ఎవరిదో జోక్యం వుంది. అది కూడా నిగ్గుతేలాలి. కారులో ప్రయాణిస్తూ రఘురామ కృష్ణంరాజు కాళ్ళుపై కెత్తి టివిలకు చూపుతూ మీసాలు తిప్పడం చాలా పెద్దతప్పే! ఇలాంటి అవకాశాలు ఎంపిలకు మాత్రమే వుంటాయా? ఇందులో నీతి ఏంటి? ఇక చంద్రబాబు ఈ కేసును సొంత భుజస్కంధాలపై నడిపించి రక్తి కట్టించాడన్నది వాస్తవమే? హెూం శాఖకు, గవర్నర్‌కు లేఖలు మీద లేఖలు రాశాడు. గగ్గోలు పెట్టాడు. స్వంత పార్టీకి చెందిన అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ధుళిపాళ నరేంద్రలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంతగా స్పందించలేదు. ఈ నాటకంలో ఆయన పాత్రను శంకించాల్సివుంది. ఆయన ఎందుకిలా చేస్తున్నాడో ఆ పార్టీ నాయకులకే అర్థం కావడం లేదు. ఆయన వేసే పాచికలు ఆయనకు మరింత నష్టాన్నే కల్గిస్తున్నాయి.

లాభం కన్నా నష్టాల్నే కొని తెచ్చుకొంటున్నాడు. జగన్ పై గెలవాలంటే ఇలాంటి చిల్లర కార్యక్రమాలు కాకుండా ప్రజల మనసుల్ని గెలవగల్గాలి. కోర్టుల్లో గెలుపు ఓటర్ల తీర్పులోనూ రావాలి. అప్పుడే ఆయనకు, ఆయన పార్టీకి భవిష్యత్తు వుంటుంది. ఐదేళ్ళు కూడా అధికారంలో లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నాడన్న అపవాదు ఇప్పటికే చాలా మంది నోట విన్పిస్తున్నది. ఇంకో మూడేళ్ళు ఇలాగే సాగితే తెలంగాణలో లాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగుదేశం మనుగడ కూడా కష్టమైపోతుంది. కరోనా కష్టకాలంలో ఇలాంటి వాటితో కాలక్షేపం చేసే బదులు ఎన్‌టిఆర్ ట్రస్ట్ ద్వారా కనీసం తెలుగు తమ్ముళ్ళకయినా వైద్య సహాయం అందిస్తే బాగుంటుంది. మీడియాను కూడా మలినం చేయకండి. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను పెట్టుకోవాలే కానీ ఆయన దగ్గర పని చేసిన రాబిన్ శర్మలాంటి వారిని పెట్టుకొంటే ఫలితాలు ఇలానే వుంటాయి. చంద్రబాబు వ్యూహల ఫలితంగా మొన్న జరిగిన సర్పంచ్, నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం వాష్ అవుట్ అయింది. ఇకనైనా జాగ్రత్తగా, విజ్ఞతతో అడుగులు వేస్తాడే మో చూద్దాం! కెసిఆర్, జగన్లను సజావుగా పాలన చేసుకోనివ్వండి బాబు!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News