Home తాజా వార్తలు గ్రామాల స్వరూపం మారాలి

గ్రామాల స్వరూపం మారాలి

video conference

 

సిఎం ఆదేశాలను విధిగా పాటించండి
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించి సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 6 నుండి గ్రామాలలో ప్రారంభమైన 30 రోజుల గ్రామాల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణ అమలులో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల స్వరూపంలో మార్పు కన్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. జోషి అన్నారు. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జారీ చేసిన ఆదేశాలను విధిగా పాటించాలని సూచించారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా గ్రా మాలలో చేపడుతున్న పనులను సిఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్‌రావు, సెర్ప్ సిఇఒ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా గుర్తించి చేపడుతున్న పనులు, నిరంతరం అమలయ్యేలా చూడాలని ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల స్వరూపం మారాలని ఆదేశించారు. సిఎం ఆదేశాల స్పూర్తిని కొనసాగించాలని ప్రభుత్వ సంస్థలతో పాటు గ్రామాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి సంబంధించి వార్షిక, పంచ వర్ష ప్రణాళికలు రూపొందించాలన్నారు. డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, నర్సరీలకు స్థలాలను గుర్తించి వినియోగంలోకి వచ్చేలా చర్యలు మొదలు పెట్టాలన్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకా రం పనులు కొనసాగాలని కేవలం ఒక సారి మాత్రమే పనులు చేపట్టేలా కాకుండా మిషన్ మోడ్ తరహాలో నిరంతరం అమలయ్యేలా చూడాలన్నారు. మన ఊరు మనమే భాగుచేసుకొనేలా ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకరావాలన్నారు. గ్రామాలలో గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలన్నారు.

పవర్ వీక్‌లో భాగంగా శిథిలమైన స్థంబాల తొలగింపు, కరెంటు తీగలు సరిచేయడం, థర్డ్ వైర్ ఏర్పాటు , గ్రామ పంచాయతీలకు మీటర్లు తదితర పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఆస్పత్రులలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్లు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకొని మంచి పనులు జరిగేలా చూడాలని , జాగ్రత్త తో దీర్ఘ కాలం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. పవర్ వీక్ లో గుర్తించిన పనులను పూర్తి చేసేలా చూసుకోవాలన్నారు. గ్రామాలలో చెత్త సేకరణ కోసం డస్ట్ బిన్ లు సరఫరా చేసినందుకు జగిత్యాల కలెక్టర్ డా.ఎ.శరత్ ను ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనుల కోసం నిధులను కేటాయించామని రిసోర్స్ మ్యాపింగ్ చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో ఇప్పటికే నెలకొన్న డెబ్రిస్ ను క్లియర్ చేయడంతో పాటు పరిశుభ్రత కొనసాగేలా చూడాలన్నారు.

సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రారంభమయి నందున క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను అంచనా కోసం ఈ సమావేశం నిర్వహించామని గ్రామస్థాయిలో అందరు భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి పనులు సక్రమంగా జరిగేలా చుడాలన్నారు. నర్సరీల కోసం గుర్తించిన స్థలాల వివరాలు పంచాయితీ రాజ్ కమీషనర్ కు పంపాలన్నారు.

సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ గ్రామాలలో వార్షిక హరిత ప్రణాళికను రూపొందించుకోవాలని అవెన్యూ ప్లాంటేషన్ ను క్రమపద్దతిలో చేపట్టాలని అన్నారు. నర్సరీలలో జర్నల్ ను ప్రారంభించి అధికారుల రిమార్కులను అందులో నమోదు చేయాలన్నారు. ట్రీ గార్డులను క్రమ పద్దతిలో అమర్చాలన్నారు. ఆటవీ అధికారుల సలహాలతో నర్సరీలు క్రమ పద్ధతిలో పని చేసేలా చూసుకోవాలన్నారు.

CS review by video conference with collectors of district