Home తాజా వార్తలు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

CS Somesh review with collectors on vaccination process

 

మంచిర్యాల: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరు కల్లా పూర్తిచేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పురోగతనిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ పురోగతి ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఆయన శుక్రవారం ఉదయం ఆదిలాబాద్‌జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్బంగా మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ , నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. వ్యవసాయ కూలీలు పొలాల్లో పని చేస్తుండగా వైద్యసిబ్బంది అక్కడికే వెళ్లి వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. ఈ నెలాఖరు కల్లా వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు.

కొమురంభీం జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ముందుకురావడం లేదని అలాంటి సమయంలో వారికి గ్రామాలకు వెళ్లి వ్యాక్సినేషన్ పై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, వేయించుకుంటేనే కరోనా వైరస్‌కు దూరంగా ఉండవచ్చునన్నారు. ప్రతి గిరిజన గూడెంలో అవగాహన సదస్సులు నిర్వహించి రెవెన్యూ, పోలీస్ అధికారులు గిరిజనులు వ్యాక్సినేషన్ వేసుకునే విధంగా ప్రొత్సహించాలన్నారు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు ఎంత శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేశారని ఆయా కలెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లారు. ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత జిల్లాల అడిషనల్‌కలెక్టర్లు, జిల్లా పరిషత్ సిఇఓలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, జిల్లా ఇమ్మూనైజేషన్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, స్థానిక మున్సిపల్ కమిషనర్‌లు, ప్రభుత్వ ఆసుపత్రుల ససూపరింటెండెంట్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

CS Somesh review with collectors on vaccination process