Home తాజా వార్తలు దోసకాయ రుచులు…

దోసకాయ రుచులు…

Cucumber

 

తీగకు కాచే పండ్లు శరీరానికి ఎంతో మంచివని చెబుతుంటారు పోషక నిపుణులు. వాటిల్లో దోసకాయ ఒకటి. దోసకాయలో పోషకవిలువలు దండిగా ఉంటాయి. వారంలో ఒకసారైనా దోసకాయతో వంటకాలు తయారుచేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. కూర, పప్పు, పచ్చడి, దోసావకాయలతోపాటు మాంసాహారంలోనూ దోసకాయతో వెరైటీలు చేసుకోవచ్చు.

వేడివేడి అన్నంలో దోసావకాయ కలుపుకుని తింటే స్వర్గం కనిపించాల్సిందే. దోసకాయతో తయారుచేసే ‘ఆవకాయ’ చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా పాతకాలం నాటి నుంచి వస్తున్న సంప్రదాయపు పచ్చడి. మాములుగా మనం మామిడికాయతో ‘ఆవకాయ’ ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ దోసకాయతో ఆవకాయ చేస్తారు. కానీ మామిడికాయ ముక్కలు పచ్చడి కలిపిన వారం తరవాత కానీ తినటానికి పనికిరాదు. పైగా అది ఎంతకాలమైనా నిలవుంటుంది. ఈ ఆవకాయను ఉదయం కలిపితే సాయంత్రం వేడివేడి అన్నంలో తినడానికి సిద్ధమైపోతుంది. ఈ పచ్చడి ఎప్పటికప్పుడు తాజాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ పచ్చడి 10 నుంచి 15 రోజులకు మించి నిలువ ఉండదు. పులుపు ఇష్టపడేవాళ్ళకీ, గర్భిణులకు బాగా నచ్చుతుంది. బాగా దోరగా ఉన్న దోసకాయలను మాత్రమే తీసుకోవాలి.

కావాల్సినవి : దోసకాయలు1/4 కేజీ, ఉప్పు 50గ్రా, కారం 40 గ్రా, ఆవాలు 2 చెంచాలు, నూనె 70గ్రా, పసుపు చిటికెడు.
తయారీ : దోసకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పైన తోలు తీయాల్సిన అవసరం లేదు. ఆవాలను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకుని టీ స్ట్రైనర్‌లో జల్లించి పక్కన పెట్టుకోవాలి. కోసుకున్న దోసకాయ ముక్కలను ఒక పింగాణీ గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, నూనె, ఆవపిండి మిశ్రమం వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టాలి. మధ్యమధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. సాయంత్రానికి మీకు నోరూరించే దోస ‘ఆవకాయ’ రెడీ అవుతుంది.

Cucumber Chutney

 

దోసకాయ పచ్చడి

కావల్సినవి : పచ్చ దోసకాయ పెద్దది- ఒకటి, కొత్తిమీర తరుగు- రెండు కప్పులు, పచ్చిమిర్చి- ఎనిమిది, ఉప్పు- రుచికి సరిపడా, చింతపండు- కొద్దిగా, నూనె -ఒక టేబుల్‌స్పూన్, ఆవాలు, మినపప్పు, మెంతులు- ఒక్కో టీస్పూన్ చొప్పున, ఎండుమిర్చి- ఒకటి, ఇంగువ- కొద్దిగా.

తయారీ: దోసకాయ తొక్కు తీసి మధ్యకు కోసి లోపలి గింజలు తీసేసి చేదు చూశాక చిన్న ముక్కలుగా కోయాలి. బ్లెండర్ జార్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా పట్టాలి. తరువాత కొత్తిమీర తరుగు వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. అవసరమనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు, మినపప్పు, ఇంగువ వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఎండుమిర్చి ముక్కలు వేయాలి. ఈ తాలింపును దోసకాయ ముక్కల మిశ్రమంలో వేయాలి.

Cucumber Mutton

 

దోసకాయ మటన్

కావల్సినవి : మటన్ ముక్కలు: పావుకిలో, దోసకాయ: చిన్నది, ఉల్లిపాయ: ఒకటి, టమాటాలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, కారం : రెండు చెంచా లు, ఉప్పు: తగినంత, గరం మసాలా: అరచెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: పావుకప్పు.
తయారీ విధానం : దోసకాయ, ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చిని విడివిడిగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. ఆ తరువాత మటన్ ముక్కలు చేర్చాలి. అది కూడా వేగాక దోసకాయ ముక్కల్ని వేసి మూత పెట్టేయాలి. దోసకాయ ముక్కలు మెత్తగా అయ్యాక తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద ఒకదాని తరువాత మరొకటి వేసి బాగా కలపాలి. కూరలో చేరిన నీళ్లు ఆవిరయ్యాక కొత్తిమీర తరుగు చల్లి పొయ్యి కట్టేయాలి.

Cucumber Chicken

 

దోసకాయ చికెన్

కావాల్సినవి : దోసకాయ: ఒకటి, చికెన్ ముక్కలు: అరకిలో, ఉల్లిపాయ:ఒకటి, కారం: 4 టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద : 2 టీస్పూన్లు, గరం మసాలా: టీస్పూను, ఉప్పు తగినంత, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి: టీస్పూను.
తయారీ : చికెన్ ముక్కలకు ఉప్పు కారం పట్టించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగాక, చికెన్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొబ్బరి, ధనియాల పొడి వేసి సిమ్‌లో మరికాసేపు ఉడికించి దించాలి. అంతే ఎంతో రుచికరమైన దోసకాయ చికెన్ కర్రీ తయారు అయినట్లే.

Cucumber different recipes