Thursday, April 25, 2024

యాసంగి జోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం యాసంగి పంటల సాగుకు పూర్తిగా అనుకూలిస్తోంది. కృష్ణా, గోదావరి నదులు పరీవాహకంగా ప్రధాన ప్రాజెక్టులతో పాటు మీడియం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో నీటివనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలమట్టాల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం క్రమేపీ పుంజుకుంటూ వస్తోంది. ప్రభుత్వం జోన్ల వారీగా కిసాన్ మేళాలు ఏర్పాటు చేసి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఇతర పంటల కు అనుకూలంగా లేక తప్పని పరిస్థితు ల్లో వరిసాగు చేయాల్సి వస్తే స్వల్పకాలిక వరి రకాలను వేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఏప్రిల్ చివరినాటికి పంటలు పూర్తిగా చేతికొచ్చే రకాలను సిఫార్సు చేస్తోంది.

దీర్ఘకాలిక రకాలు సాగుచేస్తే మే పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పం టలు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సాగు చేసిన వరికోతలు జోరుగా సాగుతున్నాయి. జొన్న, మొక్కజొన్న, మినుము ,పెసర, వేరుశనగ పంట కోతలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు వానాకాలం పంటలు పూర్తయిన ప్రాంతాల్లో పొలాలు దుక్కులు దున్ని యాసంగి పంటల సాగుకు సిద్దం చేసి విత్తనాలు వేస్తున్నారు. యాసంగిలో సాధారణ సాగువిస్తీర్ణం 47,85,513 ఎకరాలుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సమయానికి 7,09,851 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగులోకి రావాల్సివుంది. అయితే ఇప్పటివరకూ 6,35,227ఎకరాల్లో విత్తనం పడినట్టు వ్యవసాయశాఖ బుధవారం నివేదిక విడుదల చేసింది. సాధారణ సాగు విస్తీర్ణంలో ఇది 13.27శాతంగా అధికారులు వివరించారు. గత యాసంగిలో ఈ సమయానికి 8,14,862ఎకరాల్లో విత్తనాలు పడినట్టు తెలిపారు.

ఊపుమీదున్న పప్పుధాన్యపంటల సాగు:

రాష్ట్రంలో ఈ యాసంగి పప్పుధాన్యపంటల సాగు మంచి ఊపుమీద సాగుతోంది. పప్పుశనగ,మినుము ,పెసర , కంది ,ఉలవ తదితర పంటల సాగుకు రైతులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ యాసంగిలో అన్నిరకాల పప్పుధాన్యపంటలు కలిపి 3.91లక్షల ఎకరాల సాధారణ సాగువిస్తీర్ణంగా అంచనా వేయగా ,ఇప్పటికే76.90శాతం సాగు జరిగింది. 3.13లక్షల ఎకరాల పప్పుశనగా విస్తీర్ణం అంచనా వేయగా ఇప్పటికే 2.75లక్షల ఎకరాల్లో శనగవిత్తనం పడింది.గత ఏడాదికంటే 5వేల ఎకరాల్లో అధికంగా విత్తనం పడింది. మినుము 19,453ఎకరాల్లో సాగులోకి వచ్చింది. 1775ఎకరాల్లో పెసరవిత్తనం పడింది. అన్ని రకాల పప్పుధాన్య పంటలు కలిపి ఇప్పటికే3.01లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

3.91లక్షల ఎకరాల్లో నూనెగింజ పంటలు:

మార్కెట్‌లో వంటనూనెలకు గిరాకి పెరగటంతో ప్రభుత్వ ఈ యాసంగిలో నూనెగింజ పంటల సాగుకు ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రమంతటా 3.91లక్షల ఎకరాల విస్తీర్ణంలో నూనెగింజ పంటలు సాగు చేయించాలని లక్షంగా పెట్టుకుంది. రైతులు కూడా ఈ పంటల సాగుకు అసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో యాసంగి వేరుశనగ 3.02లక్షల ఎకరాల్లో సాగుచేయించాలని లక్షంగా పెట్టుకోగా , ఇప్పటికే 1.40లక్షల ఎకరాల్లో వేరుశనగ విత్తనం పడింది. పొద్దుతిరుగుడు 17352ఎకరాల్లో సాగు లక్షంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకూ 3585ఎకరాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు వేవారు .ఆవాలు,కుసుమ పంటలు మరో తొమ్మిదివేల ఎకరాల్లో సాగు చేశారు.

ఒక్కశాతం లోపే వరినాట్లు

యాసంగిలో వరిసాగుపై రైతులు ఇంకా దృష్టిపెట్టలేదు. వ్యవసాయశాఖ ఈ యాసంగిలో 33.53లక్షల ఎకరాల్లో వరిసాగును లక్షంగా పెట్టుకుంది. ఈ సమయానికి 21వేల ఎకరాల్లో వరినాట్లు పడాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 6459 వరినాట్లు పడ్డాయి. సాధారణ వరి విస్తీర్ణంలో వరినాట్లు ఒక్కశాతం కూడా చేరలేదని అధికారులు వెల్లడించారు. మొక్కజోన్న సాగు మంచి ఊపులోవుంది. ఈ సీజన్‌లో 4.63లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణంగా లక్ష్యాలు నిర్ణయించగా, ఈ ఇప్పటికే1.17లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగులోకి వచ్చింది. మరో 19,127ఎకరాల్లో జొన్న, 1572ఎకరాల్లో గోధుమ, 235ఎకరాల్లో సజ్జ పంటలు సాగులోకి వచ్చాయి. వానాకాలం సాగుచేసిన వరి పంట కోతలు పూర్తయ్యేందుకు మరో రెండు వారాలు పట్టనుంది. నాలుగో వారం నుంచి రాష్ట్రంలో యాసంగి పంటల సాగు మరింత ఊపందుకుంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News