Home ఎడిటోరియల్ సంప్రదాయం – సమాజం

సంప్రదాయం – సమాజం

SOCIETY-1

‘వ్యాఖ్యానానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ నిజాలు పవిత్రమైనవి. ప్రత్యర్థులకు తమ వాక్కు విని పించే హక్కుంది. వారి మాట మిత్రుల మాట కంటె తక్కువైనదేమీ కాదు. ‘బ్రిటిష్ పాత్రి కేయుడు, ప్రచురణకర్త, రాజకీయ వేత్త, మాంచెస్టర్ గార్డియన్ (నేటి గార్డియన్) పత్రిక సంపాదకులు దివంగత చార్లెస్ ప్రెస్ట్ విచ్ స్కాట్ వ్యాఖ్య ఇది. జల్లికట్టు జగడంలో ‘సంప్రదాయ సంరక్షణ’ అని కలిసికట్టుగా అంటున్నారు. గత కాలం నుండి పాటిస్తూ వచ్చిన ఒక పద్ధ్దతిని సంప్రదాయ మంటారు. ఆచారం దీనికి పర్యాయ పదం. ఆచారం సదాచారం కావచ్చు, దురాచారం కావచ్చు. అతిథి సత్కారం సదాచారం. సతీ సహగమనం దురాచారం. ఒక జాతి ప్రజల జీవనవిధానం, జీవన చర్యల ప్రతిబింబమే సంస్కృతి. వస్త్రధారణ, భాష, ఆలోచనా విధానం, ఆచారాలు, పండుగలు, వినోదాలు, ఆటలు, జాతరలు, వైద్యం, కుటుంబ విధానం, విలువల సమ్మేళనమే సంస్కృతి. మన సంస్కృతి ప్రపంచీకరణలో వక్రీకరించింది. మాధ్యమాల సంస్కృతిగా, వినోదాల సంస్కృతిగా, ఆర్థిక సంస్కృతిగా మారిపోయింది. ఆకర్షణ, వ్యామోహం, మానసిక వైకల్యం, ఆటవిక హింస, అశాస్త్రీయత, మతఛాందసత్వం, మూఢ విశ్వాసాల సమ్మేళనంగా పరిణామం చెందింది. ప్రజల దేశవాళీ సంస్కృతి, సంప్రదాయాలు నాశనమయ్యాయి. వినిమయ, సరుకుల సంస్కృతి సంత రించింది. ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు, దృక్పథాలు ప్రభావ రహిత మయ్యాయి. సైద్ధాంతిక చర్చలు, సంవాదాల స్థానంలో స్వదేశీ దురభి మానం, విదేశీ అభిమానం చోటుచేసుకున్నాయి. మనుషులు సమిష్టిగా ప్రకృతితో కలిసి, ప్రకృతితో పోరాడుతూ సాగించే ఉత్పత్తి, పునరుత్పత్తి ప్రక్రి యల, మానవ సంబంధాల సమాహారమే సమాజం. మనుషుల మధ్య సామూహిక సంబంధాలు, ఘర్షణలుంటాయి. ఘర్షణే సమాజ చలనానికి చోదక శక్తి. సమాజం నిరంతర మార్పుకు లోనవుతుంది. మెదడు అభివృద్ధి చెందిన మనిషి కార్యక్రమాలు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. సంస్కృతి, సంప్రదాయాలు సమాజ లక్షణాలు. అవి దేశ, కాల, సమాజాల ను బట్టి మారుతాయి. సత్సంప్రదాయాలు, దుష్టసంప్రదాయాలు తారు మారవుతాయి. మంచి చెడులు తలకిందులవుతాయి. బాల్యవివాహాలు, సతీ సహగమనం ఒకనాటి సంప్రదాయాలు. నేడవి దురాచారాలు. ఓలి (ఆడు వారికి కట్నం) వరకట్నంగా మారింది. నేడు రెండూ అనాచారాలే. ఒకప్పు డు అంగీకరించని మహిళా ఆస్తిహక్కు నేడు చట్టబద్ధం. ఆటవిక సమాజంలో జంతువులను హింసించి వినోదించడం క్రీడా సంప్రదాయం. అది కూడా ఉన్నత కులాలకు, పురుషులకే పరిమితం. నేడది ఎలా సంప్రదాయం?
మహిళల అసమానతలు, అత్యాచారాలు, దళిత పీడనలకు స్పందన లేకపోవడం, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు కనిపించక పోవడం, పేదల ఆకలి, ప్రభుత్వ తప్పిదాలు, రాజకీయుల నేరాలు, అవినీతి పట్టక పోవడం భావదారిద్య్రమే. జంతు హింసా క్రీడ సంప్రదాయంగా గోచరిం చడం మానసిక దౌర్బల్యమే. ఓట్ల రాజకీయాలతో కేంద్ర, రాష్ట్రాలు వ్యవహ రించడం, న్యాయస్థానాలను న్యాయనిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించ మనడం, అవి అంగీకరించడం ఏ సంప్రదాయం?
సినిమాలలో సావిత్రి సంప్రదాయం జ్యోతిలక్ష్మి సంప్రదాయమై శ్రుతి, పదుకొణెల వస్త్ర సంస్కృతిగా, ఐటం సాంగ్‌ల రూపాంతరంగా ఎలా మారింది? ‘చీరకట్టుకుంటున్నాను’ అన్న హీరోయిన్ డైలాగునే తొలగించిన బి.ఎన్.రెడ్డి ఆదర్శ దర్శకత్వం స్థానంలో చీరలనే తీసేయించిన దర్శకేంద్ర సంప్రదాయం మంచిదా? మన నట శేఖరులు కళాశిరోమణులైన తమ భార్యలను పెళ్ళికాగానే నటన మాన్పించి గృహబంధంలో, వ్యాపారబంధం లోనే బంధించటం ఏ సంప్రదాయం? రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరాలకు, మనసులకు భోజనం తర్వాత చిత్రవినోదం, హానికరం కాని నీరా లాంటి పానీయాలు సంప్రదాయం. రోజంతా వినోదాలలోనే అలసి పోయేటట్లు చేసే చిత్ర ప్రదర్శనలు, మూతలే పడని సారాయి అంగళ్ళు, సారాయి హోటళ్ళు ఏ సంప్రదాయం? ఇవి ఒంటిని, ఇంటిని, సమాజాన్ని, దేశాన్ని నాశనం చేసినా అన్ని నేరాలకు, ఘోరాలకు, అత్యాచారాలకు కారణమైనా సంప్రదాయాలేనా? ప్రొహిబిషన్‌ను ఎత్తేసినప్పుడు తమిళనాట సంప్రదాయ విచ్ఛేదన స్పృహ కలుగలేదా?
నటి, అభ్యుదయ రచయిత లీల మణిమేకలై ఒక వ్యాసంలో ఇలా వివరించారు. తమిళ స్ప్రింగ్, తాయి పురచ్చి, సంస్కృతి, జాతి గౌరవం, ధైర్యం వంటి అర్థంపర్థం లేని మాటలతో తామనుకున్న ఒక్క కారణంతో ఈ అల్లరి జరుగుతున్నది. నాయకులు, ఆదర్శాలు, అజెండాలు లేకున్నా క్రమశిక్షణతో ప్రశాంతంగా చేస్తున్నారన్నదే ప్రశంసనీయం. బసవ క్రీడ కోసం అందరూ బసవన్నలయ్యారు. ఇదంతా బీచ్‌లో ప్రత్యక్షంగా చూసిన నేనూ బసవన్నగా మారాను అని వెటకరిస్తూనే, సంస్కృతి పేరుతో ఆడువారిని, దళితులను అణగ దొక్కినప్పుడు, లింగవివక్షలు, మైనారిటి పక్షపాతాలు, అంటరానితనం రాజ్యమేలినప్పుడు, ప్రేమ వ్యవహారాలలో బాలికలు గౌరవ హత్యల బారిన పడుతున్నప్పుడు, మత్స్యకారులు మరణిస్తున్నప్పుడు ఈ వీర విక్రమ పరాక్రములంతా ఎక్కడున్నారని, ఉన్నత న్యాయస్థాన నిషేధాన్ని నిషేధించమనడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. గత 2000 ఏళ్ళ తమిళ వారసత్వ చరిత్రలో భూస్వామ్య పాలన, పురుషా ధిక్య భావాలు తప్ప సామాన్యులకు ఉపయోగపడే ఏ తమిళ శౌర్యాన్ని నేను గమనించలేదన్నారు. నేటితరం మేటి నటి తృషా కృష్ణన్ కూడా ఇలాగే స్పందించారు. అయితే విభేదించిన వారిపై దాడులు జరిగాయి. ఇదేమి సంప్రదాయమో మరి?
‘తప్పుడు సమాచార మిచ్చేవారి గురించి జాగ్రత్త పడండి. అమాయకత్వం కన్నా అది అతి ప్రమాదకరమైంది’ అని జార్జ్ బెర్నార్డ్ షా ఎప్పుడో హెచ్చరించారు. యువతను సరైన దిశలో పయనించేటట్లు చేయడంలో ప్రజా సిద్ధాంతాలు, మానవత్వ సూత్రాలు తెలియ పరచడంలో సంప్రదాయం విఫలమైంది. గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ ఇంజి నీర్లకు, తదితర ఉద్యోగ యువకులకు వారాంతాలలో సంఘ పరివారం సంస్కృతి, సంప్రదాయాలలో శిక్షణ నిస్తోంది. ఎం.జి.ఆర్.కు లేని హిందు త్వాన్ని అంటగట్టి ప్రచారం చేశారు. ఆయన శతజయంతి ఉత్సవాలను కూడా సంఘ్ జరపాలని నిశ్చయించింది. ఎం.జి.ఆర్. 17.01.1917న జన్మించారు. రాజేంద్ర చోళ రాజును సొంతం చేసుకున్నారు. వీటన్నిటి ఫలితం తమిళ యువతను ఏ దిశకు నడిపించిందో చూస్తున్నాం. పరివార సిద్దాంతకర్త, రచయిత మేఘాలయ్, అరుణాచల్ ప్రదేశ్‌ల గవర్నర్ 67 ఏళ్ళ వి.షన్ముగనాథ రాజభవన రాసలీలలను గమనించినా సంఘ అధిష్టానం ఆయనను పదవినుంచి తొలగించలేదు. ఇది సంఘీయ సంప్రదాయం. చివరికి వందమంది రాజభవన సిబ్బంది రాష్ట్రపతితో సహా ప్రధాని, కేంద్ర మంత్రులకు మొరపెట్టుకోగా అప్పుడు ఆయనే రాజీనామా(!?)చేశారు. ఈ సంప్రదాయానికి స్పందనేది?
తమిళనాట ప్రభుత్వాల, న్యాయస్థానాల పలాయనవాదాన్ని గమనిం చిన మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తాము కూడా ఎడ్ల పందాలను పునరుద్ధ రించుకుంటామని అల్లర్లు మొదలెట్టారు. ఏనుగులను పోనిస్తే ఎలుకలూర కుంటాయా? కోళ్ళ పందాలు, పందుల పందాలు, పొట్టేళ్ళ పందాలు అన్నీ అడ్డూఆపూ లేకుండా ఆడుతారు. డబ్బు, మద్యం, ఇతర సాంఘిక దురాచారాలు విచ్చలవిడిగా సాగుతాయి. ఇది సంప్రదాయమేనా? అని సభ్యసమాజం ప్రశ్నించరాదు.
సంస్కృతి, సంప్రదాయాలు సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలి. సమాజానికి మేలు చేయాలి. అట్టడుగు జనాల అభివృద్ధికి దోహదపడాలి. ఈ పదాల విస్తృతార్థాన్ని యువతకు బోధించాలి. చైతన్య యువకులే సమాజ రథ చోదకులు. తండ్రుల తప్పుడు తాత్వికత నుండి గుణపాఠం నేర్చుకున్న తనయులున్నారు. తమిళ యువత స్పందనకు కారణమేమైనా ఆ కార్యదీక్ష నుండి ఉత్తేజం పొంది తెలుగు యువత కార్యోన్ముఖం కావడం అభినంద నీయం. ఈ స్పందన నోట్లరద్దు ఫలితాలు మొదలు ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తుందని ఆశిద్దాం.

-సంగిరెడ్డి హనుమంత రెడ్డి
ఒరెబ్రొ, స్వీడెన్