Tuesday, April 23, 2024

గుడిసె@ రూ.5 లక్షల కరెంట్ బిల్లు

- Advertisement -
- Advertisement -

లక్షలాది రూపాయల బిల్లులతో గుండె ఆగే పరిస్థితుల్లో వినియోగదారులు
ప్రైవేట్ వారి తప్పుడు రీడింగ్‌లతో పాట్లు
కట్ చేస్తామన్న బెదిరింపులు
వేలాదిగా అక్రమ కరెంట్ కనెక్షన్ల వినియోగం
కరువైన పర్యవేక్షణ
విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో లబోదిబోమంటున్న వినియోగదారులు

మనతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: ట్రాన్స్‌కో వారి నిర్లక్ష్యంతో వస్తున్న వేలు, లక్షలాది రూపాయల అక్రమ కరెంట్ బిల్లులు నిరుపేద వినియోగదారులకు తలకుమించిన భారంగా మారాయి. గుదిబండలా తయారయిన శక్తికి మించిన ఆ బిల్లులను చూసి వారికి గుండె ఆగినంత పని అవుతుంది. దానితో వారు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లాలో ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగా సవరణలకు కార్యాలయాల చుట్టు నెలల తరబడి తిరుగుతున్న పట్టించుకునే వారు లేరని తల్లడిల్లుతున్నారు.

సామాన్య వినియోగదారుడికి రూ. 5లక్షల కరెంట్ బిల్లు

గణపురం మండలం మైలారంకు చెందిన పేద గృహ వినియోగదారులు చిలుక రాజమల్లుకు గత నెలలో రూ. 5లక్షల 238ల బిల్లు వచ్చింది. మిల్లులు, పరిశ్రమలు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నవారికి రావాల్సిన అంత బిల్లు గుడిసె, రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న సర్వీస్ నెంబర్ 16222820 అతనికి అక్రమంగా ఆ స్థాయిలో వచ్చిన బిల్లుతో అతనికి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేదకు అంత బిల్లు రావడం అతన్ని కలవర పరిచింది. అదే మండలం గాంధీనగర్ క్రాస్‌రోడ్డుకు చెందిన సర్వీస్ నెంబర్ 742 గల వొల్లాల నర్మదకు ఈ నెలలో రూ. 7వేల బిల్లు వచ్చింది. ఆమెకు కూడా రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉంటే సాధారణంగా రూ. 200 నుండి రూ. 300 రావాల్సిన బిల్లు అంత రావడం ఆ కుటుంబానికి ముచ్చెటమలు పట్టించింది. అడిగితే పట్టించుకునేవారు లేరు. ఈ విధంగా జిల్లాలో మరెందరో వినియోగదారులు శక్తికి మించిన విధంగా భరించరాని స్థాయిలో వస్తున్న కరెంట్ బిల్లులు ప్రాణాల మీదికి తెస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.

ప్రైవేట్ వారి తప్పుడు రీడింగ్‌లు

విద్యుత్‌శాఖ వారు అవగాహన లేని కొందరి ప్రైవేట్ వారిచే తీయించే మీటర్ రీడింగ్ అందుకు కారణమవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటికి రాకుండానే వారు ఇళ్లలోనే కూర్చుండి ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన తప్పుకు తాము అనవసరంగా బలి కావాల్సి వస్తుందని, పైగా చెల్లించకుంటే కనెక్షన్లు తొలగిస్తామని బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారని వాపోయారు. అసలే ఈ కరోనా సమయంలో పూట గడవడమే ఇబ్బందిగా మారితే, భారంగా వచ్చే ఆ బిల్లులు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిపారు. ఏ నెల బిల్లు ఆ నెలకు వస్తే బాగుండేదని, అన్ని నెలలది కలిసి ఒకే సారి పెద్దమొత్తంలో బిల్లులు ఇస్తున్నారని, అడిగితే కరోనా పేరు చెప్పి భారీ స్థాయిలో బిల్లులను వేసి అంటకడుతున్నారని మరికొందరు వినియోగదారులు వాపోయారు. ఇది ఇలా ఉంటే గ్రామాలు, మండలాల్లో విచ్చలవిడిగా వేలాదిగా వైర్లకు తగిలించుకుంటు రూపాయి ఖర్చు లేకుండా అక్రమ కరెంట్ వినియోగించుకుంటు హాయిగా ఉంటున్నారని ఫిర్యాదు చేశారు. తమ విషయంగా నిర్బంద వసూళ్లు చేసే వారు అక్రమ కరెంట్ కనెక్షన్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. తాము పారదర్శకంగా బిల్లులు చెల్లిద్దామని అనుకుంటే అక్రమంగా ఈ విధంగా భారీగా వడ్డిస్తున్నారని, దొంగ వినియోగదారులు హాయిగా ఉంటే, మీటర్లు ఉన్న తాము బాధలు పడాల్సి వస్తుందని తెలిపారు. సంవత్సరాలుగా శాఖపర పర్యవేక్షణ లేదని, ఇప్పటికైన అక్రమ కరెంట్ కనెక్షన్లపై దాడులు చేసి పేద వినియోగదారులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News