Home తాజా వార్తలు మధురామృతం ‘సీతాఫలం’

మధురామృతం ‘సీతాఫలం’

Custard Apple

 

రంగారెడ్డి : శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం.. సీతాఫలం.. ఈపేరు వింటే చాలు ఎవ్వరికైనా నోరూరుతుంది. కన్పిస్తే అమాంతం గుటకాయస్వాహా చేయాలన్పిస్తుంది. ప్రోటీన్‌లు, విటమిన్‌లను పుష్కలంగా కలిగి తిన్నవారికి ఆరోగ్యాన్ని పంచుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అటవీప్రాంతాలు, పల్లెశివార్లలో వర్శాకాలంలో సమృద్దిగా లభించే ఈఫలంపై సంక్షిప్త కథనం..

సీతాఫలం నేపథ్యం..
వృక్షశాస్త్ర పరిభాషలో అనోనాస్కామేజాగా పేర్కొనబడిన సీతాఫలాన్ని ఆంగ్లంలో సుగర్ ఆపిల్ అని, తెలుగులో సీతాఫలంగా పిలుస్తారు. ప్లాంటీ రాజ్యానికి, అనోనేసి కుటుంభానికి చెందిన సీతాఫలమొక్క మధ్య అమెరికా, వెస్టిండీస్ దేశాలకు చెందినది. ఈమొక్కను స్పానిష్ వర్తకులైన మనీలాగేలియన్స్ ఆసియాదేశాలకు పరిచయం చేసారు. ప్రాచీన మెక్సికన్‌లు దీనిని ఏట్‌గా పిలుచుకునేవారు. బెంగాల్‌లో ఏటా, నేపాలీలు ఆటీ, సింహలీలు మాటిఆనోడా, బర్మీస్ అవ్‌జార్‌తీ, ఇండోనేసియన్‌లు శ్రీకాయ, ఫిలిప్పీన్స్ ఎటిస్‌గా పిలుచుకుంటారు. పోర్చుగీస్‌వారు ఏటాగా భారతీయులు సీతాఫల్‌గా పిలుస్తారు.

సీతాఫల మొక్క స్వరూపం..
సీతాఫలంమొక్క 3నుంచి 6 మీటర్ల పొడవు పెరుగుతుంది. పత్రాలు హరితవర్ణంలో వెడల్పాటి పొడవైన ఆకృతిలో ఉంటాయి. వేళ్లు కొంతమేరకు భూమిలోకి చొచ్చుకుపోతాయి. కొమ్మలు కాస్త బలహీనంగా ఉంటాయి. వర్శాకాలం ఆరంభంలో చెట్టు కొమ్మల్లో మొగ్గలు విరగబూస్తాయి. సకాలంలో వర్శాలు సమృద్దిగా కురిసినట్లయితే మొగ్గలు విచ్చుకొని కాయలుగా రూపాంతరం చెందుతాయి. కాలక్రమేణా కాయలు పండ్లుగా మారుతాయి. ఈప్రక్రియంతా కేవలం రెండు నుంచి నాలుగైదు నెలల కాలవ్యవదిలో పూర్తవుతుంది. జూన్-, జూలైమాసాల్లో మొదలుకొని అక్టోబర్, నవంబర్ మాసాల వరకూ ఫలాలు అందుబాటులో ఉంటాయి. అటవీప్రాంతాల్లో ఈమొక్కలు విస్తారంగా కన్పిస్తాయి.

నోరూరించే రుచి..
అమృతాన్ని తలపించే రుచితో సీతాఫలం నోరూరిస్తుంది. కాయదశలోనూ నిప్పుల్లో కాల్చితింటే అమోఘమైన రుచిని కలిగిఉంటుంది. పల్లెప్రాంతాల్లో రైతులు తమ వ్యవసాయక్షేత్రాల్లో లభించే సీతాఫలకాయలను కర్రలతో పేర్చిన టెంకిపై కాల్చి వీటిని ఆరగిస్తారు. కాయలు ఆపిల్ సైజులో ఉండి గుండ్రటి బొడిపెలతో ఉంటాయి. కాయలు హరితవర్ణం నుంచి ఎరుపు, పసుపుగోధుమవర్ణంలోకి చేరినప్పుడు పాకానికి చేరినట్లు గుర్తిస్తారు. ఈదశలో కాయలు మంచి రుచికి వస్తాయి. చెట్లపై అలాగే వదిలేసినట్లయితే కాయలు పండ్లుగా మారతాయి. అయితే ఈకాయలను చెట్టునుంచి తెంచి గడ్డివాముల్లో మగ్గబెడతారు. మూడురోజుల అనంతరం అవి పండ్లుగా మారి తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. పండు లోపలిభాగం గుజ్జుమాదిరిగా ఉండి మధ్యలో అక్కడక్కడా గింజలుంటాయి.

ఆరోగ్యప్రదాయిని..
వృక్షశాస్త్రనిపుణులు సీతాఫలాన్ని ఆరోగ్యప్రదాయినిగా పేర్కొంటారు. మనుషులకు ఇది బలవర్దకమైన ఆహారం. ఆరోగ్యాన్ని పంచి రోగనిరోధకశక్తిని పెంచే పోషకాలెన్నో ఈఫలంలో పుష్కలంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రధానంగా ఈఫలంలో సి విటమిన్ అత్యధికంగా లభిస్తుంది. అలాగే విటమిన్ బి6, బి2, బి3, బి5, బి9లతోపాటు థయామిన్, ఐరన్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, పొటాషియమ్‌లను తగుపాళ్లలో కలిగి ఉండటం విశేషం.

మార్కెట్‌లో మహాప్రసాదం..
రుచిలో అమృతాన్ని తలపించే సీతాఫలానికి మార్కెట్‌లోనూ మంచిగిరాఖీ ఉంటుంది. రైతులు అటవీప్రాంతాలనుంచి సేకరించిన ఈఫలాలను చిన్నచిన్నపట్టణాలు మొదలుకొని మహానగరాలకు తరలిస్తుంటారు. ఒక్కో పండు ధర రూ.10నుంచి 15 వరకూ పలుకుతుంది. మహానగరాల్లో అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈసీతాఫలాన్ని ఆహారంగా స్వీకరించాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు.

Custard Apple is a store of Nutrients