Home స్పెషల్ ఆర్టికల్స్ సైబర్ నేరగాళ్ల కొత్తరకం దోపిడీ

సైబర్ నేరగాళ్ల కొత్తరకం దోపిడీ

Cyber-Crimes

 ఈ-వాలెట్‌లతో నగదు కాజేస్తున్న వైనం..  రికవరీ, పోలీసులకు చిక్కకుండా నేరగాళ్ల ఎత్తుగడలు

సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు కొత్త రకం దోపిడీకి శ్రీకారం చుట్టారు. దోచుకున్న సొత్తు పోలీసులకు రికవరీ కాకుండా కొత్త ఎత్తుగడలు వేస్తూ పోలీసులకు అనేక సవాళ్లను సృష్టిస్తున్నారు. టెక్నాలజీని వేదికగా చేసుకుంటున్న నేరగాళ్లు ఆన్‌లైన్ లావాదేవీలలో ఆరితేరిపోతున్నారు. నిమిషాల్లో పదుల సంఖ్యలో ఈ-వాలెట్స్ ఖాతాలను మారుస్తూ దోచుకుంటున్నారు. దోచుకున్న సొత్తును ఈ-వాలెట్స్ ద్వారా దారి మళ్లిస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఈ వాలెట్‌లకు బదిలీ చేసి చివరకు ఈజీగా వస్తువులు అమ్ముడుపోయి చేతికి నగదు వచ్చే వాటిని కొనుగోలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని సైబర్ నేరగాళ్లు అనుభవిస్తున్నారు.

ఈ వాలెట్స్‌ను శోధించేలోపే సైబర్ క్రిమినల్ చోరీ సొత్తుతో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తూ పోలీసులకు దొరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా 12 రూటులలో నగదు లావాదేవీలను మళ్లిస్తున్న సొత్తును రికవరీకి పోలీసులు చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా ఈ తరహా దారి మళ్లింపు ఐడియాలను ఎక్కువగా మన దేశంలోని సైబర్ క్రిమినల్స్ ఈ ప్రక్రియలో తమ నేర స్ట్రైల్‌ను నడిపిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా జార్ఖండ్‌లోని జాంతారా, దేవ్‌ఘర్ ప్రాంతాలకు చెందిన ఎక్కువ సైబర్ క్రిమినల్స్ వందలాది ఈ వాలెట్స్‌ను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వాలెట్ ఎందుకంటే… మీరు ఒక బ్యాంకులో ఖాతా తెరవాలంటే అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఫొటో తదితర దృవీకరణ పత్రాలు అవసరం ఉంటుంది. అదే ఒక వాలెట్ కావాలంటే ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఆ ఫోన్ నెంబరులో ఈ వాలెట్ ఖాతాను తెరుచుకోవచ్చు. ఈ వాలెట్‌కు సంబంధించిన ఖాతాలో సభ్యుడి వివరాలు కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఇలా ఫోన్ నెంబర్‌కు సంబంధించిన సిమ్‌కార్డును సహజంగానే సైబర్ క్రిమినల్స్ ఇతరులకు సంబంధించిన పత్రాలతో ఆ సిమ్‌కార్డులను పొందుతారు. దీని ద్వారా పోలీసులు దర్యాప్తు చేసినా సైబర్ క్రిమినల్ దొరికే ఛాన్స్ ఉండదు. దీనికి తోడు ఈ వాలెట్‌ను పోలీసులు స్తంభింప చేస్తున్నారని తెలియగానే ఈ వాలెట్‌కు సంబంధించిన ఫోన్ సిమ్‌కార్డును పడేస్తారు. దీంతో ఇంకా వారి ఆచూకీ దొరకడం అసాధ్యం.

ఈ విధంగా ఈ-వాలెట్ ఖాతాలను అందించే సంస్థలు మన దేశంలో మొత్తం 22 ఉన్నాయి. అంటే ఒక ఫోన్ నెంబర్‌ఱతో 22 ఈ వాలెట్‌లను తెరుచుకోవచ్చు. దీంతో ఒక సిమ్‌కార్డుకు 22 ఈ వాలెట్ ఖాతాలు తెచుకుంటాయి. అదే సైబర్ క్రిమినల్ ఐదు సిమ్ కార్డులను ఉపయోగిస్తే దాదాపు 110 ఈ వాలెట్ ఖాతాలను తెర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దోచుకునే నగదును ఈ వాలెట్‌ల లో బదిలీ చేసుకుని అక్కడి నుంచి వారికి ఉండే వదలకొద్ది ఈ వాలెట్‌లతో బదిలీ చేసుకుంటూ ఆన్‌లైన్ షాపింగ్ చేశారనుకోండి అది రికవరీ కావడం కష్టసాధ్యమేనని పోలీసు లు అంటున్నారు. మరోవైపు ఈ వాలెట్‌ల సేవలు 24/7 ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది.

నేరగాళ్ల పేకాట.. సైబర్ క్రిమినల్స్ అమాయకులకు మాయ మాటలు చెప్పి దోచుకునే డబ్బును ఖరీదైన విలాసాలకు ఖర్చుపెడుతున్నారు. లక్షల్లో ఆన్‌లైన్ సైట్స్‌లలో పేకాటను ఆడేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా త్రీ కార్డ్‌ను అధికంగా ఆడుతున్నట్లు పోలీసు లు గుర్తించారు. మరికొంత మంది పాయింట్స్‌కు వేలాది రూపాయల చొప్పున పందెం పెట్టి రమ్మీని ఆడుతున్నా రు. ఇలా సైబర్ క్రిమినల్స్ తమ పేకాట సరదాను అమా యకుల సోత్తుతో తీర్చుకుంటున్నారు. ఇలా ఖర్చు పెట్టి న డబ్బును రికవరీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదు. మరి కొందరైతే నీలి చిత్రాలను వెబ్‌సైట్‌ల లో కొనుగోలు చేసుకుని చూస్తుండడం వారి విలాస వృదా ఖర్చుకు అద్దం పడుతోంది. ఈ వాలెట్ ద్వారా మరికొంత మంది నేరగాళ్లు గోల్డ్ కాయిన్స, స్మార్ట్‌ఫోన్‌లను అధికం గా కొనుగోలు చేస్తున్నారు.

ఇలా కొనుగోలు చేసిన వాటిని తిరిగి ఈజీగా మార్కెట్‌లో తెలిసిన వారికి 40 శాతం ధరను తగ్గించి విక్రయించి కరెన్సీ కింద మార్చు కుంటు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ కూడా పోలీ సుల కంట పడకుండా ఉండేందుకు ఈ వాలెట్ ద్వారా ఈ సామాగ్రిని బుక్ చేసే సమయంలో ప్రధానంగా ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ తరువాత చిరునామాను గందరగోళ పద్ధతిలో ఇస్తారు. డెలివరీ చేసే బాయ్ ఆ చిరునామా దొర కక నేరుగా అతనికి ఫోన్ చేస్తారు. అలా ఎవరికి అనుమా నం రాకుండా సైబర్ క్రిమినల్స్ సామాగ్రిని తమ ఇంటి కి తెప్పించుకుంటున్నారని పోలీసుల విచారణలో తెలి సింది. చాలా కేసుల్లో ఈ విధంగా సైబర్ క్రిమినల్స్ మోసగించి సంపాదించిన సొత్తును ఇలా మళ్లించుకుని నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తు న్నారని పోలీసుల విచారణలో తేలింది.

ప్రజలు వెంటనే స్పందిచాలి… రియజుద్దీన్ సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్
సైబర్ క్రైమ్ నేరస్థులు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తుంటారు. తాజాగా వారు ఈ వాలెట్స్ ఖాతాల ద్వారా అక్రమంగా సంపాదించే నగదుతో షాపింగ్‌లు, గోల్డ్, స్మార్ట్ ఫోన్‌లు కొంటున్నారు. ఆన్‌లైన్ పేకాట, వెబ్‌సైట్ ద్వారా ఖరీదైన నీలి చిత్రాలను కొనుగోలు చేస్తున్నారు. దొరక్కుండా ఉండేందుకు అనేక ప్రయాసాలు పడుతున్నారు. దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలతో వేగంగా స్పందిస్తూ ఆయా ఈ వాలెట్ సంస్థలను లేఖలు రాస్తునాం. వెంటనే వాలెట్‌లో నగదు ఉంటే వాటని ఫ్రీజ్ చేస్తున్నాం. కాని ఇదంతా బాదితుడి బాధితుడు వేగంగా స్పందిస్తే సాధ్యమవుతుంది. ఆలస్యం చేస్తే రికవరీ కష్టంగా మారింది. మొదట మీకు గుర్తు తెలియని వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడితే అనుమానించడండి. మీ బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల గురించి అడగానే ఫోన్ కట్ చేయండి.