Home మెదక్ సైబర్ మోసం

సైబర్ మోసం

 క్షణాల్లో రూ.29 వేలు మాయం

లబోదిబోమన్న రైతు
cyberమన తెలంగాణ/సిద్దిపేట: హలో.. మిస్టర్ కత్తుల నర్సింలు…నేను బ్యాంకు మేనేజర్‌ని మాట్లాడుతున్నా…తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా..మీ బ్యాంకు ఎటిఎం కార్డు నెంబర్ మార్చాలి.. ఆధార్‌తో లింక్ చేయాలి అన్న ఫోన్ కాల్‌తో అది నిజమని నమ్మిన రైతు నర్సింలు ఆధార్ నెంబర్ చెప్పారు. వెంటనే మీ ఎటిఎం పాస్‌వర్డ్ నెంబర్ చెప్పండి అనగానే ఎటిఎం నావద్ద ఉండగా డబ్బులెలా పోతాయన్న ధీమాతో పాస్‌వర్డ్ చెప్పారు నర్సింలు. చెప్పిన నిమిషానికే తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్లుగా సెల్‌కు మెసేజ్ రావడంతో బాధిత రైతు నర్సింలు కుప్పకూలిపోయాడు. ఖాతా నుంచి రూ.29 వేలు మాయమైన ఘటన మెదక్ జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో బుధవారం చోటు చేసుకుంది. తొగుట పోలీసులు, బాధి తుడు నర్సింలు కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. బాధితుడు నర్సింలుకు దొమ్మాట ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా ఉంది. ఉదయం 10.30 గంటలకు 97351 82074 నుంచి నర్సింలు సెల్‌కు ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి అడిగిన వివరాలన్నీ బ్యాం క్ వారు అనుకొని నర్సింలు ఎటిఎం పాస్ వర్డ్‌తో సహా చెప్పేశారు. అంతే 30 నిమి షాల్లో 8 చోట్ల డ్రా చేసినట్లుగా బాధితుడి సెల్‌కు మెసేజ్ రావడంతో షాక్‌కు గురయ్యాడు. అంతే తేరుకున్న బాధితుడు నర్సింలు బ్యాంక్ అధికారులతోపాటు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ వస్తుంటాయని, వీటిని నమ్మి మీ సమాచారం ఇవ్వవద్దని బ్యాంక్ అధికారులు చెప్పారు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా బ్యాంక్‌కు వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. తక్షణమే స్పందించి న్యాయం చేయాలని నర్సింలు లబోదిబోమంటున్నాడు.
సైబర్ నేరాలకు పాల్పడేవారు ఇలాగే మోసం చేస్తారని సిఐ వెంకటయ్య తెలిపారు. పలానా అధికారినంటూ అమాయకులను ఇలా బురిడీ కొట్టిస్తారని చెప్పారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.