Home జాతీయ వార్తలు బెంగాల్‌లో ‘బుల్‌బుల్’ విలయం

బెంగాల్‌లో ‘బుల్‌బుల్’ విలయం

Cyclone Bulbul

 

మూడు జిల్లాల్లో విధ్వంసం సృష్టించిన పెను తుపాను
పెను గాలులకు నేలకొరిగిన వేలాది వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
రాష్ట్రంలో ఏడుగురు మృతి, ఒడిశాలో మరో ముగ్గురు
లక్షలాది మందిపై ప్రభావం
ముఖ్యమంత్రి మమతతో మాట్లాడిన ప్రధాని, అమిత్‌షా
అన్ని విధాల ఆదుకుంటామని హామీ
యుద్ధ ప్రాతిపదికపై కొనసాగుతున్న సహాయక చర్యలు

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ బుల్‌బుల్’ తుపాను పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పెను తుపానుగా మారిన బుల్‌బుల్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న సాగర్ ద్వీపం వద్ద తీరాన్ని దాటింది. దీని ఫలితంగా కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నపూర్ జిల్లాల్లో ఉద్ధృతంగా గాలులు వీచడంతో పాటుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలులుకు విద్యుత్ స్తంభాలు, వందలాది భారీ వృక్షాలు నేలకూలాయి. అనేక చోట్ల విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపోయాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని వివిధప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డం, విద్యుత్ షాక్‌లాంటి వివిధ కారణాల వల్ల కనీసం ఏడుగురు చనిపోయారు. ఒక్క ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే అయిదుగురు చనిపోయారు. జిల్లాలోని బసీర్హట్ ప్రాంతంలో పుర్బ మకాల గ్రామంలో చెట్టు విరిగి మీద పడ్డంతో సుచిత్రా మండల్ అనే వృద్ధురాలు చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

గోఖ్నా గ్రామంలో కూడా చాలా చెట్లు నేల కూలాయి. ఒక చెట్టు విరిగిపడ్డంతో రెబా బిశ్వాస్(47) అనే వ్యక్తి చనిపోయాడు. అలాగే విద్యుదాఘాతం కారణంగా మనీరుల్ ఘాజి(59)చనిపోయాడు. జిల్లాలో మరో ఇద్దరు.. గోడకూలి ఒకరు, చెట్టు విరిగిపడి మరొకరు చనిసోయినట్లు రాష్ట్రప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో కూడా చెట్టు మీదపడి ఒక వ్యక్తి చనిపోయాడు. తుపాను తీరం దాటడానికిముందు కూడా భారీ వర్షాలకు చెట్టు విరిగిపడి నగరంలోని పేరుమోసిన ఒక క్లబ్ ఉద్యోగిపై చెట్టుకొమ్మ విరిగిపడడంతో అతను చనిపోయాడు. గాలుల హోరుకు వందలాది చెట్లు, విదుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు నేలకొరిగాయి. ఇప్పటివరకు 7,815 ఇళ్లు, 850 వృక్షాలు, 950 సెల్‌టవర్లు దెబ్బతిన్నాయని హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోంచి బైటికి రావద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ తుపాను ధాటికి ఒడిశాలో సైతం ముగ్గురు చనిపోయారు. రెండు రాష్ట్రప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టెలిఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంనుంచి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, రోడ్లపై కూలిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో పాటు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అహర్నిశం శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తోడివేసేందుకు, రోడ్లపై పడిన చెట్లను తొలగించేందుకు ఇప్పటికే సిబ్బందిని రంగంలోకి దించామని, ఈ రోజు రాత్రికల్లా పని పూర్తవుతందని భావిస్తున్నామని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు చెప్పారు. వీలయినంత త్వరగా కూలిన చెట్లను తొలగించడానికి అన్ని ఎమర్జెన్సీ సర్వీసలను రంగంలోకి దించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి జావేద్ ఖాన్ చెప్పారు.

కాగా సోమవారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని తుపాను తాకిడికి దెబ్బతిన్న నామ్‌ఖానా, బఖ్ఖాలి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరపనున్నట్లు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. అలాగే ఈ నెల 13న ఉత్తర 24 పరగణాల జిల్లాలో పర్యటించనున్నట్లు కూడా ఆమె తెలిపారు. కాగా, ఆదివారం మధ్యాహ్నానికి కాస్త తెరపి ఇవ్వడంతో జనంధైర్యం చేసి వర్షంలోనే మెల్ల మెల్లగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. కాగా తుపాను క్రమేణా బలహీనపడి బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణించనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. మరో 24 గంటలు తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్‌తో పాటుగా ఈశాన్య రాష్ట్రాలపై ఉండే అవకాశముందని వారు తెలిపారు.

Cyclone Bulbul kills seven in West Bengal