Home జాతీయ వార్తలు తీరం దాటిన ‘గజ’ తుపాను

తీరం దాటిన ‘గజ’ తుపాను

Cyclone Gaja crosses Tamil Nadu coast

చెన్నై: పశ్చిమ బబంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నాగపట్నం, వేదారణ్యం మధ్య తీరాన్ని దాటినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచడంతో తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. తుపాను కారణంగా ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నాగపట్నం, కారైకల్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులకు వందలాది చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు సైతం ఆటంకం ఏర్పడింది.తుపాను తీరం దాటడం మొదలైనప్పటినుంచి కడలూరు, నాగపట్నం, తొండి, పంబన్, కారైకల్, పుదుచ్చేరి లాంటి తీరప్రాంత జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి.

తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు 20 మంది మృతిచెందారు.ఒక్క తంజావూరు జిల్లాలోనే పది మంది చనిపోగా, తిరువారూర్‌లో నలుగురు, పుదుక్కోటైలో ముగ్గురు, తిరుచ్చిలో ఇద్దరు, నాగపట్నంలో ఒకరు మృతిచెందారు. శుక్రవారం ఉదయానికి కడలూరులో 8, నాగపట్నంలో 5, పుదుచ్చేరి, కారైకల్‌లలో అయిదేసి సెంటీమీటర్ల వర్షం కురిసింది. తుపాను తీవ్రత దృష్టా తమిళనాడు ప్రభుత్వం గురువారమే హైఅలర్టు ప్రకటించింది. కడలూరు, నాగపట్నం, పుదుక్కోటై, తంజావూరు, రామనాథపురం, తిరువారూర్ జిల్లాలోని పల్లపు ప్రాంతాలనుంచి దాదాపు 82వేల మందిని ఖాళీ చేయించి 471 షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. గురువారం సాయంత్రంనుంచే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఏడు జిల్లాల్లో విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తీరం దాటిన పెను తుపాను వశ్చిమ దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను బీభత్సంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలైన వారికి 25 వేల రూపాయల సాయం అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో రెండు రోజుల్లో విద్యుత్‌ను పునరుద్ధరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. తుపాను కారణంగా వివిధ రంగాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు.

కాగా, తుపాను సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఏజన్సీ తీసుకున్న ముందస్తు చర్యలను ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె ప్రశంసించింది. అన్నాడిఎంకె ప్రభుత్వ చర్య దేన్ని కూడా దాని బద్ధ విరోధి అయిన డిఎంకె కొనియాడ్డ అత్యంత అరుదు. కానీ ఈ సారి మాత్రం డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తుపానును ఎదుర్కొన్న తీరు అద్భుతం అని ప్రశంసించారు. అంతేకాదు సహాయక చర్యల్లో పార్టీ కార్యకర్తలు సైతం చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తుపాను తాకిడి ఎక్కువగా ఉన్న నాగపట్నం జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు నాలుగు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందిలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణకు చెందిన రెండు బృందాలను కడలూరు జిల్లాకు పంపించారు.
అవసరమైనసాయం అందిస్తాం: రాజ్‌నాథ్‌సింగ్
గజ తుపానుతో అల్లాడిపోతున్న తమిళనాడును కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తమిళనాడులో పరిసిత్థులను సమీక్షించాల్సిందిగా హోం కార్యదర్శి రాజీవ్ గౌబాను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి అవసరమౌన సాయాన్ని అందించాల్సిందిగా హోం కార్యదర్శిని ఆదేశించామని, ఆయన రాష్ట్ర పరిస్థితిని సమీక్షిస్తున్నారని రాజ్‌నాథ్ ఓ ట్వీట్‌లో తెలిపారు.

Cyclone Gaja crosses Tamil Nadu coast

Telangana News