Home ఎడిటోరియల్ తమిళనాట ‘గజ’ బీభత్సం

తమిళనాట ‘గజ’ బీభత్సం

Tamil Nadu Cyclone Gaja

 

గజ తుఫాను తర్వాత తమిళనాడులో ఆకలికి అల్లాడుతున్న బాధితులు సహాయకార్యక్రమాల కోసం వచ్చిన ఒక కారు వెనుక పరుగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులో గజ సృష్టించిన విధ్వంసానికి ఒక ఉదాహరణ ఆ వీడియో. గజ ఎంత విధ్వంసం సృష్టించిందో పూర్తిగా లెక్కలు తేలలేదు. రాష్ట్రప్రభుత్వం ఇంకా ఈ సంక్షోభాన్ని చక్కదిద్దడానికి సతమతమవుతోంది. విచిత్రంగా కేంద్రప్రభుత్వం అస్సలు పట్టించుకున్నట్లు కనబడడం లేదు. జాతీయ మీడియాలో కూడా ఈ వార్తలు పెద్దగా లేవు.

గజ తుఫాను తమిళనాడులో ఎనిమిది జిల్లాలను అతలాకుతలం చేసింది. ఇందులో నాగపట్నం, తిరువరూరు, తంజవూరు జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తిరుచిరాపల్లి, పుదుక్కోటాయ్, చిదంబరం, కడలూరు జిల్లాలు కావేరీ డెల్లా జిల్లాలు. ఈ జిల్లాల్లోను తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతం చారిత్రకంగా చోళుల పాలనలో ఉన్న ప్రాంతం. వరి పంటలకు ప్రసిద్ధి చెందింది. 20 శతాబ్దం మొదటి అర్థభాగం వరకు కావేరీ జీవనదిలా ప్రవహించేది. కాని 1960 తర్వాతి నుంచి కావేరీపై నిర్మించిన ఆనకట్టల వల్ల ప్రవాహం తగ్గిపోయింది. 1990 తర్వాతి నుంచి నాగపట్నం రైతులు ఇక వరిపంట వేయడం మానేశారు. ఎందుకంటే కావేరీ దిగువన ఉన్న నాగపట్నానికి నీరు అందడమే లేదు.

వరిపొలాలను కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలుగా మార్చుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు దేశంలో వరిపండించే రాష్ట్రాల్లో ఐదవస్థానంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం సాగువిస్తీర్ణంలో 30.77 శాతం మాత్రమే వరివేస్తున్నారు. నాగపట్నంలో ఇతర పంటలవైపు రైతులు మళ్ళినప్పటికీ ఇప్పటికి కూడా చాలా పెద్ద విస్తీర్ణంలో అంటే 1,54,040 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పండిస్తున్నారు. తిరువరూరులో 1,51,629 హెక్టార్లలోను, తంజవూరులో 1,50,228 హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంటలున్నాయి. ఈ పంటలన్నీ గజ దెబ్బకు నాశనమయ్యాయి.

ఈ జిల్లాల్లో కరువాయ్ సీజను అంటే మే నుంచి అగష్టు వరకు వరి పండిస్తారు. ఆ తర్వాత సంబా సీజను అంటే అగష్టు నుంచి ఫిబ్రవరి వరకు పండిస్తారు. కరువాయ్ లో బలహీనమైన నైరుతి రుతుపవనాలే ఆధారం. సంబ సీజనులో ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు బాగానే ఉంటాయి. అందువల్ల కరువాయ్ సీజనులో పంటలకు కావేరీ నీళ్ళు చాలా అవసరం. కాని కావేరీలో నీళ్ళు లేవు. అందువల్ల ఈ సీజనులో సాగు కూడా ఉండడం లేదు. 2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 2015-2016 సంవత్సరంలో తంజవూరు రైతులు 1,09,799 హెక్టార్ల విస్తీర్ణంలో సంబా సీజనులో వరి వేశారు. అంటే సంబా సీజనులోనే రైతులకు సాగు అవకాశం ఉంది. ఈ సీజనులోనే పంటలతో కళకళలాడుతున్న పొలాలను గజ నాశనం చేసింది. ఒక్కతంజవూరులోనే లక్ష హెక్టార్ల పంట నాశనమైంది. దాదాపు లక్ష టన్నుల దిగుబడి నాశనమైంది. నాగపట్నం, తిరువరూరు జిల్లాలలో నష్టం కూడా కలిపితే దాదాపు 4 లక్షల టన్నుల దిగుబడి నాశనమైంది. ఇది కేవలం వరి పంట నష్టం మాత్రమే.

తమిళనాడు దేశంలో మూడవ అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తి రాష్ట్రం. గజ వల్ల కోటి కొబ్బరిచెట్లు కూలిపోయాయి. అంటే ఏటా 60కోట్ల కొబ్బరికాయల పంట వచ్చే ఐదేళ్ళ వరకు ఉండదు. గజ వల్ల తోటలు నాశనమైన వారు ఇప్పుడు వాటిని బాగు చేసుకుని మళ్ళీ పంట వేసుకొని ఐదేళ్ళు వేచి ఉంటే తప్ప కొబ్బరి దిగుబడి ఉండదు. ఎంతమంది రైతులు మళ్ళీ సిద్ధపడతారన్నది అనుమానమే. తమిళనాడులో 90 శాతం రైతులు చిన్నకారు, సన్నకారు రైతులే. వ్యవసాయమే వారి జీవనోపాధి. ప్రతి రైతు అప్పుల భారం మోస్తున్నాడు. గత 20 సంవత్సరాల్లో రైతు ఆత్మహత్యలు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. కావేజీ జలవివాదం కొనసాగుతూనే ఉంది. 2016లో తమిళనాడులో 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలతో పోల్చితే ఇది తక్కువే అయినా తమిళనాడులో రైతు ఆత్మహత్యలు పెరగడం ఇంతకు ముందు లేదు.

గజ తుఫాను తర్వాత రైతుల కష్టాలు మరింత పెరిగాయి. తుఫాను వల్ల పంటలే కాదు, ఇండ్లు, పశువులు, బోరుబావులు, కాలువలు, కరంటు పరికరాలు, వాహనాలు, ఇంటిసామాన్లు అన్నీ నష్టపోయారు. గజ తుఫాను జీవితాలను నాశనం చేసింది. పంట నష్టాన్ని రైతు ఏదోఒక విధంగా భరించవచ్చు. కాని ఈ నష్టాలన్నింటిని ఎలా తట్టుకుంటాడు. ప్రభుత్వ సహాయం లేకపోతే రైతు బతకగలడా? కాని ఆ సహాయం ఇప్పుడు కనబడడం లేదు. నాగపట్నంలో నాలుగు తాలూకాల్లో 157 గ్రామాల్లో లక్ష ఇళ్ళను గజ తుఫాను కూల్చేసింది. ఇంకా లెక్కలు పూర్తి కాలేదు. ప్రభుత్వం కూలిపోయిన ఇంటికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటి మరమ్మత్తులకు 4వేల రూపాయలు ప్రకటించింది. ఇది సరిపోతుందా? నాగపట్నం, పుదుకొట్టాయ్ జిల్లాలు తీరప్రాంతంలో ఉన్నాయి. తీరప్రాంతంలో పడవలన్నీ సర్వనాశనమయ్యాయి. సముద్రంలో ఇక పడవలు కనిపించాలంటే చాలా కాలం పడుతుంది. చేపలు పట్టేవారి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది.

గజ తుఫాను తర్వాత నాలుగు వారాల వరకు ఈ ప్రాంతంలో పశువుల కళేబరాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వానికి వాటిని చూపిస్తే సహాయం లభిస్తుందన్నది బాధితుల ఆశ. పశువులను కోల్పోయినట్లు చెప్పాలంటే ఆ పశువుల కళేబరాలే సాక్ష్యాలు. ప్రభుత్వసహాయం ఎంత ఆలస్యంగా, ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 2016లో వర్దా తుఫాను చెన్నైను తాకినప్పుడు 10వేల కరంటు స్తంభాలు కూలిపోయాయి. నగరంలో కరంటు సరఫరా పునరుద్ధరించడానికి వారం పట్టింది. గజ ఎనిమిది జిల్లాలపై దాడి చేసింది. కూలిపోయిన కరంటు స్తంభాలకు లెక్కే లేదు. నెలరోజుల తర్వాత కూడా ఈ ప్రాంతాల్లో కరంటు లేదు. కరంటు సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పలేని పరిస్థితి. కరంటు రానంత వరకు వ్యవసాయ కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. పరిశ్రమలు పనిచేయవు. అంటే ఎవరికీ ఎలాంటి పనిలేదు. జీవనోపాధి లేదు. ఇప్పుడు ఇక్కడ ఎటు చూసినా శిధిలాలే ఉన్నాయి. తమ స్వంత నేలపైనే శరణార్థుల్లా మారిపోయారు. చాలా కుటుంబాలు రోడ్ల పక్కన, బస్టాండుల్లో తలదాచుకున్నాయి. ప్రభుత్వ షెల్టర్లలో స్థలం చాలడం లేదు.

గజతుఫాను తర్వాత రెండువారాలకు స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం చెప్పింది. అక్కడ షెల్టర్లు ఎత్తేసింది. కాని తలదాచుకున్నవారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితి. కనీసం రాత్రులు తలదాచుకోడానికి అనుమతి ఇవ్వమని కోరినా ప్రభుత్వాధికారులు ఒప్పుకోలేదు. కావేరీ బేసిన్ చోళ రాజ్యం మొత్తానికి ఆహారం పండించిన ప్రాంతం. ఇప్పుడు ఆకలిబాధతో నకనకలాడుతున్న ప్రజల ప్రాంతం. సహాయకార్యక్రమాలకు ఒక్క వాహనం కనిపిస్తే చాలా దాని వెనుక పరుగెత్తే ప్రజలు. గజ తుఫాను ఏదో ఒక చిన్న ప్రదేశాన్ని కాదు ఎనిమిది జిల్లాలను నాశనం చేసింది. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి. లేకపోతే తమిళనాడు రైతుల కష్టాలు మరిన్ని ఆత్మహత్యలకు దారితీయవచ్చు. కావేరీ డెల్టాలోని వ్యవసాయభూమి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చవుకగా అమ్ముడుపోవచ్చు.

Cyclone Gaja to weaken before landfall over Tamil Nadu

Telangana Latest News