Saturday, April 20, 2024

తెలంగాణలోనూ ‘గులాబ్’ ప్రభావం: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోనూ ‘గులాబ్‌’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్‌ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది. అందులో.. ‘తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు.

రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల భారీ వానలు కురిశాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.3 పోచంపల్లి (కరీంనగర్​)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, ఆవునూరు (రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 6, సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు చెప్పారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరించింది.

Cyclone Gulab Alert for Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News